మన తెలంగాణ /మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. డైట్ కళాశాల విశ్రాంత అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వ బిఈడి కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వ కళాశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం విస్మరించి కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి విద్యా సంవత్సరం 9వేల అమ్మ ఆదర్శ పాఠశాలలో మైలిక వసతులు కల్పన చేశామని గుర్తు చేశారు. ఇంకో తరం కష్టపడితే కానీ గత 10 సంవత్సరాల కాలంలతో జరిగిన నష్టాన్ని పూడ్చలేని స్థితికి కల్వకుంట్ల కుటుంబమే కారణమని అన్నారు.
సంవత్సరానికి రూ 72వేల కోట్ల నిధులను కేవలం మిత్తులకే కడుతున్నామని, లక్ష కోట్ల రూపాయలను కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా బూడిదలో పోసిన పన్నీరు చేశారని మండిపడ్డారు. కావున అందరం కలిసి దుర్మార్గమైన పాలనను అంతమొందించామన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబ్ నగఱ్‌లో విద్యాభివృద్దికి ఏఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నివేదిక ఇస్తే మీరు ఇచ్చే నివేదికను ముఖ్యమంత్రికి అందించి అమలు చేయడానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ జగపతిరావు, ఎస్ విజయ్ కుమార్, ప్రతాప్ రెడ్డి, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, తదితరులు పాల్గొన్నారు.