వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల చర్యపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ కూడా భారత్‌పై సుంకాలు విధించడాన్ని తప్పుబట్టారు. ఈ సుంకాల కారణంగా అమెరికా బ్రాండ్ పతనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మిత్రదేశాలతో సహా ప్రపంచం లోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదన్నారు. యూఎస్‌ను విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో చైనా వైపు ఆదరణ పెరిగిపోతుందన్నారు. ఇందుకు భారత్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
న్యూఢిల్లీపై పెద్ద మొత్తంలో సుంకాలు విధించడంతో ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో ఆ దేశం బీజింగ్‌తో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది. భారత్‌పై ట్రంప్ భారీ వాణిజ్య దాడి చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా న్యూఢిల్లీ ఇప్పుడు చైనాతో కలవాలని చూస్తోంది” అని జేక్ సులేవాన్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ మధ్యవర్తిత్వానికి భారత్ క్రెడిట్ ఇవ్వకపోవడం ట్రంప్ కోపానికి కారణమని అమెరికా ఫైనాన్షియల్ సేవల సంస్థ జెఫరీస్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో ట్రంప్ వ్యక్తిగత కోపంతో భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని తెలిపింది.