విద్య-, వైద్య రంగాలలో నెలకొన్న అసమానతలు తొలగించకుండా సామాజిక,-ఆర్థిక-, రాజకీయ -సాంస్కృతిక రంగాలలో సమానత్వం సాధించడం అసాధ్యం. ప్రజల మధ్య సోదర భావం, జాతీయ ఐక్యత, సమైక్యత సాధించాలంటే విద్య,-వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించేలా తగు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ విద్య, -వైద్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు తగిన కృషి జరపాలి. అంతర్గత వలసాధిపత్యాన్ని, వనరుల దోపిడీ, తరలింపును నిరసిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక పద్ధతుల్లో సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. విద్య, -వైద్యరంగాలలో ప్రైవేట్, కార్పొరేట్ విధానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ సమగ్ర చట్టం తేవాలి. విద్య-, వైద్యం పేరిట జరిగే దోపిడీని అరికట్టాలి. ప్రజలందరికీ ఒకే రకంగా ఉపయోగపడేలా కమ్యూనిటి (ప్రజా) విద్యాలయాలు,- వైద్యశాలలు స్థాపించి అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులో వుంచాలి.
ప్రభుత్వ ఉద్యోగాలకు, పదవులకు ప్రభుత్వ విద్యా సంస్థలల్లో చదివిన వారే అర్హులు అనే నిబంధనను విధిగా తీసుకు రావాలి. ప్రభుత్వ ఉద్యోగులు, -ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివించాలనే విధి విధానాలను రూపొందించాలి. పాలకులకు ఒక న్యాయం, ప్రజలకు వేరొక న్యాయం ప్రజాస్వామ్యం అనిపించుకోదు.పాలకులు, -ప్రజలు అందరూ ఒకే రకమైన విద్య, -వైద్య సదుపాయాలు పొందాలి. అందుకోసం విద్య-, వైద్య రంగాలలో సమూల మార్పులు తేవాల్సివుంది. ఈ సామాజిక లక్ష్యం నెరవేరాలంటే యుద్ధప్రాతిపదికన విద్య, -వైద్య రంగాలను జాతీయీకరణ చేయడమే ఏకైక పరిష్కార మార్గం. రాజకీయ పార్టీలు విద్య-, వైద్యంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. విద్య-, వైద్యం జాతీయీకరణ జరిగేంత వరకు ఆయా పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యమ, ఉద్యోగ, హక్కుల సంఘాలు ప్రజలపక్షం వహిస్తూ ప్రజాపోరాటాలను ఉధృతం చేయాలి.
విద్య, వైద్యం సమాజపరమైన ఉమ్మడి అంశంగా పరిగణిస్తూ పాలకుల విధానంలో మార్పురావాలి. పాలకులు తమకు తాముగా ప్రభువులుగానో, గొప్పవాళ్ళుగానో ఊహించుకుంటూ ప్రజలకన్నా భిన్నమైన వసతులను, సౌకర్యాలను, రక్షణలను పొందుతున్నారు. నిజానికి ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులుగా, ప్రజాధనానికి రక్షకులుగా ఉండాలి. పాలనలో నిజాయితీ, పారదర్శకత, చిత్తశుద్ధి, అంకితభావం అన్నింటికి మించి ప్రజాస్వామిక, మానవీయ విలువలు పాటించాలి. విద్య, -వైద్యంలో నిర్మాణపరమైన, నిర్వాహణ పరమైన లోపాలను గుర్తించి ప్రజాస్వామిక విలువల దృష్టితో సవరించాలి. కులాల పేరిట, మతాల పేరిట విద్యా సంస్థల ఏర్పాటు, వసతి గృహాల ఏర్పాటు తక్షణమే రద్దు చేయాలి. వసతి గృహాలు ఒక చోట, -విద్యాలయాలు మరొక చోట అనేది కూడా సరైంది కాదు. 1వ తరగతి నుండి డిగ్రీ వరకు ఒకే క్యాంపస్‌లో వుండే విధంగా మండల కేంద్రం యూనిట్‌గా ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులు- విద్యార్థులు అదే క్యాంపస్‌లో నివాసం ఉండేటట్లు చూడాలి. అన్ని రకాల అవసరాలు, సౌకర్యాలు అక్కడే ఏర్పాటు చేయాలి. 1వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువే విద్యార్థులు ప్రతి మండలంలో సగటున 8 నుండి 10 వేల వరకు ఉంటారు.
ఒకే చోట ఈ మొత్తం విద్యార్థులకు సరిపడా అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మొత్తం విద్యా బోధనను ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించాలి. పాఠశాల స్థాయి నుండే అనుభవపూర్వక విద్యను ప్రవేశపెట్టాలి. కులవృత్తులను వృత్తి విద్యా కోర్సులుగా పరిగణించాలి. కంప్యూటర్ విద్యను ప్రాథమిక స్థాయి నుండే తప్పనిసరి చేయాలి. ఉన్నత విద్య కోసం నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలను రద్దుచేయాలి. పిజి, పిహెచ్‌డి చదువులకోసం జిల్లా కేంద్రంగా అన్ని రకాల కోర్సులతో యూనివర్శిటీలను ఏర్పాటు చేయాలి. విద్యా సంస్థల సమయ పాలన ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్ణయించాలి. మిగతా సమయాన్ని అనుభవపూర్వక వృత్తి విద్యకు కేటాయించాలి. ఇంటర్ మీడియేట్‌లో ఉన్న స్వేచ్ఛపూరిత అడ్మిషన్ ప్రక్రియనే అన్నిరకాల ఉన్నత చదువులకు వర్తింప చేయాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్న లోపాలను గుర్తించి సవరించాలి. ఇంటర్ తర్వాత అన్ని రకాల డిగ్రీ, పిజి, పిహెచ్‌డి కోర్సులకు నేరుగా అవకాశం కల్పించాలి.
ప్రజాస్వామిక, శాస్త్రీయ, లౌకిక దృక్పథంతో విద్యా నిర్మాణంజరగాలి. చదువులకు, కొలువులకు సంబంధంలేని విద్యా విధానాన్ని తొలగించాలి. ప్రైవేట్ విద్య-, వైద్య సంస్థలను, కోచింగ్ సెంటర్లను పూర్తిగా నిషేధించాలి. ఇప్పటివరకు ప్రైవేట్ విద్య, -వైద్య సంస్థల్లో పనిచేసిన అధ్యాపకులకు, డాక్టర్లకు అనుభవం, అర్హతలను, అవసరాలను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఆర్‌ఎంపి, పిఎంపిలుగా ఉన్న గ్రామీణ వైద్యులకు అర్హత, అనుభవాలను బట్టి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ గ్రామీణ వైద్య సహాయకులుగా నియమించాలి. వివిధ సంక్షేమ పథకాల పేరుతో విద్య, -వైద్య రంగాల నుండి ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు చేరుతున్న నిధులతో ప్రభుత్వమే నాణ్యమైన, మెరుగైన చక్కటి విద్య-, వైద్యాన్ని ప్రజలకు అందించవచ్చు. అంగన్వాడీ కేంద్రాలను, పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా తీర్చి దిద్ది, (ఎల్‌కెజి, యుకెజి) విద్యను అందించాలి. విద్య,- వైద్య సేవల నిమిత్తం ప్రజల నుండి ఏ రూపేన, ఏ విధమైన ఖర్చులు, ఫీజులు వసూలు చేయరాదు. మొత్తం నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. దేశరక్షణ రంగంతో సమానంగా విద్య-, వైద్య రంగాలను పరిగణించి నిధులు కేటాయించాలి. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు విద్య-, వైద్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపడవు.
ఈ రెండు రంగాలకు వేరువేరుగా కనీసం 20 శాతానికి తగ్గకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ప్రజలు, ప్రభుత్వం ఈ రెండు రంగాలపై ప్రధాన దృష్టి సారించాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్య,-వైద్య సంస్థలను పూర్తిగా రద్దుచేసి వాటి స్థానంలో ప్రజా విద్య, వైద్య శాలలను నిర్మించాలి. విద్య, వైద్యం జాతీయీకరణ జాతికి జీవంపోసి బతుకుకు భరోసా నిస్తుంది. మానవహక్కులు, -ప్రాథమిక హక్కుల పరిరక్షణకు విద్య, వైద్యం జాతీయీకరణ ప్రధానమైనది. విద్య-, వైద్యం జాతీయీకరణ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం, ఆవశ్యకతను గుర్తించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రజాస్వామిక హక్కులను, ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రజల పక్షాన నిలవాల్సి ఉంది. సామాజిక, -ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానత్వాన్ని, న్యాయాన్ని సాధించడానికి, జాతీయ సమైక్యత- సమగ్రతను కాపాడటానికి, ప్రజాస్వామిక పౌరసమాజ నిర్మాణానికి విద్య, వైద్యం జాతీయీకరణ దోహద పడుతూ సకల జనుల సమగ్రాభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది. విద్య-, వైద్యం జాతీయీకరణ భారత జాతీయ సమాజానికి దారిచూపే వెలుగు రేఖ అవుతుంది.
Also Read: ‘ఆరావళి’కి పొంచి ఉన్న పెనుముప్పు
విశ్వ జంపాల, 77939 68907