Saturday, June 21, 2025

విభిన్నమైన ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

మధురం’ అనే లఘు చిత్రంతో మంచి పేరు సంపాదించిన ఫణీంద్ర నర్సెట్టి తర్వాత ‘మను’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘8 వసంతాలు’ (8 vasanthalu) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఫణీంద్ర. శుక్రవారం ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

కథ: శుద్ధి అయోధ్య (అనంతిక) తన తండ్రి చనిపోయిన బాధలో ఉండగా, ఆ బాధ నుంచి బయటపడటం కోసం రచయిత్రిగా మారుతుంది. ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం తండ్రితో పాటు ఊటీ వచ్చిన వరుణ్ (హను రెడ్డి) శుద్ధితో ప్రేమలో పడతాడు. చివరికి శుద్ధి కూడా అతన్ని ఇష్టపడుతుంది. అప్పటి వరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్దిని ప్రేమలోకి దించుతాడు. చివరకు వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని శుద్ధిని నడి రోడ్డున వదిలేసి వెళ్తాడు. స్వాభిమానం, ఆత్మ గౌరవం (self respect) ఉన్న శుద్ధి ఏం చేస్తుంది? శుద్ధి జీవితంలో సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్ర ఏంటి ? అయితే సంజయ్ మీద ఉన్నప్రేమను బయటపెట్టకుండా, శుద్ధి మరో యువకుడితో పెళ్లికి ఎందుకు సిద్ధమవుతుంది ?, ఇంతకీ సంజయ్, శుద్ధి ఒకటయ్యారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

కథనం, విశ్లేషణ: 8 వసంతాలు… అంటూ సాగిన ఈ సిని మా ఫీల్‌గుడ్ లైఫ్ జర్నీలో డైలాగ్స్, కొన్ని ప్రేమ సన్నివేశాలు, అలాగే పాత్రల ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితే.. ఆ ప్రేమిస్తున్న వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉం టుంది ? తన ప్రేమతో తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవడానికి సంజయ్ పాత్ర చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ఈ మధ్యలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్, కొన్ని ఫీల్‌గుడ్ సీన్స్, డైలాగ్స్.. ఇవ్వన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. హీరోయిన్‌గా నటించిన అనంతిక సనీల్‌కుమార్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్‌లో ఆమె నటించిన విధానం అద్భుతంగా ఉంది. హను రెడ్డి తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు.

ఇక ఎప్పుడైనా సరే ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. కానీ బ్రేకప్.. ఎడబాటు.. ఈ కోణంలో కథ నడిచినపుడు ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడం సవాలే. ఫణీంద్ర ఇక్కడే తడబడ్డాడు. సినిమాలో తొలి ప్రేమ కథ ఉన్నంత ఆసక్తికరంగా రెండో కథ అనిపించదు. కథానాయిక జీవితంలో జరిగే ఇతర పరిణామాలు కూడా అనాసక్తికరంగా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో చెప్పడానికి పెద్దగా కథ లేకపోయింది. కథనం కూడా మరీ నెమ్మదించి కొన్నిసార్లు విసుగు పుట్టిస్తుంది. రచయితగా, దర్శకుడిగా ఫణీంద్ర నర్సెట్టి తన ముద్రను చూపించినా.. సినిమాను పూర్తి వినోదాత్మకంగా ప్రేక్షకులను మరింత అలరించే విధంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News