డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) మూవీని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇక కొచ్చిలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం అంతా పాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తోంది. భాషా హద్దుల్లేకుండా సినిమాల్ని తీస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అన్ని భాషల నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ మూవీని చేశారు.
ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మెహన్ బాబుకి, విష్ణుకి థాంక్స్. శివుడుకి కన్నప్ప గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడి కథను (story devotee) ఎంతో గొప్పగా నిర్మించారు. న్యూజిలాండ్‌లో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు” అని అన్నారు. డా. మోహన్ బాబు మాట్లాడుతూ.. “మోహన్‌లాల్ నాకు సోదరుడి వంటి వారు. ఇక్కడ మోహన్‌లాల్‌తో ప్రియదర్శిని తీసిన ‘చిత్రం’ మూవీని తెలుగులో నేను ‘అల్లుడు గారు’ అని రీమేక్ చేశాను. అలా జీరో నుంచి మళ్లీ స్టార్ హీరోగా నిలిచాను. అలా మా బంధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాల్ ఏమాత్రం మారలేదు.
శారీరకంగా, మానసికంగా అలానే ఉన్నారు. స్వచ్ఛమైన ఆలోచనలు, హృదయం ఉన్నవారే ఇలా ఉండగలుగుతారు. మోహన్‌లాల్ గొప్ప నటులు. జూన్ 27న మా కన్నప్ప చిత్రం రాబోతోంది. అందరూ చూసి మా చిత్రయూనిట్‌ను ఆశీర్వదించండి’ అని తెలిపారు. విష్ణు మంచు మాట్లాడుతూ.. “కన్నప్ప’ మూవీ ఆ శివుడి ఆశీస్సులతోనే జరిగింది.. మోహన్లాల్కి నేను పెద్ద అభిమానిని. ఆయన నాకు తండ్రి సమానులు. మోహన్‌లాల్ ప్రభావం అన్ని తరాలపై ఉంటుంది. ట్రైలర్ చూస్తే మోహన్‌లాల్ పాత్ర ఏంటో అర్థం అవుతోంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో నేను ఇప్పుడే చెప్పలేను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ముఖేష్ కుమార్ సింగ్, అర్పిత్ రంకా, ముఖేష్ రిషి పాల్గొన్నారు.