బెంగళూరు: సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో చిక్కుకుంది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సౌత్ జోన్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే సౌత్ మరో 233 పరుగులు చేయాలి. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (26), మొహిత్ కాలే (38) ఇప్పటికే పెవిలియన్ చేరారు. స్మరణ్ రవిచంద్రన్ (37), రికి భుయ్ (16) పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులకు ఆలౌటైంది. దీంతో సెంట్రల్‌కు భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన యశ్ రాథోడ్ 286 బంతుల్లో 17 ఫోర్లు, రెండు సిక్సర్లతో 194 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో స్వల్ప తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (101), సారాంశ్ జైన్ (69), ఓపెనర్ డానిష్ మలెవర్ (53), దీపక్ చాహర్ (37) పరుగులు చేసి తమవంతు సహకారం అందించారు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో గుర్జాప్నీత్ సింగ్, అంకిత్ శర్మ నాలుగేసి వికెట్లను పడగొట్టారు. కాగా, సౌత్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది.