Friday, May 23, 2025

రన్యారావుకు వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చారు:డీకే శివకుమార్

- Advertisement -
- Advertisement -

కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రన్యారావు , మంత్రి పరమేశ్వర సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీలపై డీకే మాట్లాడారు. ఆ నటికి మంత్రి పెళ్లికానుక ఇచ్చారని, అందులో తప్పేముందన్నారు. బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధ, గురువారాల్లో దాడులు చేసింది. ఈ కాలేజీకి మంత్రి పరమేశ్వర ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ కేసులో రన్యారావుకు కళాశాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు గుర్తించామని, ఈడీ పేర్కొంది. ఈ క్రమం లోనే నేడు హోం మంత్రి నివాసానికి డీకే శివకుమార్ వెళ్లారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ … “ ఇప్పుడే పరమేశ్వరను కలిశాను. మేం ప్రజా జీవితంలో ఉన్నాం. కొన్ని సంస్థలనూ నడుపుతున్నాం. సాధారణంగా మేం ఎంతోమందిని కలుస్తుంటాం. వారు ఏం చేస్తున్నారో ఎలా తెలుస్తుంది. ఇక వివాహ వేడుకలకు వెళ్లినప్పుడు కూడా డబ్బులు ఇస్తుంటాం. ఇక్కడ నేను చట్టం, ఈడీ సోదాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఏం జరిగిందో వాస్తవం తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. పెళ్లి సమయంలో నటికి గిఫ్ట్‌గా ఇచ్చానని మంత్రి తెలిపారు. అది సహజమే. అందులో ఎలాంటి తప్పు లేదు. ” అని డీకే వ్యాఖ్యానించారు. అయితే రన్యారావు నేర చర్యలను ఏ రాజకీయ నేత కూడా సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. డీకే వ్యాఖ్యలపై హోం మంత్రి పరమేశ్వరను సంప్రదించగా, “ ఆ విషయం శివకుమార్‌నే అడగండి. నేను దర్యాప్తునకు సహకరిస్తా” అని వెల్లడించారు. రన్యారావు స్మగ్లింగ్ కేసులో రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానంతో ఇటీవల జరిగిన ఆమె వివాహానికి హాజరైన వ్యక్తులపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే.

నటి పెళ్లికి హాజరైన అతిథులు , వారిచ్చిన కానుకలపై విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వివాహ వేడుకకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య , హోం మంత్రి జి. పరమేశ్వర హాజరైనట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో హోం మంత్రితో సంబంధమున్న కళాశాలపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యారావు కొన్ని రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో దొరికి పోయిన విషయం తెలిసిందే. ఆమె నుంచి 14.7 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. ఇక ఈ కేసులో నటికి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కాఫిఫోసా చట్టం కింద నమోదైన కేసులో ఊరట దక్కలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News