Friday, July 18, 2025

కాళ్ల పారాణి ఆరక ముందే కాటికి

- Advertisement -
- Advertisement -

ఆధునికంగా ప్రపంచంలో ఎన్నో వినూత్న మార్పులు సంతరించుకుంటున్నా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా అద్భుతమైన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నా సంప్రదాయ మూఢాచారాలు కుటుంబాల్లో పెనవేసుకుంటున్నాయి. కన్యాశుల్కం అన్న దురాచారం వందేళ్ల క్రితం ఉండేది. కాసులకు కక్కుర్తిపడి పండు ముదుసలికి ముక్కుపచ్చలారని బాలికను ఇచ్చి పెళ్లి చేసేవారు. ఆ విధంగా వృద్ధుడైన వరుడు అప్పగించే కట్నాలు, కానుకలు తమ ఆస్తులుగా బాలిక తల్లిదండ్రులు సంతోషపడేవారు. ఎలాగోలా ఆ దురాచారం సమసిపోయినా, వరకట్న దురాచారం మాత్రం ఇంకా జీవిస్తుండటం అత్యంత శోచనీయం. కాళ్ల పారాణి ఆరకుండానే అత్తింటి ఆరళ్లు, వరకట్న వేధింపులు పీడిస్తున్నాయి.

ఈ వేధింపుల కారణంగా వధువు కన్నవారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. తెలంగాణలో ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోనే వరకట్న వేధింపు కేసులు (Dowry harassment cases) నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో వరకట్న మరణాలు 2023లో 11 ఉంటే, గత ఏడాది 2024 లో 12కు చేరాయి. ఈ ఏడాది గత ఐదు నెలల్లో ఆరుకు పైగా చోటుచేసుకోవడం గమనార్హం. కెపిహెచ్‌బి కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఖమ్మం జిల్లా యువతితో వివాహమైంది. కొద్ది రోజులకే వరుని కిరాతకం బయటపడింది. మరో రూ. 10 లక్షలు కావాలని భార్యను వేధించి, హింసించేవాడు. ఈ సంగతి తెలిసి ఎలాగోలా తర్వాత ఇస్తామని అత్తింటివారు హామీ ఇచ్చినా వేధింపులు ఆగలేదు. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకోక తప్పలేదు.

అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న అర్ధాంగి వైద్య ఖర్చులకు కూడా కొందరు భర్తలు లెక్కలు కడుతున్నారు. కిడ్నీ సమస్య లేదా గుండె జబ్బులు ఏవైనా వస్తే అవి నయం అయ్యేవరకు పుట్టింటి వద్దనే ఉండాలని బలవంతంగా పంపించేస్తున్నారు. ఆడపిల్ల పుట్టగానే భవిష్యత్తుకు కావాల్సిన డబ్బు పుట్టింటినుంచి తీసుకు రావాలని కొందరు భర్తలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని కూడా ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణ లోనే కాదు దేశం మొత్తం మీద కనిపిస్తోంది. దేశంలో గత మూడు నెలలుగా వరకట్నం చావులు ధారావాహికంగా కొనసాగాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలిగఢ్‌లో కాల్చిన ఇనుపకడ్డీ శరీరం నిండా వాతలు పెట్టడంతో ఓ వివాహిత చనిపోయింది.

రోజూ వరకట్నం కోసం ఆమె వేధింపులకు గురయ్యేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో అత్తవారు కోరినంత వరకట్నం ఇవ్వలేదని కోడలిని సజీవ దహనం చేశారు. ఛండీగఢ్‌లో నవవధువు వరకట్నం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని పొన్నేరి సమీపాన పెళ్లైన నాలుగు రోజులకే వరకట్నం వేధింపులకు నవవధువు ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని తిరుప్పూర్‌లో ప్ళ్ళైన రెండు నెలలకే వరకట్నం వేధింపులకు బలి అయింది. ఈ కేసులన్నీ వరకట్న దురాచారం దేశంలో ఇంకా కొనసాగుతోందనడానికి ఉదాహరణ. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 2017 నుంచి 2022 మధ్యకాలంలో ఏటేటా సరాసరిన 7000 వరకట్నం చావుల కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం నమోదైన కేసులే. నమోదుకాని సంఘటనలు ఇంకా ఎన్నో ఉంటాయి. ఈ డేటాను నిశితంగా పరిశీలిస్తే ఈ కేసులపై దర్యాప్తు చాలా మందకొడిగా సాగుతుండడమే కాక, దోషులకు శిక్షలు పడడం చాలా తక్కువగా కనిపిస్తోంది.

ఏటా సరాసరిన 7000 వరకట్నం మరణాల కేసులు నమోదవుతుండగా, కేవలం 4500 కేసుల్లోనే ఛార్జిషీట్లు దాఖలవుతున్నాయి. మిగతా కేసుల్లో దర్యాప్తు వివిధ స్థాయిల్లో ఆగిపోవడమో లేదా కేసులు ఎత్తివేయడమో జరుగుతోంది. కేసు నిజమైనా సరైన సాక్షాలు లేకపోవడం, తప్పుడు కేసులు, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల నమోదైన కేసులు, తప్పుడు సమాచారం తదితర కారణాలు కనిపిస్తున్నాయి. కొన్ని కేసులు దర్యాప్తు దశలోనే ఆరు మాసాలకు ఆగిపోతున్నాయి. 2022 ఆఖరికి 3000 కేసుల దర్యాప్తు పెండింగ్‌లో పడింది. వీటిలో 67 శాతం ఆరునెలలుగా దర్యాప్తు సాగక ఆగిపోయాయి. ఛార్జిషీటు దాఖలు చేయడంలో అసాధారణ ఆలస్యాలు కూడా ఉంటున్నాయి. 6000 వరకట్నం మరణాల కేసుల్లో చార్జిషీట్లు 2022 లో దాఖలు కాగా, వీటిలో 70% రెండు నెలల ఆలస్యంగా ఛార్జిషీట్లు దాఖలయ్యాయి.

దర్యాప్తు పూర్తయినా, ఛార్జిషీట్లు దాఖలైనా, కోర్టుకు చేరే కేసుల్లో శిక్షపడినవి కొన్ని మాత్రమే. మిగతావి కోర్టు ప్రక్రియల్లో ఇరుక్కుంటున్నాయి. లేదా ఎత్తివేయడం జరుగుతోంది. ఎందుకంటే ఆ కేసులు ఉపసంహరించుకోవడమో లేక రాజీపడడమో జరుగుతోంది. లేదా వ్యాజ్యం సంప్రదింపులతో ముగిసిపోతుంది. కొన్ని కేసుల్లో నిందితుడు సరైన సాక్షం లేక విడుదలవుతున్నాడు. ఏటా సరాసరిన 6500 కేసులు విచారణ అవుతున్నాయి. వీటిలో 100 కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మిగతా 90% కోర్టులో పెండింగ్‌లో ఉంటున్నాయి. మిగతావి పరిశీలిస్తే కొంతమంది దోషులు విడుదలైపోతున్నారు. కొన్ని కేసులు విచారణకు ముందే ఉపసంహరింపబడుతున్నాయి.

మరికొన్ని క్వాష్ అవుతున్నాయి. 20122017 మధ్యకాలంలో దేశంలో సంభవించిన 6100 హత్య ల్లో వీటివెనుక ప్రధానంగా వరకట్నం దురాచారమే కనిపిస్తోంది. వీటిలో 60% హత్యలు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్‌లోనే నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాలతోపాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, కేసుల్లో 80% వరకట్నం మరణాల కేసులే 201722 లో నమోదయ్యాయి. దేశంలో 19 నగరాలనుంచి లభ్యమైన డేటాలో వరకట్నం మరణాల కేసుల్లో 30% ఢిల్లీలోనే నమోదయ్యాయి. దేశంలోని ఏ నగరంలో కన్నా ఢిల్లీలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తరువాతి స్థానాల్లో కాన్పూర్, బెంగళూరు, లక్నో, పాట్నా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News