Friday, July 18, 2025

‘నాటో’కు టారిఫ్ అంటువ్యాధి!

- Advertisement -
- Advertisement -

రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే 100 శాతం సుంకాలు విధించగలమని భారత దేశానికి ‘నాటో’ సెక్రటరీ జనరల్ ఈ నెల 16న చేసిన హెచ్చరికను చూసిన వారికి ఆశ్యర్యం కలగటంతోపాటు నవ్వువచ్చి ఉండాలి. నెదర్లాండ్స్ లేదా డచ్ దేశానికి చెందిన ఆయన పేరు తమ భాషలో మర్క్ ర్రిట్టర్. కాని ఇంగ్లీష్‌లో స్పెల్లింగ్‌నుబట్టి మార్క్ రూట్ అని, మార్క్ రుట్టర్ అని వ్యవహరిస్తుంటారు. మనం మర్క్ ర్రిట్టర్ అనే అందాము. తను హెచ్చరిక చేసింది ఇండియాతో పాటు చైనా, బ్రెజిల్‌కు కూడా. అది మనకు ఆశ్చర్యం కలిగించి నవ్వు తెప్పించటానికి కొన్ని కారణాలున్నాయి. తను సెక్రటరీ జనరల్ అయిన నాటో కేవలం సైనిక కూటమి. వ్యాపార వాణిజ్యాలతో సంబంధం లేనిది. పాశ్చాత్యుల వాణిజ్య ప్రయోజనాల కోసం సైన్యాలను ఉపయోగించే సంప్రదాయం ఉన్న మాట నిజమే. కాని ప్రస్తుతం అటువంటి సందర్భం ఏమీ ఏర్పడలేదు.

ఒకవేళ ఏర్పడినా ఆయన బలప్రయోగం గురించి మాట్లాడాలి తప్ప, ఆర్థిక ఆంక్షలు, టారిఫ్‌ల హెచ్చింపు గురించి కాదు. ఆ మాటలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న మూడేళ్లలో తను ఎపుడూ అన్నట్లు కూడా లేరు. కనుక ఆ హెచ్చరికలు చేయవలసిన బాధ్యత వాణిజ్య వ్యవహారాలు చూసే యూరోపియన్ యూనియన్(ఇయు)ది. ఈ విషయాలన్నీ ర్రిట్టర్‌కు తెలియవనలేము. అయినప్పటికీ ఎందుకు మాట్లాడినట్లు? బహుశా ఒక కారణం ఉండి ఉంటుంది. తన హెచ్చరికకు వారం రోజుల క్రితం బ్రెజిల్ నగరమైన రియో డి జనేరోలో జరిగిన బ్రిక్స్ 17వ సమావేశాలలో ఇండియా, చైనా, బ్రెజిల్, రష్యా కూడా పాల్గొన్నాయి. రష్యాపై అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ కలిసి అక్షరాలా వేలాది ఆంక్షలు విధించాయి. దానితో రష్యా విదేశ వాణిజ్యం ముగిసిపోయి, ఆర్థిక వ్యవస్థ కుప్పగూలి, ఇక యుద్ధం కొనసాగించలేని పరిస్థితి వస్తుందని అంచనా వేసాయి. కాని అవన్నీ లెక్క తప్పాయి.

మూడేళ్లు గడిచినా అదేమీ జరగకపోగా, ఇటీవలి వివరాల ప్రకారం రష్యా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడింది. అందుకు తగిన కారణాలున్నాయి. వారితో భారత్, చైనా, బ్రెజిల్ సహా అనేకానేక ప్రపంచ దేశాలు తమ వాణిజ్య, ఆర్థిక సంబంధాలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. అమెరికా, ఇయులు ఎన్ని విధాలుగా ఎంత ఒత్తిడి చేసినా, తమపై కూడా కొన్ని ఆంక్షలు ప్రకటించినా వెనుకకు తగ్గటం లేదు. మీ ప్రయోజనాలు మీవి అయితే, మా అవసరాలు మావి అని స్పష్టంగా పలుమార్లు తేల్చిచెప్పాయి. ఇందులో ఒక విచిత్రం ఏమంటే, స్వయంగా యూరోపియన్ యూనియన్ కూడా రష్యాతో వాణిజ్యాన్ని గణనీయంగా తగ్గించటమైతే చేసింది గాని పూర్తిగా మానివేయలేదు. ఇప్పటికీ పెట్రోలియం, సహజ వాయువు, ఎరువులు, ఉక్కు, నికెల్ వంటి సరకులను దిగుమతి చేసుకుంటున్నది. రష్యాపై ఆంక్షలను పాటించకపోవటంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాశ్చాత్య దేశాల నాయకుల నుంచి మీడియా నుంచి ఎన్నోసార్లు ప్రశ్నలను ఎదుర్కొన్నారు.

ఆయన వారికి కటువుగా కూడా అనిపించే స్వరంతో మూడు ఎదురు ప్రశ్నలు వేస్తూ వచ్చారు. మా వాణిజ్యం వల్ల రష్యాకు నిధుల లభించి యుద్ధాన్ని కొనసాగిస్తున్నదనుకుంటే మరి మీరెందుకు వాణిజ్యం చేస్తున్నారు? ముందుగా అది ఆపివేయండి అన్నది మొదటి మాట. ఉక్రెయిన్ యుద్ధం మీ సమస్యే తప్ప మాది కాదుగదా? అన్నది రెండవ మాట. మాకు సమస్యలు వచ్చినపుడు మీరు ముందుకు రానపుడు మీ సమస్యల కోసం మేమెందుకు తోడురావాలన్నది మూడవది. వీటివేటికీ వారినుంచి సమాధానాలు లేవు. జైశంకర్ తీరు బోధపడటంతో ఇటీవల వారు ఆ ప్రశ్నలు వేయటం మానివేసారు.ఇదే తరహా ప్రశ్నలను వారు చైనా, బ్రెజిల్‌కు గాని, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న ఇతర దేశాలకుగాని వేసే వారేమో తెలియదు. కాని, రష్యా వలెనే ఇరాన్‌తో చమురు దిగుమతులు ఆపివేయాలని భారత ప్రభుత్వాన్ని అమెరికా, ఇయులు రకరకాలుగా ఒత్తిడి చేసి విఫలమయ్యాయి. వారికి చైనాను ఒత్తిడి చేయటం వివిధ కారణాల వల్ల సాధ్యమయేది కాదు.

కాని ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలపై చేయగలమనుకున్నారు. ఇండియాకు చమురు అవసరాలు తీరనట్లయితే ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. పైగా, జైశంకర్ ప్రస్తావించిన ఇతర ప్రశ్నలు కూడా ముఖ్యమైనవే. కావలసిందల్లా రాజకీయంగా స్వతంత్రమైన, స్పష్టమైన వైఖరి తీసుకుని ధైర్యంగా నిలవటం. ఆ పని మోడీ ప్రభుత్వం చేసింది. ఇందులో ఆర్థికపరమైన కోణం ఉన్నప్పటికీ, అందుకు రాజకీయ కోణం కూడా తోడైతే తప్ప అటువంటి వైఖరి తీసుకోలేరు. నిజానికి ఈ సరికి పాశ్చాత్య ప్రపంచానికి, బయటి దేశాలన్నింటికి ఉక్రెయిన్ యుద్ధ రహస్యాలు అర్థమైపోయాయి. కనుకనే దానిని పాశ్చాత్యులు తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఉక్రెయిన్‌ను పావుగా వాడుకుంటూ సాగిస్తున్నట్లు గ్రహించి వ్యవహరిస్తున్నాయి. వారికోసం తమ ప్రయోజనాలను వదలుకునేందుకు సిద్ధపడటం లేదు.

నాటో ర్రిట్టర్‌కు ఇదంతా తెలియనిదా? అయినా, అమెరికా విఫలమైన, ఇయు విఫలమైన రంగంలోకి, నాటోతో సంబంధంలేని చోటకు తానెందుకు అడుగు పెట్టినట్లు? తన బెదిరింపును అందరూ నవ్వి కొట్టివేస్తారని గ్రహించలేకపోయారా? అదట్లుంచి ఇండియా, చైనా, బ్రెజిల్ ఆర్థికంగానే కాక అన్ని విధాలా ప్రముఖమైనవి. వాటిపై 100 శాతం సుంకాలు విధిస్తే, అక్కడి నుంచి ఎగుమతి దిగుమతులు ఆగిపోతే ఎవరికెంత నష్టమనే లెక్కలు ర్రిట్టర్ వేసుకున్నారో లేదో తెలియదు గాని మన వద్ద నైతే లేవు. అయినా మనకు గల పరిమిత పరిజ్ఞానాన్ని బట్టి చెప్పాలంటే, నష్టాలు రెండు వైపులా ఉంటాయి. ఒకవేళ అమెరికా, ఇయుల ఆర్థిక పరిస్థితులు గొప్పగా ఉండి ఉంటే కొంత నష్టాన్ని భరించి అయినా ఈ మూడు దేశాలను లొంగదీయగలమనుకోవచ్చు. కాని అటువంటి పరిస్థితి లేదు. వెనుక ముందు ఆలోచించకుండా పెంచిన టారిఫ్‌లతో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే సతమతమవుతున్నది.

యూరప్‌లో అన్నింటికన్న శక్తివంతమైన జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ సహా అన్ని దేశాలు ఆర్థిక సమస్యలలో ఉన్నాయి. ఆ కారణంగా ఒకవైపు ధరలు, నిరుద్యోగం పెరుగుతుండగా, మరొకవైపు ఉదారవాద మధ్యేమార్గ పార్టీలు బలహీనపడుతూ, మితవాద పక్షాల బలం పెరుగుతున్నది. ఇటువంటి స్థితిలో భారత్, చైనా, బ్రెజిల్‌లతో వాణిజ్య సంబంధాల విచ్ఛిత్తిని యూరప్ తట్టుకోగలదా? ఇంతకూ అటువంటి దుస్సాహసం చేసి సాధించగలది ఏమైనా ఉంటుందా? మనకైతే ఏమీ కనిపించటం లేదు. ఈ సుంకాలకు భయపడి ఈ దేశాలు రష్యాతో వాణిజ్య సంబంధాలు ఆపివేసే అవకాశం లేదు. యుద్ధం నుంచి రష్యా ఉపసంహరించుకోబోదు. యుద్ధాన్ని 24 గంటలలో ఆపివేయగలనని ఒక సదుద్దేశాన్నయితే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఎట్లా ముందుకుపోవాలో తెలియక ఆరుమాసాల తర్వాత కూడా తలపట్టుకుంటున్నారు.

అందరూ కలిసి ఉక్రెయిన్‌కు కుప్పతెప్పలుగా ఆయుధాలు, నిధులు అందజేసి కూడా గెలిపించలేకపోతున్నారు. గెలుపు మాట అట్లుంచి ఉక్రెయిన్ భూభాగాలను రష్యా నెమ్మదిగానైనా క్రమంగా ఆక్రమిస్తున్నది. యుద్ధానికి పరిష్కారం కనుగొనే వరకు ఇదిట్లా సాగుతూనే ఉంటుంది. అటువంటపుడు, హాలండ్‌కు లోగడ ప్రధానిగా కూడా పనిచేసి, నాటో సెక్రటరీ జనరల్ వంటి బాధ్యతాయుతమైన స్థానంలో గల మర్క్ ర్రిట్టర్ వంటి నాయకుడు 100 శాతం సుంకాలంటూ బెదిరించటం ఎంత హాస్యాస్పదం! యుద్ధం ముగియాలన్నది నిజంగా ఆయన ఉద్దేశమైతే అందుకు సులభమైన రాజమార్గం ఉంది. మొదట చేయవలసింది, ఉక్రెయిన్‌ను ఒకపావుగా ఉపయోగించుకుంటూ, నాటోను రష్యా సరిహద్దులకు విస్తరించి ఆ దేశాన్ని చుట్టుముట్టాలనే వ్యూహాన్ని మానుకోవటం. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొనబోమని, అది స్వతంత్రమై తటస్థ దేశంగా ఎప్పటికీ ఉండిపోగలదని లిఖితపూర్వకంగా ప్రకటించటం.

ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలలో ఆధిక్యతలో గల రష్యన్ జాతి వారి పౌరహక్కులకు, భాషా సంస్కృతులకు రక్షణ ఉంటుందన్న హామీని రాజ్యాంగంలో చేర్చేట్లు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ఒప్పించటం. వాస్తవానికి సమస్య తలెత్తిందే ఈ అంశాలపై. అందుకు అమెరికా కూటమి అంగీకరించకపోవటంపై. ఉక్రెయిన్‌ను కూడా సమ్మతించకపోనివ్వటంపై. అన్ని అంశాలనూ తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల చుట్టూ తిప్పటంపై. కనుక, ర్రిట్టర్ మహాశయుడు గాని, మరొకరు గాని తమ ప్రయోజనాలు, వైఫల్యాల మధ్య ఒకవైపు ఉక్రెయిన్‌ను బలిపెడుతూ, మరొక వైపు భారత దేశానికి, ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేయటం అసమర్థ దుర్జనత్వం మాత్రమే అవుతుంది. అందువల్ల, ఇప్పటికే బలహీనపడుతున్న సామ్రాజ్యవాదం మరింత బలహీనపడటం తప్ప ఉపయోగం ఉండదు.

  • టంకశాల అశోక్ (దూరదృష్టి)
  • రచయిత సీనియర్ సంపాదకులు
    
    
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News