తాంబూలిచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టుంది ఎన్నికల కమిషన్ వైఖరి. బీహార్ ఓటర్ల జాబితా సవరణ చేపట్టిన దగ్గర నుంచి ఎన్నికల కమిషన్ చర్యలు అత్యంత వివాదాస్పదంగానే ఉంటున్నాయి. ఓటర్ల గుర్తింపునకు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదని మొండితనం పట్టడంతో చాలా మంది తమ ఓటు హక్కును కోల్పోయారు. ఈ తీరును ఆక్షేపిస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టుకు దాఖలు కావడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోక తప్పలేదు. మొత్తం 65 లక్షల మందిని తొలగించినట్టు ముసాయిదా జాబితాలో వెల్లడి కాగా, ఆందోళనలు చెలరేగాయి. తొలగించడానికి సరైన కారణాలు వెల్లడించాలని ఇసికి సుప్రీం కోర్టు ఈ నెల 19 వరకు గడువు విధించడంతో సోమవారం (ఆగస్టు 18) ఎన్నికల కమిషన్ తొలగించిన 65 లక్షల మంది పేర్లను వెల్లడించింది. ఆబ్సెంట్, షిఫ్ట్, డెడ్ అనే వర్గీకరణ కింద ఓటర్లను తొలగించినట్టు పేర్కొంది.
కానీ వచ్చిన అభ్యంతరాలను స్వీకరించడం లేదు. ఎలాంటి తప్పులు లేని అసలు సిసలైన తుది జాబితా ఎప్పుడు వెల్లడిస్తుందో చెప్పలేం. ఓట్ల చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఓటర్లును చేర్చడం, మహదేవపురంలో ఓటర్ల జాబితాలో లోపాలు, పోలింగ్ ప్రక్రియ వీడియో డేటా తొలగింపు తదితర అక్రమాలపై ఎన్నికల సంఘం మౌనం వహించిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ వస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసినా దానికి వ్యతిరేకంగా జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఉదహరిస్తున్నారు. 2022 లో ఉత్తరప్రదేశ్‌లో 18 వేల ఓట్ల తొలగింపుపై ఇసికి అఫిడవిట్ సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షాలు తమ ఆరోపణలపై ఎలాంటి అఫిడవిట్లు ఇవ్వలేదంటూ ఎన్నికల కమిషన్ బుకాయిస్తోంది.
పశ్చిమబెంగాల్‌లో నకిలీ ఓటర్ల కార్డుల సమస్యను లేవనెత్తినా ఇంతవరకు పరిష్కరించలేదు. ఆధార్ కార్డును కూడా వ్యక్తిగత గుర్తింపుగా తీసుకోవాలని సుప్రీం కోర్టు చేసిన సూచనలను ఇసి పట్టించుకోవడం లేదు. జాబితాలో బతికి ఉన్నవారిని చనిపోయినట్టు, చనిపోయిన వారిని బతికి ఉన్నట్టు, స్థానికులలో చాలా మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్టు కారణాలు చూపిస్తోంది. కానీ తాను చేసిన తప్పులను ఇసి దిద్దుకోవడం లేదన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడాన్ని గమనించిన బీహార్‌లోని కొంతమంది ఓటర్లు బూత్ స్థాయి అధికారి (బిఎల్‌ఒ) వద్దకు వెళ్లి తమ ఐడి ప్రూఫ్‌గా ఆధార్ కార్డును చూపించారు. కానీ బిఎల్‌ఒ అంగీకరించలేదు. కేవలం చిన్నచిన్న పొరపాట్లకే బీహార్‌లో ఓటర్లు వేధింపులకు బలవుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఒకపక్క రాహుల్ ఓటర్ అధికార్ ఆందోళనను ప్రారంభించగా, మరోపక్క ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరీ ఆరోపణలపై ఆధారాలుంటే వారం రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని అల్టిమేటమ్ జారీ చేయడం ఎంతవరకు సబబు? దీనికి విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. తొలుత ఎన్నికల సంఘమే తన ఓటర్ల జాబితా ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిగ్గా ఉందని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ పై అభిశంసనకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు నోటీసును తీసుకువచ్చేందుకు ప్రతిపక్ష సభ్యులు యోచన చేస్తున్నారు. మరోవైపు ఓటు చోరీ అంశంపై చర్చించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఓటర్ల నమూనా జాబితాను ఆగస్టు 1న వెల్లడించింది. చనిపోయారని చెబుతూ 22.34 లక్షల ఓటర్లను తొలగించింది.
మరో 36.28 లక్షల మంది శాశ్వతంగా తరలిపోయారని లేదా గైరుహాజరయ్యారని తొలగించింది. ఒకటి కన్నా ఎక్కువ చోట నమోదై ఉన్నారని మరో 7.01 లక్షల మందిని తొలగించింది. మొత్తం మీద బీహార్‌లోని మొత్తం 7.93 కోట్ల మంది ఓటర్లలో 8 శాతం మంది పేర్లను జాబితా నుంచి ఎస్‌ఐఆర్‌కు ముందే ఎన్నికల కమిషన్ తొలగించింది. ఎన్నికల కమిషన్ ఎవరినైతే చనిపోయినట్టు ప్రకటించిందో వారిలో చాలా మంది సుప్రీం కోర్టు ముందు ప్రత్యక్షం కావడంతో అన్యాయంగా ఎన్నికల కమిషన్ నేరం చేయడానికి ప్రయత్నించినట్టు స్పష్టమైంది. ఇప్పుడు విరుద్ధమైన విషయం ఏమిటంటే ఆయా ఓటర్లు తిరిగి పోల్ అధికారుల వద్దకు వెళ్లి తామింకా ఉన్నామని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఓటర్ల జాబితా నుంచి పౌరుడిని తొలగించడానికి తగిన రుజువు పోల్ ప్యానెల్ వద్ద ఉండడం తప్పనిసరి. అంతేకాని వేరే మార్గం చెల్లదు. జాబితాలో తప్పులకు బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలే బాధ్యులంటూ జాబితా విడుదల చేయడంలో ఎన్నికల కమిషన్ డొల్లతనం బయటపడుతోంది.
మరొకరిని ఆరోపించే బదులు జాబితాలోని తప్పులను సవరించడం ఎన్నికల కమిషన్ ప్రధాన విధి. అయితే రాహుల్ మాత్రం బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ని ఓటు చోరీకి దొరికిన నూతన ఆయుధంగా వ్యాఖ్యానించారు. బీహార్ లోని 20 జిల్లాల మీదుగా 1300 కిమీ మేర కొనసాగే ఓటర్ అధికార్ యాత్రను రాహుల్ చేపట్టడం ఓటర్ల నుంచి స్పందన విశేషంగా వస్తుండడం అధికార పార్టీకి, ఎన్నికల కమిషన్‌కు మింగుడుపడడం లేదు. సోమవారం ఔరంగాబాద్ జిల్లాలో ఓట్లు కోల్పోయినట్టు చెబుతున్న పౌరులతో రాహుల్ భేటీ అయ్యారు. గత నాలుగైదు ఎన్నికల్లో ఓటు వేసిన వారి ఓట్లను కూడా చోరీ చేశారని రాహుల్ బయటపెట్టారు. పౌరులు ప్రజాస్వామ్యంలో తమ పవిత్రమైన ఓటును పొందడం వారి హక్కు. దాన్ని కాదనే అధికారం ఏశక్తికీ లేదు. ఈ ప్రధాన కర్తవ్యాన్ని ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ గుర్తించడం తప్పనిసరి.