మన తెలంగాణ/కంటోన్మెంట్/సిటీ బ్యూరో : పాఠశాలలో డ్రగ్స్ తయారీని ఈగల్ పోలీసులు బట్టబయలు చేశారు, పాఠశాల కింది ఫ్లోర్‌లో తరగతు లు నిర్వహిస్తూ, పై అంతస్తులో డ్రగ్స్ తయారు చే స్తున్నారు. డ్రగ్స్ తయారీ బట్టబయలు చేయడంతో స్థానికులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20లక్షల నగదు, కోటి రూపాయల వి లువైన ఏడుకిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బోయిన్‌ప ల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలోని మేధా పాఠశాలను రెండేళ్ల క్రితం మాలేల జయప్రకాష్ గౌడ్ లీజుకు తీసుకుని పదోతరగతి వరకు పాఠశాలను నిర్వహిస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్‌తో జయప్రకాష్ గౌడ్ తనకు తెలిసిన ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన గౌటే మురళీ (కొరియర్ బాయ్), బోయిన్‌పల్లి హస్మత్‌పేట్‌కు చెందిన పెంటామోల్ ఉదయ్ సాయి (కారు డ్రైవర్)తో కలిసి అల్ఫ్రాజోలం తయారు చేసి నగరంలో కల్లు కాంపౌండ్లకు సరఫరా చేస్తున్నాడు.
ముడి సరుకు రసాయన దుకాణాల్లో కోనుగోలు చేసి తీసుకుని వచ్చి పాఠశాలలోని రెండో అంతస్తులోని రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలంను తయారు చేస్తున్నాడు. పాఠశాలలో మత్తు పదార్థాలకు తయారు చేస్తే ఎవరికీ అనుమానం రాదని తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఎల్‌ఎస్‌డి డ్రగ్స్ వలే కొన్నింటిని తయారు చేసి యువతకు విక్రయిస్తున్నారని, నులిపురుగుల మందులను తీసుకువచ్చి మత్తు వచ్చే విధంగా రసాయనాలను కలిపి కల్లు కౌంపౌండ్‌లకు విక్రయిస్తున్నట్లు బయటపడింది. పాఠశాల భవనంలో భారీగా మత్తు పదార్థాలు, ముడి సరుకు ఉన్నాయన్న సమాచారం మేరకు ఈగల్ టీం ఎస్పీ సీతారాం ,డిఎస్సీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్, టాస్క్‌ఫోర్స్, క్లూస్‌టీం దాడులు చేశారు. నిందితులు అల్ఫ్రాజోలం తయారీకి ముడిసరుకులు ఎక్కడి నుంచి కొనుగోల్ చేస్తున్నారు, ఎవరెవరికి సప్లై చేస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాఠశాల గుర్తింపుపై చర్యలు తీసుకోవాలని విద్యశాఖకు పోలీసులు లేఖ రాయనున్నట్లు తెలిసింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.