Tuesday, July 8, 2025

ఒక కుక్క అరుపు.. 67 మంది ప్రాణాలను కాపాడింది!

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ :భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడుతుండటంతో హిమాచల్ ప్రదేశ్ ప్రజల జీవితం దుర్భరంగా మారింది. ఎంతోమంది అయినవాళ్లను కోల్పోయి అనాథలుగా మారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుక్క అరుపు 67 మంది ప్రాణాలను కాపాడింది. హిమాచల్‌లో మండి జిల్లా భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడి సియతి గ్రామంలో జూన్ 30న అర్థరాత్రి ఒంటిగంట సమయంలో పెద్ద కొండచరియ విరిగి పడింది.

ఆ గ్రామస్థుడు నరేంద్ర మాట్లాడుతూ.. “మా ఇంటి రెండో అంతస్తులో ప్రతిరోజూ ఓ శునకం నిద్రపోతుంది. అయితే ఆ రోజు ఉన్నట్టుండి అది విపరీతంగా అరవడం మొదలు పెట్టింది. మరోవైపు కుంభవృష్టి కురుస్తోంది. ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్లాను. పైకి వెళ్లగా ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే కుక్కను కూడా కిందికి తీసుకెళ్లి అందరినీ నిద్రలేపాను. ఇంటి చుట్టుపక్కల వాళ్ల ఇళ్లకు వెళ్లి వారిని కూడా లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. అలా దూరంగా వెళ్లామో లేదో మా గ్రామంపై కొండచరియ విరిగి పడింది. పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక నాలుగైదు ఇళ్లు మాత్రం దెబ్బతినకుండా కనిపించాయి” అని ఆయన వెల్లడించారు.

ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోవడంతో నైరాశ్యం ఆవరించింది. ఇదిలా ఉంటే, మండి జిల్లా లోని తునాగ్ ప్రాంతం లోని కోఆపరేటివ్ బ్యాంక్‌ను వరద నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అందులోని బంగారం, నగదు ఏమైందో ? అని ఆందోళన వ్యక్తమవుతోంది. దాంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు కొట్టుకొని పోకుండా, దొంగల చేతిలో పడకుండా గ్రామస్థులు కాపలా కాస్తున్నారు. కాగా, రుతుపవనాల రాకతో జూన్ 20 నుంచి కురుస్తున్న వర్షాలకు హిమాచల్‌లో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతయ్యిందని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన విభాగం వెల్లడించింది. భారత వాతావరణ విభాగం రాష్ట్రం లోని పది జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News