భారత ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ముమ్మర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియ రేపిన దుమారం ఓ పట్టాన సద్దుమణిగేలా లేదు. ఎన్నికల సంఘం పనితీరుపై పలు సందేహాల్ని రేకెత్తించడమే కాకుండా సరికొత్త సవాళ్లను సంధిస్తోంది. దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఇప్పటికే ఈ వ్యవహారంలో నిర్దిష్టమైన ఆదేశాలిచ్చింది. బీహార్‌లో అసాధారణంగా తొలగించిన 65 లక్షల మంది పేర్లు, తొలగింపు కారణాలను వివరాలతో వెల్లడించమని ఆదేశించింది. ఆ మేరకు ఎన్నికల సంఘం రాష్ట్ర ఉన్నతాధికారి సదరు జాబితాను ప్రకటించారు. మరోవైపు దేశంలో ‘ఓట్ల దొంగతనం’ జరుగుతోందనే ఆరోపణలతో విపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టారు. ‘ఒక ఓటర్ ఒకే ఓటు’ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. మరోపక్క, ఎన్నికల సంఘం ప్రతిష్ఠను భంగపరిచే విధంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కావాలనే నానారభస చేస్తున్నాయని పాలకపక్షం బిజెపి విమర్శిస్తోంది.
ఇంకోపక్క వివాదాస్పదమైన ప్రకటన చేసి, విపక్ష నాయకుడ్ని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ‘వారం గడువు’ విధించడం ద్వారా ఎన్నికల సంఘం(Election Commission) ఈ రచ్చను పరాకాష్ఠకు చేర్చింది. ఫలితంగా విపక్ష ‘ఇండియా’ కూటమి పక్షాలు భేటీ అయి, కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసనకు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. దీంతో ఎన్నికల సంఘం ప్రతిష్ఠ దెబ్బతింటోంది. ప్రజలముందు దాని విశ్వసనీయత మరింత సన్నగిల్లుతోంది. తాజా వివాదం ఎక్కడిదాకా వెళుతుందో తెలీని స్థితి. ఎన్నికల సంఘం ప్రధానాధికారిపై ‘అభిశంసన’ అంటే ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి ‘అభిశంసన’కు అవసరమైన షరతులే వర్తిస్తాయి. ఉభయ సభల్లో, సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతల మంది ‘అభిశంసన తీర్మానానికి’ అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే లోక్‌సభలో 364/543, రాజ్యసభలో 160/240 సభ్యుల బలం కావాలి.
అంతటి సంఖ్యా బలం విపక్ష ‘ఇండియా’ కూటమికి లేదు. అయినప్పటికీ ‘అభిశంసనకు’ విపక్షాలు సమాయత్తమవుతున్నాయంటే, తీర్మానం నెగ్గడం కన్నా కూడా ఎన్నికల సంఘాన్ని, తద్వారా పాలకపక్షాన్ని ఎండగట్టడమే వారి లక్ష్యంగా కనబడుతోంది. ‘అభిశంసన విషయమై మాలో ఏకాభిప్రాయం ఉంది. తీర్మానం ప్రతిపాదించడానికి అవసరమైన సభ్యుల (కనీసం 50 మంది) సంఖ్య మాకుంది’ అని ‘ఇండియా’ కూటమి పక్షాల భేటీ తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ అన్నారు. ‘2024 ఓటర్ల జాబితా తప్పుల తడక, అదొక మోసం..’ అన్న బిజెపి నాయకుడు అనురాగ్ ఠాకూర్ మాటల్ని పట్టుకొని అటు కాంగ్రెస్, ఇటు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఘాటైన విమర్శలుచేశారు. బీహార్‌లో జరుగుతున్న ఏకపక్ష జాబితా సవరణ, మూకుమ్మడి ఓట్ల తొలగింపును సమర్థించడానికే అలా మాట్లాడుతున్నారని, బిజెపి ఇసిఐ కుమ్మక్కుకు ఇదే నిదర్శనమని వారంటున్నారు.
2024 ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితా తప్పుల తడక అయితే, దాని ఆధారంగా జరిగిన ఎన్నికల్ని, తద్వారా ఏర్పడ్డ లోక్‌సభను రద్దు చేయగలరా? అని సవాలు విసురుతున్నారు. ఆర్‌జెడి ఎంపి మనోజ్ ఝా ఒకడుగు ముందుకు వేసి, ‘రాహుల్ గాంధీని బెదిరిస్తూ, వారం గడువు విధిస్తూ మాట్లాడిన తీరు చూస్తే ఎన్నికల ముఖ్య కమిషనర్ కనబడలేదని, బిజెపి కొత్త అధికార ప్రతినిధి దర్శనమిచ్చారని వ్యాఖ్య చేశారు. వివిధ పక్షాల నేతలు కాకుండా పౌర సంస్థలకు చెందిన వారు నిర్దిష్టంగా లేవనెత్తిన అంశాలకు సమాధానమో, ఖండనతో సమాచారమో ఇవ్వకుండా ఎన్నికల కమిషనర్లు ప్రత్యారోపణలు చేయడంపట్ల ప్రజా క్షేత్రంలోనూ విమర్శలున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు కలిగిన భారత ఎన్నికల సంఘం వివిధ దశల్లో వివిధ రకాల అధికారాలతోపాటు బాధ్యతల్ని నిర్వహించాల్సి ఉంటుంది.
కొన్ని విషయాల్లో రాష్ట్రపతికి, మరికొన్ని విషయాల్లో పార్లమెంట్‌కు, అలాగే న్యాయస్థానాలకు, ప్రజలకు జవాబుదారీగా ఉండా లి. జవాబుదారుతనం లోపించడమే కాకుండా పాలకపక్ష అనుకూల వైఖరి ఎన్నికల సంఘాన్ని విమర్శలపాలు జేస్తోంది. విపక్ష నేతలను అఫిడవిట్ ఇవ్వాలంటున్న ఇసి గతంలో అఖిలేష్ యాదవ్ (ఎస్‌పి) తో సహా పలువురు, నిర్దిష్ట ఆరోపణలతో సమర్పించిన అఫిడవిట్లకు ఎందుకు స్పందించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 18,000 ఓట్ల తొలగింపుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ 2022లో ఇచ్చిన అఫిడవిట్‌కు ఇప్పటికీ అతీగతీ లేదు. అలా పలు రాష్ట్రాల్లో పలువురి అవిడవిట్లు తగిన స్పందన లేకుండానే పడున్నాయి. బీహార్‌లో సాగుతున్న ప్రస్తుత ఓటర్ జాబితా ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విషయంలోనూ పలు ఆరోపణలు, నిర్దిష్ట విమర్శలూ ఉన్నాయి.
వాటికి విస్పష్టమైన సమాధానాలే లేవు. 2003లో బీహార్‌లోనే జరిపిన ముమ్మర సవరణగానీ, ఇంకా ఇతర రాష్ట్రాల్లో జరిపిన 9 సవరణలకు భిన్నమైన వైఖరి బీహార్‌లో ఎందుకు అనుసరించారన్న ప్రశ్నకు ఇసి నుండి సమాధానం లేదు. వయోజనుడైన ప్రతి పౌరునికీ ఓటు హక్కు కల్పించాల్సిన ఎన్నికల సంఘం బాధ్యతను, బాధ్యతారహితంగా అది ఓటర్లుకే బదలాయించి, వారిని పౌరసత్వం నిరూపించుకొని అప్పుడు ఓటర్లు కావాలంటుందనే ఆరోపణలకు ఇసి స్పందించనే లేదు. అప్పటి వరకు ఎస్‌ఐఆర్‌లో ఉన్నట్టు 1. చనిపోయిన వారు, 2. శాశ్వతంగా వలసపోయిన వారు 3. రెండు లేదా అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైన వారు అని కాకుండా ఈసారి ప్రత్యేకంగా ఒక మతం వారిపైనే దృష్టి పెట్టి ‘విదేశీ అక్రమవలసదారులు అంటూ ఇంత రచ్చ చేసిందనేది ప్రధాన విమర్శ.
ఇలా మతప్రాతిపదికన ఓటు హక్కు కల్పించడం నిరాకరించడం రాజ్యాంగ వ్యతిరేకమనే విమర్శకు కూడా ఇసి నుండి సమాధానం లేదు. ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటికట్ రైట్స్’ (ఎడిఆర్) ఇటువంటి విమర్శలే చేసింది.
కేంద్రంలోని బిజెపి నేతృత్వపు ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి) కి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దాని అమలు సంఘ్ సంకల్పం. అందుకు అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందనేది అభియోగం. రేపు దేశవ్యాప్తంగా జరుపతలపెట్టిన ‘ఎస్‌ఐఆర్’కు, బీహార్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ‘ఓటరు నమోదు ‘అసలైన ఓటరు నిర్ధారణ పౌరుల బాధ్యత’ అన్నట్టు ప్రజలపైనే మోపింది. దానికి పౌరసత్వాన్ని నిరూపించుకునే మెలికపెట్టింది.
అందుకే, 1987కు ముందు పుట్టిన వారైతే పుట్టిన తేదీ, ప్రాంతం, భారత పౌరసత్వంపై తగిన ప్రమాణ పాత్రలతో నిరూపించుకోవాలని, 1987- 2004 మధ్యలో పుట్టిన వారైతే తన పుట్టిన తేదీతోపాటు తల్లిదండ్రులలో ఒకరి పుట్టిన తేదీని నిర్ధారించాలని, 2004 తర్వాత పుట్టిన వారైతే తన పుట్టిన తేదీతోపాటు తల్లిదండ్రుల ఇద్దరి పుట్టిన తేదీలను ధ్రువీకరించాలని ఈ ప్రక్రియ నిర్దేశిస్తోంది. ఇదంతా ఓటరు నమోదుకన్నా ప్రధానంగా పౌరసత్వ నిరూపణలా ఉండి ‘దొడ్డిదారిన ఎన్‌ఆర్‌సి అమలు’ అనే విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎన్నికల రిజస్ట్రేషన్ అధికారి (ఇఆర్‌ఒ)లకు విచక్షణాధికారాలివ్వడం, అది పాలక బిజెపికి అనుకూలంగా మారడంతో ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ఆరోపణలు వచ్చాయి. కిందటిసారి ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను ఎన్నికలకు 2005 మూడేళ్ల ముందు చేపట్టి దాదాపు రెండేళ్ల సమయం (2002- 2003) ఇస్తే ఈసారి ఎన్నికలకు నాలుగయిదు మాసాలముందు, అదీ కేవలం రెండున్నర మాసాలు (జూన్ 24 సెప్టెంబరు 1) సమయం కూడా ఇవ్వకుండా ఆదరబాదరగా నిర్వహించడం పలు సందేహాలకు ఆస్కారం కల్పించింది.
పైగా వివిధ స్థాయిలో పారదర్శకత లోపించి రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన ‘ఎన్నికల సంఘం’ ఏర్పాటు పద్ధతిలో తెచ్చిన మార్పే ప్రమాణాల దిగజారుడుకు కారణమని భావించాల్సి వస్తోంది. ముఖ్య, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక కమిటి ఉంటుంది. బిజెపి ప్రభుత్వ హయాంలో జరిపిన చట్టసవరణ ముందు ఈ కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. సవరణ తర్వాత.. సిజె స్థానంలో కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి (ప్రస్తుతం అమిత్ షా)ను తెచ్చారు. అంటే, మూడింట ఇద్దరు (మెజారిటీ) కేంద్రప్రభుత్వ ప్రతినిధులే! వారి నిర్ణయమే చెల్లుబాటవుతుంది. ప్రస్తుత సిఇసి అలానే వచ్చారు. అందుకేనేమో, తాను ఎవరికీ జవాబుదారు కాదన్నట్టు సిఇసి వ్యవహరిస్తున్నారనేది ప్రస్తుత విమర్శ.
సరే, రాజకీయ నాయకులకు జవాబు ఇవ్వదలుచుకోకుంటే రాజకీయేతరుల ప్రశ్నలకైనా సమాధానమివ్వాలి. స్వతంత్ర సంస్థ ఎడిఆర్‌కో, స్వరాజ్ అభియాన్ యోగేంద్ర యాదవ్‌కో సమాధానం ఇవ్వాలి. 2024 ఎన్నికల తర్వాత బీహార్‌లో ఎన్నికల జాబితాలో కొత్త ఓటర్లు ఎందుకు చేరలేదు? మరణాల రేటు (7.5%) కన్నా జననాల రేటు (19.3%) అధికంగా ఉన్నప్పుడు కొత్త ఓటర్లు పెరగాల్సింది. చనిపోయిన వారనే పేరుతో ఎందుకు తగ్గారు? మహారాష్ట్రలో అయిదేళ్లలో కొత్త ఓటర్లు 40 లక్షలు వస్తే, కేవలం అయిదు నెలల్లో (లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల మధ్య) 41 లక్షలు ఎలా వచ్చారు? ఓట్ల చేర్పయినా? తొలగింపు అయినా సహేతుకంగా, పారదర్శకంగా ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానాలు చెబుతారు? ఇసికి సంబంధం లేదా?
- దిలీప్‌రెడ్డి ( సమకాలీనం)
- రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ