ఆగస్టు 14 2025న స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) గ్లోబల్ రేటింగ్స్ భారత సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌ను (బెటర్ బిజినెస్ బ్యూరో) ‘బిబిబి మైనస్’ నుంచి ‘బిబిబి’కి పెంచింది.18 ఏండ్ల తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌లో అత్యల్ప స్థాయికి చేరిన ఈ మార్పు, భారత ఆర్థిక వ్యవస్థకు ఒక మైలురాయిగా నిలిచింది. ఈ అప్‌గ్రేడ్ గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత్‌పై విశ్వాసాన్ని పెంచుతుందని, రుణ ఖర్చులను తగ్గిస్తుందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని అధికార పక్షం బిజెపి ఆనందంగా ప్రకటిస్తోంది. అయితే, ఈ వెలుగులోని నీడలను పరిశీలిస్తే ఆర్థిక వాస్తవాలు అంత సరళంగా లేవని స్పష్టమవుతున్నది. డేటా సమగ్రతపై ప్రశ్నలు, నెరవేరని వాగ్దానాలు, సామాజిక, -ఆర్థిక సవాళ్లు ఈ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను ఆచితూచి అంచనా వేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
ఈ రేటింగ్ మెరుగుదల భారత్‌కు గ్లోబల్ మార్కెట్లలో చవకైన నిధులను సమకూర్చడం, రూపాయి స్థిరత్వాన్ని పెంచడం, సావరిన్ బాండ్లపై (sovereign bonds) విశ్వాసాన్ని బలోపేతం చేయడం వంటి ప్రయోజనాలను తెస్తుంది. ఎస్‌అండ్‌పి ప్రకారం భారత రుణ జిడిపి నిష్పత్తి 2029 నాటికి 83% నుంచి 78 శాతానికి తగ్గుతుందని, ఆర్థిక లోటు 2020- 21లో 9.3% నుంచి 2025 26 నాటికి 4.4 శాతానికి తగ్గుతుందని అంచనా. ఈ గణాంకాలు బలమైన స్థూల ఆర్థిక విధానాలు, ద్రవ్య స్థిరత్వం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను సూచిస్తాయి. మూలధన వ్యయం 2014- 15లో 1.6% నుంచి 2025 26 నాటికి 3 శాతానికి పైగా పెరిగింది. ఇది ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా ప్రభుత్వం చెప్పుకొంటుంది.
అయితే, ఈ గణాంకాల వెనుక దాగిన సంక్లిష్టతలను విస్మరించలేం. గత దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ, డేటా విశ్వసనీయతపై విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ 2012 తర్వాత జిడిపి అంచనాలు 2-2.5% అధికంగా చూపించారని వాదించారు. అధికారికంగా 7% సగటు జిడిపి వృద్ధి ప్రకటించినప్పటికీ, స్వతంత్ర అంచనాలు దానిని 5 శాతానికి దగ్గరగా ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ వ్యత్యాసం ఆర్థిక విధానాలు, రాజకీయ నిర్ణయాలపై సందేహాలను రేకెత్తిస్తున్నది. ఉదాహరణకు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 2014లో జిడిపిలో 15% ఉన్న తయారీ వాటా 2022 నాటికి 13 శాతానికి పడిపోయింది.
దీర్ఘకాల ఉద్యోగ సృష్టి, ఎగుమతి వృద్ధిలో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు. బదులుగా సేవల రంగం, అనధికారిక ఆర్థిక వ్యవస్థ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవి ఆర్థిక సంక్షోభ సమయంలో బలహీనతలను బహిర్గతం చేశాయి. ఉద్యోగ సృష్టి విషయంలోనూ ఆశాజనక చిత్రం కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసినప్పటికీ 2017-18 ఎన్‌ఎస్‌ఎస్‌ఒ నివేదిక ప్రకారం నిరుద్యోగ రేటు 6.1 శాతానికి చేరింది. ఇది 45 ఏండ్లలో అత్యధికం. 2011 -12 నుంచి 2018 మధ్య 1.5 కోట్ల ఉద్యోగాలు కోల్పోయాయి. (2018 తర్వాత నెట్‌లో డేటా అప్ డేట్ చేయలేదు) పిఎల్‌ఎఫ్‌ఎస్ నివేదికలు నిరుద్యోగ సమస్యను తక్కువగా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అర్బన్ యువతలో నిరుద్యోగం ఆందోళనకరంగా ఉంది. ఈ సందర్భంలో అధిక జనాభా ఉన్న భారత్‌లో ఉద్యోగ సృష్టి అత్యంత కీలకం.
కానీ ఈ రంగంలో విజయం సాధించడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. సామాజిక అసమానతలు మరో పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. నీతి ఆయోగ్ పేదరికం 5 శాతానికి తగ్గిందని చెప్పినప్పటికీ వరల్డ్ బ్యాంక్, ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు దీనిని 12-15 శాతానికి దగ్గరగా అంచనా వేస్తున్నాయి. జిఎస్‌టి ఆదాయం 2024-25లో 9.4 శాతం పెరిగినప్పటికీ, లక్ష్యాలను చేరుకోలేకపోవడం, బడ్జెట్ వెలుపలి రుణాలు, సబ్సిడీలు వంటివి ఆర్థిక లోటు గణాంకాలను మరుగున పరుస్తున్నాయని విమర్శకులు చెబుతున్నారు. అమెరికా విధించిన 50 శాతం సుంకాలు భారత ఎగుమతులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
ఇది ఆర్థిక వ్యవస్థకు మరో సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, రేటింగ్ అప్‌గ్రేడ్ ఒక సానుకూల సంకేతం అయినప్పటికీ, దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వం కోసం డేటా పారదర్శకత, ఉద్యోగ సృష్టి, సామాజిక సమానత్వంపై దృష్టి సారించాలి. చివరగా, భారత ఆర్థిక వృద్ధి కథ రెండు ముఖాలను కలిగి ఉంది. ఒకవైపు గ్లోబల్ ప్రభావాలు, ముఖ్యంగా అమెరికా టారిఫ్‌ల ప్రభావం, మరోవైపు దేశీయ సవాళ్లు. (ఎస్‌అండ్‌పి) రేటింగ్ అప్‌గ్రేడ్ ఒక అవకాశంగా భావించాలి, కానీ దానిని సామాన్యుల జీవనోపాధికి, సమగ్రమైన వృద్ధికి అనుసంధానం చేయకపోతే, ఈ వెలుగు కేవలం గణాంకాల గారడీ గానే మిగిలిపోతుంది.
- కోలాహలం రామ్ కిశోర్, 98493 28496