న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్… టికెట్ల కోసం ఇకపై రైల్వేస్టేషన్లలో క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు. బస్సులో మాదిరిగానే రైలులోనే ఇకపై టికెట్లను తీసుకోవచ్చు. టీటీఈలు, టికెట్ తనిఖీ బృందాలు ఈ టికెట్లను జారీ చేయనున్నాయి. రైల్వేస్టేషన్ల లోని టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ నుంచి ఉపశమనం కలిగించేందుకు రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మొబైల్ టికెటింగ్‌ను రాయ్‌పూర్ రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
టీటీఈ, టికెట్ తనిఖీ బృందానికి అరచేతిలో ఇమిడి ఉండే పరికరాన్ని అందజేశారు. వాటి సాయంతో ప్రయాణికులు ఎంతమంది , ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్న వివరాలను నమోదు చేస్తున్నారు. అనంతరం వారికి అందజేసిన ప్రింటర్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ విధానాన్ని త్వరలోనే దేశ వ్యాప్తంగా అన్ని మేజర్ స్టేషన్లలో ప్రవేశ పెట్టేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.