2 నెలల్లో హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు ప్రారంభం
మెట్రో రైలు రెండో దశ పనుల బాధ్యత సిఎం నాపైనే ఉంచారు
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: నగర శివారులోని ఎల్బీనగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు సుమారు రూ.650 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయబోతున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్‌లో మంత్రి ఆదివారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఎన్‌హెచ్ ఎస్.ఈ ధర్మారెడ్డి, పలువురు ఆర్ అండ్ బి అధికారులు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలు, డిజైన్లను మంత్రికి వివరించారు. వీటిని పరిశీలించిన మంత్రి త్వరగా కేంద్రం అనుమతి పొంది, పనులు ప్రారంభించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌హెచ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మంత్రి వెంట ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆర్‌డిసి చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్థానిక నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కారిడార్ చాలా ప్రత్యేకమైందని, ఎల్బీనగర్ నుండి హయత్ నగర్, పెద్ద అంబర్ పేట వరకు, ఓఆర్‌ఆర్ మీదుగా ఎలివేటెడ్ కారిడార్ ఉంటుందని పేర్కొన్నారు. వనస్థలిపురం నుండి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు సుమారు 6 కి.మీ మెట్రో రైలు మార్గం గుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనీ కలిసి కోరుతానని అన్నారు.
ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు తనకు తెలుసునని, ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ది కోసం తాను కృషి చేశానని అన్నారు. ఇప్పుడు రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా తాను ఉన్నందున ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎల్బీనగర్ నుండి మల్కాపూర్ రోడ్డు కోసం రూ.541 కోట్లు మంజూరు చేయించానన్నారు. ఆరు లేన్ల రోడ్డు మంజూరు కాగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అందులో నాలుగు వెహికల్ అండర్ పాస్‌లు ఇప్పటికే పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. రూ.2300 కోట్లతో గౌరెల్లి, వలిగొండ, భద్రాచలం గ్రీన్ ఫీల్ హైవే మంజూరైందని, ఇప్పటికే వలిగొండ తొర్రూరు మధ్య నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు. తొర్రూరు భద్రాచలం మధ్య రోడ్డు పనుల కోసం టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆందోల్ మైసమ్మ నుండి విజయవాడ వరకు రూ.375 కోట్లతో రోడ్డు నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని, ఈ మధ్య 17 బ్లాక్ స్పాట్స్ (యాక్సిడెంట్ స్పాట్స్) గుర్తించామని, యాక్సిడెంట్స్ జరిగి ఏ ఒక్క ప్రాణం పోకుండా రోడ్డు నిర్మాణం చేయడమే తమకు అత్యంత ప్రాధాన్యమని అన్నారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం
హైదరాబాద్ నుండి విజయవాడకు రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నామని కూడా వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి గడ్కరీని ఈ నెల 6న కలుస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లేందుకు విమాన ప్రయాణం ద్వారా మొత్తం 5 గంటల సమయం పడుతుందని, కానీ రోడ్డు మార్గం ద్వారానే రెండు గంటల్లో చేరుకునేలా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. రెండు నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ ఫీల్ హైవే కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని, తెలుగు ప్రజల మెరుగైన రవాణా సౌకర్యం కోసం తమ ప్రభుత్వం నిర్విరామకృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు.
మెట్రో రైలు రెండో దశ పనుల బాధ్యత సిఎం నాపైనే ఉంచారు
మెట్రో రైలు రెండో దశ అనుమతులకు సంబంధించిన బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉంచారని అన్నారు. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మెట్రో మొదటి దశ నిర్మాణం కోసం అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి కృషి చేశారని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రెండో దశ మెట్రోకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మెట్రో రైలు అనుమతుల కోసం, రీజినల్ రింగ్ రైల్ కోసం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కలుస్తామని తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ హైదరాబాద్ అభివృద్ది చేశామంటున్న కేటీఆర్ ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పదేళ్లు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏమార్చిందని విమర్శించారు. సమయం వృధా చేశారు తప్ప అభివృద్ది చేయలేదని అన్నారు. బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణ చేసిందని ఆయన బిఆర్‌ఎస్ పాలనపై మండిపడ్డారు. ప్రజలే దేవుళ్ళుగా మారి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లు గురించి కేసిఆర్ బిడ్డ కవితకు ఏం సంబంధం ఉందని అన్నారు.
పదేళ్లు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఎన్నికల హామీల మేరకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని అన్నారు. ఎవరెంతో వారికంతా ఇవ్వాలనేది తమ ఇందిరమ్మ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో నగర నలువైపులా నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సెప్టెంబర్‌లో సనత్ నగర్ టిమ్స్ ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయం ప్రకారం ‘ఎవరెంతో వారికంతా ఇవ్వాలనేది తమ ఇందిరమ్మ ప్రభుత్వ విధానమని అన్నారు. ఈనెల 5,6,7 తేదీల్లో ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నాన్చుతుందని మంత్రి దుయ్యబట్టారు.
టెండర్ ప్రక్రియకు చేరుకున్న పలు జాతీయ రోడ్లు:మల్ రెడ్డి రంగారెడ్డి
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. గౌరెల్లి, వలిగొండ భద్రాచలం గ్రీన్ ఫీల్ హైవే, బాట సింగారం, బండరావిరాల ప్రాంతాల జాతీయ రోడ్లు టెండర్ ప్రక్రియకు చేరుకున్నాయని అన్నారు. ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో రోడ్ల కనెక్టివిటీ పెంచి, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు మంత్రి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్‌డిసి) చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో తనకున్న వ్యక్తిగత పరిచయాలతో రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో రోడ్లకు అనుమతులు ఇప్పిస్తూ, నిధులు మంజూరు చేయిస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.