సోదాల పేరుతో హద్దులు దాటుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)పై మరోసారి సుప్రీం కోర్టు ఆగ్రహించడం తాజాగా చర్చనీయాంశమైంది. గత ఏడాది మే నెలలో ఇడి దర్యాప్తు తీరుపై ఎన్నో ఫిర్యాదులు రావడంతో సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. దర్యాప్తుల సమయంలో భయోత్పాత వాతావరణం సృష్టించవద్దని హెచ్చరించింది. అయినాసరే ఇడి వ్యవహారంలో మార్పు రాలేదన్న విమర్శలు వస్తున్నాయి. చాలా కేసుల దర్యాప్తులో ఇడి తనకున్న అసాధారణ అధికారాలతో దూకుడుగా వ్యవహరిస్తోందని గత కొన్ని సంఘటనల బట్టి తెలుస్తోంది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే మద్యం రిటైలర్ టాస్మాక్‌లో రూ. 1000 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఈ ఏడాది మార్చిలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇడి సోదాలు జరిపింది. ఇటీవల మళ్లీ మేనెల ఆరంభంలో టాస్మాక్ అధికారుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేసింది. ఈ అవకతవకలపై రాష్ట్రపోలీసులు, అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఇడి మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇడి సోదాలు చేస్తోందని, టాస్మాక్ అధికారులను హింసిస్తోందని తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజాగా సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇడి తీరును తప్పపట్టింది. సోదాల పేరుతో హద్దులు దాటుతున్నారని ఆగ్రహించింది. కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థల్లో కూడా బుధవారం (మే 21) ఇడి సోదాలు చేపట్టడం కలకలం రేపుతోంది. ఈ విద్యాసంస్థలు గత కొన్నేళ్లుగా పేరుపొందినవే. కర్ణాటక ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాదరణ పొందుతుండడంతో బిజెపి కన్నెర్రనౌతోందని అందుకే దర్యాప్తు సంస్థలతో భయపెడుతోందని, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తోందని కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది.
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోం మంత్రి విద్యాసంస్థలకు, రన్యారావుకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఇడి అనుమానిస్తోంది. ఈ దాడులు వెనుక కేంద్రంలోని అధికార బిజెపి ప్రేరణ ఉందని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది రూ. 2000 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో అప్పటి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌ను ఇరికించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నిస్తోందని, దీనికోసం తమ రాష్ట్రంలో భయానక పరిస్థితి కల్పిస్తోందంటూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో భాగంగా అవతలివారిని బెదిరించి భయపెట్టడం మంచిది కాదని సుప్రీం కోర్టు ఇడిని మందలించింది. మనీలాండరింగ్ చట్టం లోని కొన్ని నిబంధనలను కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేసి భయపెట్టడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కూడా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది.
ఆనాడు చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం సాగడం రాజకీయంగా అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే అన్న అపవాదు కూడా వచ్చింది. కర్ణాటకలో వాల్మీకి ఎస్‌టి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుక్కునేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరును తెరపైకి తీసుకురాడానికి కూడా ఇడి పావులు కదిపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు ఇడి అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ కల్లేష్ బి ఫిర్యాదు చేయడంతో ఇడి అధికారులు ఇద్దరిపై కర్ణాటకలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే కర్ణాటక హైకోర్టు దీనిపై స్టే విధించడంతో ఈ వ్యవహారానికి బ్రేకు పడింది. నగదు అక్రమ చలామణీ జరిగిందని ఇడి పెడుతున్న కేసుల్లో చాలావరకు శిక్షలు పడడం తక్కువే అని సుప్రీం కోర్టు కూడా గతంలో వ్యాఖ్యానించింది.
పక్కాగా సాక్షాధారాలు సేకరించడంలో ఇడి వైఫల్యాన్ని సుప్రీం ఎత్తి చూపింది. 2014 2024 మధ్య కాలంలో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద 5297 కేసులు పెట్టగా, వాటిలో 40 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయని కేంద్ర హోంశాఖ గత ఏడాది వెల్లడించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్ టాస్మాక్‌పై సోదాలు కూడా దూకుడుగా హద్దులు దాటుతుండడమే అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం ఇడి విశ్వసనీయతకు తీరని కళంకం. టాస్మాక్‌పై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తుపై సుప్రీం స్టే విధించడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం. తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బిజెపి కుట్రల్లో ఇదో భాగంగా తమిళనాడు ప్రభుత్వం విమర్శిస్తోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులు విచక్షణా రహితంగా సాగుతున్నాయన్న అపవాదు చాలా కాలంగా వినిపిస్తోంది.
కేంద్రం కనుసన్నల్లోనే ఇవి పనిచేస్తున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న విపక్ష పాలిత రాష్ట్రాల పైనే ఈ దాడులు టార్గెట్ చేసుకుంటున్నాయి. ఆయా వర్గాల ఆస్తులు జప్తు అవుతన్నాయి. ఇడి జప్తు చేసిన ఆస్తుల పరిస్థితి పరిశీలిస్తే యుపిఎ ప్రభుత్వ హయాంలో 200405 నుంచి 201314 వరకు కేవలం రూ. 5346 కోట్ల ఆస్తులే జప్తు కాగా, మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014 నుంచి 2022 వరకు రూ. 99,356 కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయ్యాయి. అలాగే ఇడి కేసుల్లో 95% ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో నమోదైనవే.