భారతదేశ ఎంపిల బృందం వెళ్లుతున్న ప్రత్యేక విమానం మార్గమధ్యంలో డ్రోన్ దాడికి గురైంది. పహల్గాం ఉగ్రదాడి , ఇందుకు ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో పాకిస్థాన్ నిజరూపాన్ని తెలియచేసేందుకు సంకల్పించింది. దేశంలోని పలు రాజకీయ పార్టీల ఎంపిలతో కూడిన బృందాలు వేర్వేరుగా బయలుదేరాయి. కాగా డిఎంకె నాయకురాలు, ఆ పార్టీ ఎంపి , కరుణానిధి కుమార్తె కనిమొళి నాయకత్వంలోని ఎంపిల బృందం వెళ్లుతున్న విమానానికి తృటిలో ముప్పు తప్పింది. ఈ ఘటన గురువారం అర్థరాత్రి దాటిన తరువాత జరిగిందని డిఎంకె ఎంపి సన్నిహిత వర్గాలు చెన్నైలో తెలిపాయి. డ్రోన్ దాడితో విమానం గాలిలో చాలా సేపు చక్కర్లు కొట్టింది. పైలట్ ఇతర సిబ్బంది అతికష్టం మీద దీనిని అదుపులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ముప్పావు గంట ఆలస్యంతో విమానం మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
తమ ఎంపి ఇతరులు సురక్షితంగా కిందకు దిగారని పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. పాక్ ఉగ్రవాద ఊతం, దుందుడుకు చర్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియచేసేందుకు ఖరారు చేసిన ఎంపిల బృందాల పర్యటనలో భాగంగా కనిమొళి టీం తొలి దశలో బయలుదేరింది. అయితే రష్యా గగనతలం రాత్రి ఎక్కువగా భీకర దాడులతో దద్దరిల్లింది ఉక్రెయిన్‌తో ఘర్షణల నేపథ్యంలోనే ఈ డ్రోన్ల మెరుపుదాడులు చాలా సేపటివరకూ జరిగాయి. ఈ దశలోనే రష్యా గగనతలం పైకి వచ్చిన ఎంపిల విమానం తాకిడికి గురైంది. అయితే ఈ డ్రోన్లు పెద్దగా శక్తివంతం కాకపోవడంతో విమానానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. సురక్షితంగా మాస్కోలోని డోమోడెవోవా విమానాశ్రయానికి చేరిన ఎంపిల బృందానికి రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. తరువాత వారిని సురక్షిత ప్రాంతంలోని ఓ తీసుకువెళ్లారు. ఈ బృందంలో ఎస్‌పి ఎంపి రాజీవ్ రాయ్, ఎన్‌సి ఎంపి మిమాన్ అల్తాఫ్ అహ్మద్, బిజెపి ఎంపి కెప్టెన్ బ్రిజెష్ చౌత, ఆప్ ఎంపి అశోక్‌కుమార్ మిత్తల్ , కొందరు రాయబారులు ఉన్నారు. పఃన రాత్రంతా గంటల తరబడి జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో రష్యా అధికారులు వెంటనే స్పందించారు.
పలు విమానాల రాకపోకలను నిలిపివేశారు. మొత్తం మీద 153 విమానాల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి సమీక్షించుకుని తాము తాత్కాలిక విమాన యాన ఆంక్షలకు దిగినట్లు అధికారులు తెలిపారు. పలు విమానాశ్రయాలను కొద్ది సేపు మూసివేశారు. మాస్కోకు రావల్సిన విమానాలను వేరే ప్రాంతాలకు తరలించారు. డ్రోన్ల దాడులు, విమానాల రాకపోకలపై ప్రభావం గురించి అధికార వర్గాలు పెద్దగా స్పందించారు. నిర్థిష్ట కారణాలను తెలియచేయలేదు. భారత పార్లమెంటేరియన్లతో కూడిన బృందం తొలి విడత పర్యటనలో అపశృతి అధికార వర్గాలలో కలవరానికి దారితీసింది. దాడులలో విమానానికి ఎటువంటి ముప్పు తలెత్తకపోవడం పట్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. టర్కీ దౌత్యంతో ఉక్రెయిన్, రష్యా మధ్య ఇటీవలే జరిగిన శాంతి చర్చలలో ఎటువంటి సత్ఫలితం లేదనే విషయం ఇప్పుడు మాస్కో చుట్టుపక్కల ఉక్రెయిన్ సాగించిన డ్రోన్ల దాడులతో తేటతెల్లం అయింది. ప్రత్యేకించి మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలోని ఎలెట్స్ పట్టణం భారీ సంఖ్యలో డ్రోన్ల దాడికి గురైందని ఆర్టీవిఐ న్యూస్ పోర్టల్ తెలిపింది. కనిమొళి సారధ్య బృందం రష్యాలోని పలువురు ఉన్నతాధికారులతో, రాయబారులతో , మేధోవర్గంతో మాట్లాడుతుంది.