బారత్‌పై అమెరికా పాతిక శాతం సుంకాలకు ఆమోద ముద్ర ఖరారు సంబంధిత కీలక వివరణాత్మక ప్రకటనను వైట్‌హౌస్ అధికార వర్గాలు విడుదల చేశాయి. ట్రంప్ ప్రకటించినట్లు ఆగస్టు 1 నుంచి (శుక్రవారం) భారత్‌పై సుంకాలు, పెనాల్టీలు అమలులోకి వచ్చాయి. వైట్‌హౌస్ నుంచి కార్యనిర్వాహక ఉత్తర్వులను వెలువరించారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సరుకులపై ఏ స్థాయిలో సుంకాలు ఉంటాయనేది వివరించారు. ఈ క్రమంలోనే భారతదేశంపై పాతిక శాతం టారీఫ్‌ల విధింపు ప్రస్తావన ఉంది. దాదాపుగా 70 దేశాలపై ట్రంప్ భారీ సుంకాలు తుది గడువు తరువాత అమలులోకి వచ్చాయి. పరస్పర సవరిత టారీఫ్ రేట్ల పేరిట కార్యనిర్వాహక ఆదేశాలు వెలువరించారు. భారత్‌పై పాతిక శాతం సుంకాల మోతలో ట్రంప్ ప్రకటిత పెనాల్టీ విషయం ఇప్పటి ఉత్తర్వులలో పొందుపర్చలేదు.
ఆగస్టు 1 కొత్త సుంకాలవిధింపు తేదీ. ఇక ఈ మేరకు వసూళ్లు ఈ నెల 7వ తేదీ నుంచి చేపడుతారు. అయితే అమెరికాకు ఇంతకు ముందుగానే రవాణాకు అనుమతి తీసుకుని రవాణా దశలో ఉన్న భారతీయ సరుకులపై అక్టోబర్ 5 వరకూ తాజా సుంకాల భారం పడదని వెల్లడించారు. పలు సరుకులు సముద్ర మార్గాల ద్వారా రవాణా దశలో ఉన్నాయి. వీటికి అమెరికాలో ఏ స్థాయి సుంకాలతో అనుమతించాల్సి ఉంటుంది? అంతకు ముందటి ఆర్డర్ల పరిస్థితి ఏమిటీ? అనే విషయాలు ఇప్పుడు యుఎస్ కస్టమ్స్ అధికారులకు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ఆసియా సొసైటీ పాలసీ ఇనిస్టూట్ (ఎఎస్‌పిఐ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , అమెరికా మాజీ వాణిజ్య సహాయక ప్రతినిధి వెండీ కట్లర్ తెలిపారు. భారత్‌పై తమ నిరసనను ట్రంప్ ఎప్పుడూ ఎక్కువగా తన ట్రూత్ సోషల్ మీడియా స్పందనల ద్వారా వెలువరిస్తున్నారు.
అధికారిక ముద్ర వీటికి ఏ మేరకు ఉంటుందనేది కీలకంఅని కట్లర్ తెలిపారు. దాదాపుగా ఈ నెల చివరి వరకూ వచ్చే భారతీయ సరుకులకు పాత సుంకాలే ఉంటాయని, ఈ మేరకు వెసులుబాట్లు కల్పించే వీలుందని భారతీయ ఎగుమతుల సంస్థల సమాఖ్య (ఫిఫో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు.మొత్తం మీద ఈ నెల 7 వరకూ పలు సరుకులపై అదనపు భారం పడకపోవచ్చు అన్నారు. ఇక తాజా సుంకాల తరుణంలో సరుకులను పొందే పలు అమెరికా కంపెనీలు కూడా చిక్కులు ఎదుర్కొంటాయి. వాటికి సరఫరాలపై క్రమేపీ అనిశ్చితత నెలకొనే అవకాశం కూడా ఉంది.