ముంబై: ప్రతిష్ఠాత్మమైన దులీప్ ట్రోఫీకి ఆగస్టు 28న తెరలేవనుంది. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను బిసిసిఐ విడుదల చేసింది. ఆగస్టు 28న ప్రారంభమయ్యే క్వార్టర్ ఫైనల్ పోటీల్లో నార్త్‌జోన్‌తో ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్‌తో నార్త్ ఈస్ట్ జోన్ తలపడుతాయి. ఇక సెప్టెంబర్ 4 నుంచి ఏడు వరకు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. సౌత్ జోన్, వెస్ట్ జోన్ టీమ్‌లు నేరుగా సెమీస్‌కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో విజయం సాధించి జట్లతో ఇది సెమీస్‌లో తలపడుతాయి. మరోవైపు దులీప్ ట్రోఫీ ఫైనల్ సమరం సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు బెంగళూరు వేదికగా జరుగుతుంది.
కాగా, దులీప్ ట్రోఫీకి సంబంధించిన క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా బెంగళూరులోనే జరుగనున్నాయి. బిసిసిఐ సెంటర్ ఫర్ ఎక్సెలెన్సీ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. కాగా, దులీప్ ట్రోఫీలో పాల్గొనే జట్లను ఇప్పటికే ప్రకటించారు. సౌత్ జోన్ టీమ్‌కు తిలక్ వర్మ, నార్త్ ఈస్ట్ జోన్‌కు జొనాథన్, సెంట్రల్ జోన్‌కు ధ్రువ్ జురెల్, ఈస్ట్ జోన్ అభిమన్యు ఈశ్వరన్, నార్త్‌జోన్ అంకిత్ కుమార్, వెస్ట్ జోన్‌కు శార్దూల్ ఠాకూర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.