దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల భవితవ్యం ప్రమాదపుటంచులపై ఉంది. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టాలు ఉద్యోగులు, పెన్షనర్ల భద్రతపై కత్తిలా వ్రేలాడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా ప్రమాదపు అంచులపై కాలం నడక తప్పడంలేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం పొందిన ‘ఫైనాన్షియల్ బిల్లు- 2025’ పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. ఆ బిల్లులో స్పష్టంగా లోక్ మత్ కమిషన్ చేసిన పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ఉపసంహరించుకోవాలన్న సూచనలు పొందుపరిచారు. కనుక 2026లో బిల్లు ఆచరణలోకి వచ్చే నాటినుండి పెన్షనర్ల పదవీ విరమణ బెనిఫిట్స్‌కు సర్వమంగళం పాడినట్లే? ఇదిలా ఉండగా ఆ బిల్లులోనే పెన్షనర్ల భద్రతకు సంబంధించిన అంశాలకు, సంబంధించి పెన్షన్ పెంపుదలపై ప్రభుత్వం అనుమతుల మేరకు అనే వాక్యం చేర్చడం వలన పెరిగే కరువు భత్యం, వేతన సవరణలు వర్తింపజేయడం ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడం జరిగింది.
అటూ, ఇటూ కాని స్పష్టత లేని వాక్యాలు చట్టంలో మర్మగర్భితంగా చేర్చడం వలన ఆయా ప్రభుత్వాలు పెన్షనర్లకున్న హక్కును లాగేసుకునే (usurp right) ప్రమాదం సైతం పొంచి వుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2014, ఏప్రియల్ నుండి రిటైర్ అయిన 8 వేల మంది రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 16 లక్షల గ్రాడ్యుయేటీతోపాటు, పెన్షన్ కమిటేషన్, దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఎర్నడ్ లీవు ఎన్క్యాస్మెంట్ సొమ్ములు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. రిటైర్ ఉద్యోగుల ఈ బకాయిల మొత్తం రూ. 9 వేల కోట్లు పైమాటే నని ఒక అంచనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బకాయిలు ఎప్పుడు మంజూరు చేస్తుందోనని రిటైర్ ఉద్యోగులు ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్నారు. 1982లో సుప్రీం కోర్టు రిటైర్ ఉద్యోగి డియస్ నకాలి కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయాదాక్షిణ్యం కానేకాదు.
ఉద్యోగుల గత సేవలను దృష్టిలో ఉంచుకొని పెన్షన్ పొందే హక్కు వారికి సంక్రమిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతోపాటు, ఉద్యోగులతో సమానంగా కరువు భత్యం, పే కమిషన్ పెన్షన్లు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆ తీర్పు ఇచ్చిన రోజునే డిసెంబర్ 17నే దేశవ్యాప్తంగా రిటైర్ ఉద్యోగులు పెన్షన్ డేగాజరుపుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పెన్షనర్ల గురించి సానుభూతితో ఆలోచించే స్థితి కనిపించడం లేదు. ఇక పోతే మరో పిడుగులాంటి సమాచారం ఏమంటే! ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఆత్మీయ మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించే హక్కును చట్టంగా చేయబోతున్నట్లు సమాచారం ఉంది. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ అధికారంలోకి రాగానే ఆర్థిక స్థిరత్వం పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను తొలగించారు.
ప్రపంచ దేశాలపై ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేశారు. ఇదే బాటలో మన నరేంద్ర మోడీ కొందరు పనిచేయని ఉద్యోగులను, మరికొందరు అవినీతిపరులైన ఉద్యోగులను, రెడ్ టేపిజం ప్రదర్శించి ప్రజలను చులకనగా చూసే ఉద్యోగులపై వేటు వేసే పేరుతో రాజ్యాంగ చట్టంలోని ఆర్టికల్ 311ను సవరించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(1) అనేది ఉద్యోగిని అర్ధాంతరంగా డిస్మిస్ చేయడాన్ని లేదా తొలగించడాన్ని, ర్యాంకు తగ్గించడంలో ప్రభుత్వ చర్యలనుండి భద్రత కల్పిస్తూంది. ఇక ఆర్టికల్ 311 (2) నిబంధనలు కేవలం క్రిమినల్ కేసులో శిక్షపడ్డప్పుడు, మరికొన్ని తీవ్రమైన సందర్భాల్లో చర్యలు తీసుకోవడం, అది ఉద్యోగికి సమాచారం ఇచ్చి, సంజాయిషీ చెప్పుకునే అవకాశం ఇచ్చి మాత్రమే సంబంధిత ఉద్యోగిని తొలగించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్న 311 ఆర్టికల్‌లో సవరణ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది.
ఇదే జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న 4.5 కోట్లమంది ఉద్యోగుల ఉద్యోగభద్రత ప్రమాదంలో పడినట్లే? అంటే ఈ సంఖ్య దేశ జనాభాలో 3% ఉంటుంది. రాజ్యాంగ చట్టం తయారు చేసిన నాడు ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం అయినది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పరిపాలనలో ఉద్యోగులు పరిస్థితి ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది. నిర్దాక్షిణ్యంగా, అర్ధాంతరంగా ఉద్యోగులను తొలగించే వారు. ఆ స్థితినుండి మన ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ ముసా యిదాలోనే అంబేద్కర్ ఉద్యోగ భద్రత, ప్రభుత్వాల నుండి రక్షణ కల్పించారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు రావడంతో కాగితాలు బదులు కంప్యూటర్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఐటి లాంటి రంగాల్లో ప్రైవేటు ఉద్యోగాలు అవకాశంగా రావడం, అటు తర్వాత రెగ్యులర్ నియామకాలకు బదులు ఔట్సోర్సింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల ప్రాధాన్యత తగ్గింది.
ఉద్యోగులు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది ఉద్యోగులు తమ చేతిలో ఉన్న అధికారం దుర్వినియోగం చేయడం, కొందరు అదే పనిగా అవినీతి రూపాలుగా తమ సేవలను మార్చడం, ప్రజాసేవకులుగా కాకుండా తామేదో ప్రత్యేక వర్గం అన్న భావనలు కొందరు ఉద్యోగుల్లో ఏర్పడి ప్రజలతో సత్సంబంధాలు కోల్పోయిన స్థితి ఉంది. అదే సమయంలో రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల స్థానంలో ఖాళీలు భర్తీ చేయకపోవడం సైతం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య క్రమానుగతంగా తగ్గిపోయోలా చేసింది. ప్రైవేటు రంగంలో పని చేయని ఉద్యోగులను, పని ఇవ్వలేని ఉద్యోగులను బెంచిపై నుంచి తొలగించే విధానాలు చూసిన పాలకుల్లో తమకు అలాంటి అధికారం ఉండాలనే వాంఛలు ఆధునిక ప్రభుత్వాలకు కలుగుతున్నాయి. ఇప్పటి ఉద్యోగులు పని విధానం కూడా చాలా మారింది. గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పని తాము నిబంధనలు, నియమాలు అనుసరించి చేసుకుపోయో వారు. కానీ మారుతున్న రాజకీయ చక్రబంధంలో ఉద్యోగులు పాలకుల చెప్పుచేతల్లో పనిముట్లుగా మారడంతో ఇప్పుడు ఉద్యోగులు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.
దానివలన ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉండాల్సిన ఉద్యోగుల గౌరవం, వృత్తి నిబద్ధత క్రమంగా క్షీణించాయి. ఫలితంగా ప్రజలకు, ప్రభుత్వాలకు కొరగాకుండాపోయో విచిత్రమైన స్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 311 ప్రకారం సంక్రమించిన హక్కులను తొలగిస్తున్నా, సవరిస్తున్నా కనీసం స్పందనలేని స్థితి నెలకొంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న చట్టాల్లో మార్పుల్లో లేదా సవరణల్లో ఆర్టికల్ 311 కూడా ఒకటి కావడం పెద్ద విశేషం ఏమీ కాదు? ఇదే జరిగితే ప్రైవేటు ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేనట్లే! అంతేకాదు నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఉద్యోగులను వారి చేతిలో పావులుగా మార్చుకోవడానికి సైతం ఈ చట్టసవరణ తోడ్పడే ప్రమాదం కూడా ఉంది. కనుక ప్రభుత్వ ఉద్యోగులలో మార్పు రావడంతో పాటు, ఇలాంటి చట్టాలను సమైక్యంగా ఉద్యోగులు ఎదుర్కొనడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఉద్యోగ వ్యవస్థకు మేలు చేసిన వారవుతారు. ప్రభుత్వాలు కూడా ఉద్యోగులు హక్కులను, రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించి మాత్రమే చట్ట సవరణలకు పోవాల్సి ఉంటుంది.
- ఎన్. తిర్మల్
94418 64514