Wednesday, July 16, 2025

పోలీసు అధికారుల పిల్లల డ్రగ్స్ దందా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇద్దరు పోలీస్ అధికారుల కుమారుల పాత్ర ఉన్నట్లు తేలడంతో ఈగల్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య, మాజీ ఎఎస్పికు మారుడు రాహుల్ తేజ, డిసిపి కుమారుడు మోహన్, హర్ష కలిసి నగరంలో రెస్టారెంట్ల వ్యాపారం పేరుతో డ్రగ్స్ వ్యా పారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు డ్రగ్స్‌ను ప్రముఖులకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ పబ్బుల్లో ప్రత్యేక ప్రాంతాలను  ఏర్పాటు చేసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో మల్నాడు రెస్టారెంట్ యజమాని అమ్మినేని సూర్యపై పోలీసులు నిఘా పెట్టారు, నిందితుడు కారులో డ్రగ్స్ తీసుకుని వెళ్తుండగా ఈగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పోలీస్ అధికారుల కుమారుల పేర్లు బయటికి వచ్చాయి.

వెంటనే దర్యాప్తు చేసిన పోలీసులు రిటైర్డ్ అయి ఎస్‌ఐబిలో ఓఎస్‌డిగా పనిచేస్తున్న వేణుగోపాల రావు కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎఆర్ డిసిపిగా పనిచేస్తున్న అధికారి కుమారుడు మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 2024లో ఎస్‌ఐబీ అధికారి కుమారుడు రాహుల్ తేజ డ్రగ్స్ కేసులో పట్టుబడినా పోలీసులు అరెస్టు చేయలేదని ఈగల్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కనీసం రాహుల్ తేజ బెయిల్ పిటిషన్ వేయకున్నా తండ్రి పరపతితో అరెస్టు కాకుండా ఉన్నట్లు తెలిసింది. నిజామాబాద్ డ్రగ్స్ కేసులో మిగతా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని వాచారించగా, తమకు రాహుల్ తేజ డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పారు. వాటిని హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ నుంచి తీసుకుని వచ్చి తమకు సరఫరా చేశాడని చెప్పారు. రాహుల్, సూర్య , హర్ష కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది.
మరిన్ని పేర్లు బయటికి…
మల్నాడు రెస్టారెంట్ యజమాని అమ్మినేని సూర్యను కస్టడీలోకి తీసుకున్న ఈగల్ పోలీసులు విచారణ చేస్తుండడంతో పలువురి పేర్లు బయటికి వస్తున్నాయి. విచారణలో మరింత మంది బడాబాబులు, రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు బయటికి రానున్నట్లు తెలిసింది. వారి పేర్లు బయటికి వస్తే మరికొంత మంది అరెస్టు తప్పదని తెలుస్తోంది. సూర్య నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరింత మందిని గుర్తించనున్నట్లు తెలిసింది. ఈ నెట్‌వర్క్‌ను ఛేదిస్తే మరికొంతమంది బండారం బయటపడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో సూర్యతో పాటు అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులను ఈగల్ టీం అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు పోలీసు అధికారుల కుమారుల పాత్ర వెలుగులోకి వస్తుంటే మరోవైపు సినీ ప్రముఖులకు సంబంధించిన పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News