మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఓ వైపు స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం తేలక ఉత్కంఠ కొనసాగుతుండగా మరో వైపు ఎన్నికల నిర్వహణకు ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు అతి ముఖ్యమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేసి బ్యాలెట్ పేపర్ల రంగులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం, సిబ్బంది నియామకానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. బిసిల రిజర్వేషన్‌లు 42 శాతం అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.అయినప్పటికీ ఎన్నికల నిర్వహణ తధ్యమనే సంకేతాలు ఇవ్వడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రా ష్ట్రంలో మొత్తం 566 జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 ఉండగా, వార్డుల సంఖ్య 1,12,934గా ఉంది. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల జాబితాను గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఎన్నికల సంఘం తయారు చేసింది. ఆ జాబితా ప్రకారం 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించింది.
అయితే కొన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వల్ల ఓటర్ల సంఖ్యలో స్వల్ప మార్పు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నాటికి ఓటర్ల సంఖ్యపై స్పష్టత వస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తిరిగి తయారు చేస్తున్నారు. దీంతో ఓటర్ల జాబితాలో కొంత మార్పు ఉంటుందని అధికార వర్గాల సమాచారం. రాష్ట్రంలో గత లోక్‌సభ ఎన్నికల సమయంలో తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను విభజించింది. అలాగే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు బ్యాలెట్ పేపర్లలో నోటాను ముద్రించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పింక్, తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసారి ఎంపీటీసీ పోలింగ్‌కి పింక్, జడ్పీటీసీ ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను ముద్రించాలని కూడా సూచించింది. ఈ మేరకు కలెక్టర్లు, ఆర్వోలకు కూడా తగిన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బ్యాలెట్ బ్యాక్సుల సంఖ్య, పోలింగ్ సిబ్బంది, అవసరమైన సామగ్రి, ఇతర సమాచారాన్ని సమాచారాన్ని రూపంలో పేర్కొని ఆ అంశాలను పంపించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది.
ఒకరు ఒకే పదవికి దరఖాస్తు చేసేందుకు అర్హులు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త నిబంధనలను అమలు చేయాలని ఎన్నికల సంఘం యోచిస్లున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పదవులకు పోటీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనలను సవరించి ఒకరు ఒకే పదవికి పోటీ చేసేందుకు అనువుగా నిబంధనలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఈ వివరాలను వెల్లడించేందుకు సిద్దమవుతోంది. ఈసారి ఒక అభ్యర్ధి ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల ఎక్కువ మంది నిరాశ చెందే అవకాశం ఉంది. ఒక చోట కాకపోతే మరో చోట గెలిచేందుకు అవకాశం ఉంటుందని భావించే వారు. ప్రభుత్వం తెచ్చే కొత్త నిబంధనల వల్ల ఆ అవకాశం ఉండదని చెబుతున్నారు. బూత్‌ల వారీగా ఓటర్లు ఎంత మంది, అందుకు అనుగుణంగా పోలింగ్ సిబ్బంది వివరాలు పంపించాలని ఎన్నికల సంఘం సూచించడంతో క్షేత్ర స్థాయిలో అధికారులు సిద్ధమవుతున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రతిపాదనలు రూపొందించి ఎన్నికల సంఘానికి వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్‌ఓల స్థాయిలో బ్యాలెట్ బాక్సుల లభ్యత, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ప్రణాళికపై దృష్టి సారించారు. 2019లో మూడు దశల్లో ఎన్నికలు జరగ్గా ఈసారి రెండు దశల్లోనే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి తెలిపింది. ఈ సారి ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపై జిల్లా స్థాయి అధికాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల చిహ్నం గుర్తింపు పొందని 68 పార్టీలు
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వద్ద గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరైన పార్టీలు, వాటికి ఎన్నికల్లో పోటీ చేసే చిహ్నాలను వెల్లడిస్తూ ఈ నెల 10న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే నోటిఫికేషన్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొంది, ఎటువంటి ఎన్నికల చిహ్నం పొందని 68 పార్టీల పేర్లను సైతం వెల్లడించింది. జాతీయ పార్టీల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి, సిపిఐ (మార్కిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌ఎస్) ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
అలాగే రాష్ట్ర పార్టీలుగా ఎంఐఎం,బిఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సిపి ఉన్నాయి. ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికల్లో ఏఏ సింబల్‌పై పోటీ చేస్తున్నాయో వాటినే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన ఇతర రాష్ట్రాల్లో గుర్తించబడిన పార్టీలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) కంకి, కొడవలి గుర్తు, జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించినట్లు ఎన్నికల సంఘం ఆ నోటిఫకేషన్‌లో తెలిపింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిష్టరైన 68 పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసే ఎటువంటి చిహ్నం కేటాయించలేదు.