Thursday, May 22, 2025

మావోయిస్టుల ఖేల్ ఖతమేనా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్, మే 21: భారత హోంమంత్రి అమిత్ షా బుధవారం నాడు ఛత్తీస్‌గఢ్ రా ష్ట్రంలోని నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణంతో మావోయిస్టు ఉద్యమం ఈ దేశంలో తుడిచి పెట్టుకుపోయినట్టే అని ప్రకటించారు. నిజానికి మావోయిస్టులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? నంబాల కేశవరావు మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బే. మునుపెన్న డు ఇంత పెద్ద విఘాతం పార్టీకి తగలలేదు. ఇప్పటివరకు మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య జరిగిన అనేక ఘర్షణల్లో పలువురు ముఖ్య నక్సలైట్ నాయకులు మరణించినప్పటికీ కేంద్రపార్టీ కార్యదర్శి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం ఇది మొట్టమొదటిసారి కాబట్టి దీన్ని పెద్ద దెబ్బగా పరిగణించాల్సిందే.ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొదలైన నక్సలైట్ ఉద్యమం తెలంగాణకు వచ్చేసరికి ఉత్తర తెలంగాణ జిల్లాలు పట్టుకొమ్మలుగా మారాయి. ఈ ప్రాంతం నుంచే ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ , ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి విద్యాధికులు, మేధావులు అనేకమంది అజ్ఞాతం బాట పట్టిన విషయం తెలిసిందే. బుధవారం నాటి ఎన్‌కౌంటర్‌లో మరణించిన కేశవరావు ఉత్తరాంధ్రలో పుట్టి ఉత్తర తెలంగాణలో నక్సలిజం బాట పట్టారు.

ఇప్పుడు కేంద్ర హోంమంత్రి ఎక్స్‌లో ప్రకటించినట్టుగా మొత్తంగా నక్సలైట్ ఉద్యమం ఈ బుధవారం నాటి ఎన్‌కౌంటర్‌తో అంతరించినట్టేనా? ఇంకెవరు మిగిలి లేరా? హోం మంత్రి అమిత్ షా మరో మాట కూడా అన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌గా తాము పిలుచుకుంటున్న ఆపరేషన్ పూర్తయినట్టేనని అందుకు సంతోషంగా ఉందని ప్రకటించారు. ఆయన మాటలు ఎంత వరకు నిజం. పోయిన వాళ్ళు పోగా ఉత్తర తెలంగాణ నుంచి ఉద్యమంలోకి వెళ్లిన ఇంకెంతో మంది జీవించే ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు. బుధవారం నాటి చర్యతో వాళ్లంతా ఉద్యమాన్ని వదిలేసి బయటికి వచ్చినట్టేనా? అనే చర్చ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుతున్నది. పీపుల్స్ వార్‌గా పార్టీ ఉన్నప్పుడు పులి అంజయ్య అలియాస్ సాగర్ ఎన్‌కౌంటర్ జరిగిన దశలో ఎన్‌కౌంటర్ల పరంపర జరిగి అనేక మంది రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు మృతి చెందారు. వారిలో దగ్గు రాయలింగు, సాయని ప్రభాకర్, గోపగాని అయిలయ్య,తదితరులు రాష్ట్ర కమిటీ స్థాయిలో పని చేసారు. అప్పుడు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ పేరిట రాష్ట్ర కమిటీ స్థాయి కలిగి ఉండేది. అయితే అప్పుడు నాయకత్వంలో కొనసాగిన అనేకమంది విప్లవ కారులు ఉద్యమంలో కొనసాగుతుండడం వల్ల ఎన్‌కౌంటర్‌ల ప్రభావం ఉద్యమంపై కనిపించలేదు. అలాగే 1990ల నాటి ఉద్యమ అనుకూల పరిస్థితుల ప్రభావం కూడా కొత్త రక్తం పార్టీలో వచ్చి చేరేందుకు ఉపకరించిందనే వాదన ఉండేది.

కొయ్యూరు ఎన్‌కౌంటర్ జరిగిన నాడు పీపుల్స్ వార్ అత్యంత క్లిష్ట పరిస్థితిలోకి నెట్టివేయబడింది. అప్పుడు కీలక శ్రేణులుగా ఉండి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రం రెడ్డిసంతోష్‌రెడ్డిలు ముగ్గురూ ఎన్ కౌంటర్‌లో మృతి చెందారు. ఆ సమయానికి అనేక మంది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మృతిచెందడంతో పార్టీ తిరిగి నిలదొక్కుకోగలదా అనే అనుమానాలు తలెత్తాయి. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో పనిచేసిన పీపుల్స్‌వార్ నుంచి పార్టీ గణపతి ,శ్యాం, సాగర్, మళ్ళ రాజిరెడ్డి, మల్లోజుల కోటేశ్వర్ రావుల సమిష్టి నాయకత్వంలోకి వచ్చేనాటికి దళాల నిర్మాణం, సాయుధ గెరిల్లాల శిక్షణ విషయంలో నంబాల కేశవరావు నాయకత్వంలో మిలిటరీ కమిషన్ ఏర్పడింది. పార్టీ యూనిటీ పీపుల్స్ వార్‌లో విలీనమైన తర్వాత పార్టీలోకి నారాయణ్ సన్యాల్ లాంటి నాయకులు వచ్చారు. ఇదే దశలో అక్కిరాజు హరగోపాల్, బుర్రి చిన్నన్న, చెరుకూరి రాజ్ కుమార్ తదితర నాయకులు కూడా ఎదగడం పార్టీలో నాయకుల కోసం వెదుక్కోవాల్సిన అవసరం రాలేదు.

పీపుల్స్ గెరిల్లా ఆర్మీగా పీపుల్స్ వార్ రెండుమూడేళ్ళ వ్యవధిలోనే తన ప్లాటూన్ల నిర్మాణానికి పూనుకోవడానికి అప్పుడున్న నాయకత్వ సంఖ్య కారణం. ఆ రోజుల్లో నల్లా ఆది రెడ్డి, ముగ్గురు నాయకులు మృతి చెందిన నాడు ఉద్యమ సానుభూతిపరులు తమ తమ జిల్లాల్లో నాయకత్వ స్థాయికి ఎదిగిన వాళ్ళ గురించి చర్చించుకునేది. అయితే కటకం సుదర్శన్, గుండేటి శంకర్, అక్కిరాజు హరగోపాల్, మొన్న మృతిచెందిన చలపతి, జిల్లాల్లో పోలం సుదర్శన్ రెడ్డి, చెట్టి రాజపాపయ్య, శాఖమూరి అప్పారావు, బడే నాగేశ్వర్ రావు, బడే మురళి, యాపా నారాయణ వీళ్ళంతా ఒక్కొక్కరు మృతిచెందడం, నాయకత్వానికి ఎదగాల్సిన క్యాడర్ కొందరు లొంగుబాట పట్టడం ఇదంతా మావోయిస్ట్‌గా పార్టీ రూపుదిద్దుకున్న దశలో జరగడం నాయకత్వం వేళ్ళమీద లెక్కించే స్థాయికి తగ్గిందా అనుకునే అవకాశాన్నిస్తున్నది. ఇప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతూ మృతిచెందిన నంబాల కేశవరావుకూ ధీటైన మిలిటరీ పరిజ్ఞానం ఉన్న నాయకులు లోపల ఉన్నప్పటికీ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు కొనసాగుతున్నదనడం లో సందేహం లేదు.

ఆంధ్రలో కీలక నేతలు వేళ్ళ మీద లెక్కించదగ్గవాళ్ళే ఉన్నారు. తెలంగాణలో ఇంకా యాభైకి పైగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలోనూ కొనసాగుతున్నారు. కేంద్ర కమిటీలో ఇప్పటికీ పది మంది తెలంగాణ నాయకులు ఉన్నారని పోలీస్ వర్గాల అంచనా. కరీంనగర్ జిల్లా నుంచి ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు, మళ్ళ రాజి రెడ్డి, మల్లోజుల వేణుగోపాల్, కడారి సత్యనారాయణ్ రెడ్డి,పుల్లూర్ ప్రసాద్ రావు మెదక్ జిల్లానుంచి కట్టచారు రాంచంద్రారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మైలారపు ఆడెళ్ళు, వరంగల్ నుంచి కొంకటి వెంకటి, ముప్పిడి సాంబయ్య, గాజర్ల రవి, బడే చొక్కా రావు, శ్యాం ప్రసాద్ రెడ్డి, పవనాంద రెడ్డి వీరు కాకుండా పోలీస్ లెక్కల్లోకి వెళ్ళని కనీసం పదిమంది మవోయిస్ట్ ఉద్యమ నాయకత్వ స్థాయిలో ఉన్నారని ప్రచారం. దక్షిణ తెలంగాణ లో కూడా హనుమంతుతో బాటు కనీసం పదిమంది రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు ఉన్నట్లు సమాచారం. వీరుకాకుండా మిలిటరీ రంగ నిపుణుల్లో తక్కళ్ళపల్లి వాసుదేవ రావు లాంటి కీలక శ్రేణులు కూడా ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్నారని బసవరాజు ఎన్‌కౌంటర్ అనంతర చర్చల్లో సానుభూతిపరులు మాట్లాడుకోవడం వినిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News