Sunday, August 10, 2025

ఇసి స్వతంత్రతపై నీలినీడలు

- Advertisement -
- Advertisement -

గత లోకసభ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల కమిషన్, బిజెపి కుమ్మక్కై ఎన్నికల అక్రమాలకు పాల్పడి ప్రజా తీర్పును అపహాస్యం చేశాయని ఆయన ఆరోపించారు. ఓట్ల చోరీ జరిగినట్లు రాహుల్ గాంధీ పిపిటి ద్వారా బహిర్గతపరిచిన అంశాలు ప్రజాస్వామ్య వాదులను, మేధావులను, విశ్లేషకులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కర్ణాటకలోని బెంగళూర్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాహుల్ గాంధీ బయటపెట్టిన ఎన్నికల అక్రమాలు భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి జీవనాడి వంటి ఓటు హక్కును అపహాస్యం పాలు చేసేలా బయటపడిన సంఘటనల పట్ల ప్రజలు విస్తూపోతున్నారు.

ఓట్ల దొంగతనానికి పాల్పడి దేశంలోని అనేక లోకసభ స్థానాలను ఎన్నికల కమిషన్ మద్దతుతో బిజెపి గెలుచుకుని నిజమైన ప్రజాతీర్పును మంటగలిపిందని (Public opinion ignited). రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహా దేవపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో నకిలీ ఓటర్లు, గుర్తింపు లేని చిరునామాలు, పెద్ద మొత్తంలో ఓటర్లు ఒకే అడ్రస్‌లో ఉండటం, ఫోటో గుర్తించేలా లేని ఓటర్లు, ఫామ్ 16 దుర్వినియోగపరచటం లాంటి ఐదు అంశాలతో ఎన్నికల కమిషన్, బిజెపిలు ఎన్నికల ఫలితాలు తారుమారు చేసిన వైనాన్ని రాహుల్ ఎండగట్టాడు. రాహుల్ గాంధీ టీం మ్యాన్యువల్‌గా ఇసి ఇచ్చిన వేల కొలది ఓటర్ జాబితాలను గత కొన్నాళ్లుగా విశ్లేషించినట్లు అతని మాటలతో తెలుస్తోంది. మహాదేవపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో నకిలీ ఓటర్లు 11,965 మంది, గుర్తింపు లేని చిరునామాలలో 40,009 మంది ఓటర్లు, ఒకే అడ్రస్‌లో ఉన్న ఓటర్లు 10,452 మంది, ఫోటో గుర్తింపు లేని ఓటర్లు 4,132 మంది, ఫామ్ 6ను దుర్వినియోగపరచిన వారు 33,692 మంది ఉన్నారన్నారు.

మొత్తం 1,00,250 నకిలీ ఓట్లు ఉన్నట్లు తేల్చిచెప్పడంతో ఎన్నికల కమిషన్ పనితీరుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బెంగళూర్ సెంట్రల్ లోకసభ నియోజకవర్గ పరిధిలోగల ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి 82,000 మెజారిటీ వచ్చింది. మిగిలిన మహాదేవపుర సెగ్మెంటులో బిజెపికి ఒక లక్ష 1,14,046 ఓట్ల మెజారిటీ రావడంతో 32,707 ఓట్ల మెజారిటీతో బిజెపి గెలిచింది. ఈ సెగ్మెంట్‌లో ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇంటి చిరునామాపై 80 మంది, ఒకే గది ఉన్న మరో ఇంటిలో 46 మంది ఓటర్లు ఉన్నట్లు తేలడంతో ఎన్నికల అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో కళ్లకు కడుతున్నాయి.
కంప్యూటర్లలో సులభంగా విశ్లేషించేందుకు అనువుగా ఉండే డిజిటల్ ఓటర్ల జాబితాలను ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరితే తిరస్కరించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ ఓటర్ల జాబితాలు పబ్లిక్ డొమైన్‌లో ఉంటే ఓటర్ల జాబితాలలో ఉండే లొసుగులు బయట పడతాయనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషన్ నిరాకరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలోని ఒక్క మహాదేవపుర అసెంబ్లీ పరిధిలోనే ఇన్ని అక్రమాలు జరిగితే దేశవ్యాప్తంగా మరెన్నో అవకతవకలతో ప్రజాతీర్పుకు పాడె కడుతున్నారన్న అనుమానాలు ప్రజలలో వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకపు బిల్లు 2023 డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని రాజ్యాంగ నిబంధన ఆదేశించిన చట్టం రూపుదిద్దుకోలేదు.

1991లో పార్లమెంటు ఎన్నికల కమిషన్ చట్టాన్ని ఆమోదించింది. ఇందులో కేవలం ఎన్నికల కమిషనర్ల వేతనం, సేవా నిబంధనలు మాత్రమే ఆమోదం పొందాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు అవకాశం కల్పించలేదు. ప్రధానమంత్రి సిఫార్సుల మేరకే రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ల నియామకాలు చేస్తున్నాడు. సుప్రీం కోర్టు అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషనర్లను నియమించడానికి పార్లమెంటు చట్టాన్ని రూపొందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి తో కూడిన కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించాలని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు రుచించని ప్రభుత్వం ఆగమేఘాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలకు సంబంధించిన బిల్లు తయారు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి గతంలో గోస్వామి కమిటీ, లా కమిషన్ సూచనలు, సుప్రీం కోర్టు 2023లో చేసిన ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు 2023 డిసెంబర్ 12న రాజ్యసభ, డిసెంబర్ 21వ తేదీన లోకసభ ఆమోదంతో చట్టంగా అమల్లోకి వచ్చింది. చట్టం ప్రకారం సెలక్షన్ కమిటీ సిఫార్సు మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు. సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. దీని ప్రకారం ప్రభుత్వం (ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి) సూచించిన వ్యక్తులే ఎన్నికల కమిషనర్లుగా నియామకం అవుతారు.

సెలక్షన్ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించడంలోని నైతికతనే రాహుల్ గాంధీ గతంలో ప్రశ్నించడం జరిగింది. ముగ్గురు సభ్యులలో మెజారిటీ సూత్రం ప్రకారం ప్రతిపక్ష నాయకుడి సూచనకు అర్థమే లేకుండాపోతోంది. కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తులనే ఎన్నికల కమిషనర్లుగా నియమించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన అక్రమాల అవకతవకలపై ప్రశ్నించినప్పటికీ ఎన్నికల కమిషన్ నుంచి సరైన సమాధానం రాలేదు. రాహుల్ గాంధీ ఇదివరకు చేసిన విశ్లేషణ ప్రకారం 2019 మహారాష్ట్ర విధానసభ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల సంఖ్య 8.98 కోట్లు. 2024 లోకసభ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 9.29 కోట్లకు పెరిగింది.

అంటే 2019 నుంచి 2024 లోకసభ ఎన్నికల నాటికి ఐదు సంవత్సరాల కాలంలో పెరిగిన ఓటర్ల సంఖ్య కేవలం 31 లక్షలు మాత్రమే. 2024 మహారాష్ట్ర లోకసభ ఎన్నికలు (ఏప్రిల్, మే) నుండి 2024 నవంబర్ విధానసభ ఎన్నికల నాటికి ఐదు నెలల కాలంలో ఓటర్ల సంఖ్య 9.70 కోట్లకు పెరిగింది. స్వల్ప కాలంలో 41 లక్షల కొత్త ఓటర్లు పుట్టుకు వచ్చారు. ఐదు సంవత్సరాల కాలంలో 31 లక్షల ఓటర్లు (3.45 శాతం) పెరిగితే, కేవలం ఐదు నెలల కాలంలోనే 41 లక్షల ఓటర్లు (4.41 శాతం) నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు ఓటర్ల సంఖ్యలో పెరుగుదల వాస్తవమా? అవాస్తవమా? ఓటర్ల సంఖ్య అమాంతం పెరగడానికి గల కారణాలేమిటి? బోగస్ ఓటర్లు ఉన్నారా? లేరా? మొదలైనవి సమాధానం లేని ప్రశ్నలు గానే మిగిలిపోయాయి.

మహారాష్ట్రలోని ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించి వీడియోలను, సిసిటివి ఫుటేజీని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం 1961 నాటి ఎన్నికల నిర్వహణ నియమావళిలోని సెక్షన్ 93 (2) (ఎ) సవరించి ప్రజలకు సిసిటివి ఫుటేజీ, ఎలక్ట్రానిక్ రికార్డుల అందుబాటును నిలిపివేయటాన్ని రాహుల్ నిలదీస్తున్నారు.ఎన్నికల కమిషన్ బీహార్‌లో చేస్తోన్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ పనితీరుపై మండిపడుతున్నాయి.

ఎన్నికల కమిషన్ బీహార్‌లో అధికార పార్టీని గెలిపించేందుకే పని చేస్తోందని ‘ఇండియా’ కూటమి పక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్‌లో ముసాయిదా ఓటర్ జాబితానుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను తమకు అందించాలని సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్లను ఏ ప్రాతిపదిక మీద తొలగించారో తెలియచేయాలంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తిన అంశాలకు తగు రీతిలో భారత ఎన్నికల సంఘం నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వాలి. ఎన్నికల సంఘం డిజిటల్ ఓటర్ల జాబితాలను బయటపెట్టి తమ నిష్పాక్షికతను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి దాపరికం పనికిరాదు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణతోనే ప్రజాస్వామ్య మనుగడ ఆధారపడి ఉంటుంది.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి 94409 66416
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News