గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు ముగింపు పలకడానికి ఫిలిమ్ ఛాంబర్, (Film Chamber) నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. నాలుగు గంటల పాటు ఈ చర్చలు సాగాయి. అనంతరం ఎఫ్‌డిసి అధ్యక్షులు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర ప్రసాద్, తెలుగు ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ “తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగు కోసం ఈ చర్చలు సామరస్య పూర్వక వాతావరణంలో జరిగాయి. 2018, 2022 సంవత్సరాలలో ఫెడరేషన్ తో నిర్మాతలు చర్చించినప్పుడు కొన్ని వర్కింగ్ కండిషన్స్ ను ప్రతిపాదించామని, అవి ఇప్పటి దాకా అమలు కాలేదు.
వాటిని అంగీకరించాలని నిర్మాతలు కోరారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై సుదీర్ఘంగా చర్చించాము. రూ.2000లోపు వేతనం ఉన్నవారికి అడిగినంత శాతం (Asking percentage) ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారు. అంతకు మించి వేతనం తీసుకొనేవారికి మరో పర్సంటేజ్ ఇస్తామని నిర్మాతలు చెప్పారు. ఇక ఫెడరేషన్ వారు అన్ని యూనియన్స్ తో చర్చించిన తరువాత మరోసారి ఈ చర్చలు సాగుతాయి. త్వరలోనే సినీ కార్మికుల వేతనాల పెంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది”అని అన్నారు.