దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలను చర్చించారు. అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల(సిఈఓ)లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనకు వారి ఆమోదం లభించింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇలాంటి ఓటర్ల జాబితా సవరణ నిర్వహించింది.ఇదే ప్రక్రియను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే లోగానే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రకటన రావచ్చునని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం కాన్ఫరెన్స్ – కమ్- వర్క్ షాప్ మాదిరి సాగింది. ఈ సందర్భంగా ఎప్పటిలోగా ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని సిఈఓల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
చాలా మంది అక్టోబర్ నుంచి సర్ చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నెలలో అందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేస్తామని కూడా కమిషన్ కు తెలిపారు.ఈ సమావేశంలో ప్రధానంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసంచేయాల్సిన సన్నాహాలపై దృష్టి పెట్టారు. సవరణ సమయంలో ఓటర్లను ధృవీకరించేందుకు అవసరమైన పత్రాల జాబితా సిద్ధం చేయాలని కూడా ఎన్నికల కమిషన్ రాష్ట్రాల సిఈఓలను ఆదేశించింది.స్థానికంగా సులభంగా అందుబాటులో ఉండే సర్టిఫికెట్లపై ఆధారపడి ఈ ప్రక్రియ సాగుతుంది. ఇవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరిగా ఉండవచ్చు.అర్హత ఉన్న ప్రతి ఓటర్ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలాగే, మరణించిన వారి పేర్లు తొలగించి, నకిలీ ఎంట్రీలను తొలగిండంతోపాటు, పౌరులు కానివారి పేర్లనూ డిలీట్ చేయాలని,శాశ్వతంగా నివాసం మారిన వారి పేర్లనూ తొలగించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది.