Friday, July 18, 2025

ఆకాశవాణిలో దాశరథి

- Advertisement -
- Advertisement -

అక్కడి నుంచి నాలుగు గంటలకు కింగ్ కోటికి వెళ్లి నిజాంను కలిశాను, నిర్విణ్ణైడై ఉన్నాడు నిజాం రాజు. ‘బొల్లి గద్దలు రాజీనామా చేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు’, అన్నాడు నిజాం. ‘ఇప్పుడు ప్రభుత్వం అనేది లేదు. మేజర్ జనరల్ చౌదరీ నగరంలో ప్రవేశించడానికి మరో రోజు పట్టవచ్చు. కనుక మీ సైన్యాధిపతిని శాంతిభద్రతలు చూడమనండి. లేకుంటే అమాయకుల ప్రాణాలు పోతాయి’ అని సలహా ఇచ్చాను. ‘భద్రతా సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకోమని కోరాను. ఇదంతా మీరు రేడియోలో ప్రసారం చేయాలి. లోకానికి వాస్తవం తెలియాలి కదా!’ అన్నాను.
‘రేడియోలో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదే!’, అన్నాడు నైజం.‘చాలా సులభం ఓ గొట్టం లాంటి మైకు ఉంటుంది. అందులో మాట్లాడితే సరి’, అన్నాను. గద్గద స్వరంతో తన ప్రసంగాన్ని మొత్తంమీద నిజాం నవాబు చదివాడు. తన ప్రభుత్వం రాజీనామా చేసిన విషయం, రజాకారు సంస్థను నిషేధించి యుద్ధ విరమణ జరిపిన విషయం, భారత సైన్యాలు స్వేచ్ఛగా బొల్లారంలోకి ప్రవేశించవచ్చునని ఆ ప్రసంగంలో ఉంది. ఆ తర్వాత నేను ప్రసంగించాను…

అని ‘దక్కన్ రేడియో’ అనే ‘యాత్ర స్మృతి’ గ్రంథం 48వ అధ్యాయంలో దాశరథి కృష్ణమాచార్య 1948 సెప్టెంబర్ 17 తేదీ నాడు జరిగిన విషయాలు ఉత్కంఠ కలిగిస్తూ చెబుతారు. ఆకాశవాణి తొలి రోజుల్లో చాలామంది సాహితీవేత్తలు పనిచేశారు. వారందరిలో కల్లా దాశరథి కృష్ణమాచార్య ఒక విషయంలో విలక్షణంగా కనబడతారు.అదేమిటంటే అటు ‘దక్కన్ రేడియో’లోనూ, ఇటు ‘ఆకాశవాణి’ లోనూ పని చేయటం. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నంతకాలం తెలంగాణ నిజాంకు రెండు రేడియో కేంద్రాలు ఒకటి హైదరాబాద్‌లో, మరొకటి ఔరంగాబాద్‌లో ఉండేవి. భారత ప్రభుత్వ ఏలుబడిలోకి వచ్చినప్పుడు ఈ రేడియో కేంద్రాలు కూడా ఆకాశవాణి వ్యవస్థలో అంతర్భాగంగా మారిపోయాయి.

ఆచంట జానకిరామ్, బాలాంత్రపు రజనీకాంత రావు, పాలగుమ్మి విశ్వనాథం, గొల్లపూడి మారుతీ రావు, డి. వెంకట్రామయ్య, శారదా శ్రీనివాసన్, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వంటి వారు మాత్రమే తమ స్వీయ చరిత్రలూ, వాటిలో ఆకాశవాణి గురించి ఎంతో కొంత రాశారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక’ సంపాదకులుగా ఉన్నప్పుడు దాశరథి కృష్ణమాచార్యతో ‘యాత్ర స్మృతి’ (Travel memory) పేరున ఒక ధారావాహిక రాయించారు. బహుశా అది 1978 తర్వాత. నేను ఆ పత్రికలో ఈ శీర్షికను చూశాను, కొన్ని వ్యాసాలు చదివాను. నేను అంటే భవదీయుడు ఆకాశవాణిలో ప్రవేశించిన తర్వాత ఈ ‘యాత్ర స్మృతి’ వ్యాసాలను చాలా జాగ్రత్తగా చదివాను. ఒక విషయం మనల్ని ఆశ్చర్యం కలిగిస్తుంది. తను ఆకాశవాణిలో పనిచేస్తున్నట్టు లేదా పనిచేసినట్టు ఆ వ్యాసాల్లో ఎక్కడా పేర్కొలేదు.

అయితే ‘తుంగ-భద్ర’ అనే 12 అధ్యాయంలో దాశరథి ఒకచోట ఇలా అంటారు, ‘ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు నా ‘తుంగభద్ర’ నాటకాన్ని ప్రసారం చేశారు 1956లో. ‘ఇలానే ఆయన అక్కడక్కడ తను రూపొందించిన కార్యక్రమాల గురించి ప్రస్తావన చేస్తారే కానీ తను ఆ సంస్థలో పని చేసినట్టు పరోక్షంగా కూడా సూచించారు. బహుశా దీనికి కారణం ఆయన తనకు నచ్చని పరిస్థితులతో 1971 లో మద్రాసు కేంద్రంలో పనిచేసే సమయంలో ఆకాశవాణి నుంచి వైదొలిగారని తెలుస్తోంది. ఆయన ఆ విషయాలు వివరంగా ఎక్కడా రాసినట్టు లేదు. అలాగే ఆయనతో పనిచేసిన ఆకాశవాణి మిత్రులు కూడా వివరాలతో పెద్దగా నమోదు చేసిన దాఖలాలు కూడా నాకైతే కనబడలేదు. కనుకనే ఆయన ఏ సంవత్సరం రేడియో కేంద్రంలో చేరారు, ఏ స్థాయిలో చేరారు, ఆకాశవాణిలో ఏ స్థాయిలో చేశారు అన్న సమాచారం స్పష్టంగా అందుబాటులో లేదు.

మాటల మధ్య పెద్దలు చెప్పిన విషయాలు ఆధారంగా నాకు బోధపడిన సంగతులు ఇవి. ఆయన డెక్కన్ రేడియో హైదరాబాదులో, తర్వాత హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రంలో పిమ్మట మద్రాసు కేంద్రంలో పనిచేశారు. దాశరథి ఆకాశవాణి నుంచి ఎందుకు రాజీనామా చేశారనే సమాచారం ఇలా ఉంది. తనకు మద్రాసు నుంచి ఏదో ఇతర రాష్ట్రపు ఆకాశవాణి కేంద్రానికి బదిలీ అయింది. వారు ఎవరి సాయంతోనో ఆ బదిలీని రద్దు చేయించుకున్నారు. రద్దు చేసినట్టు కాగితం కూడా వచ్చింది. అది రాగానే దాన్ని తీసుకుని మద్రాసు కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గదికి దాశరథి వెళ్లారు. ఆ బదిలీ రద్దు అయింది గానీ మళ్ళీ ఇక్కడే మిమ్మల్ని పోస్ట్ చేశారని సంగతి ఎక్కడ ఉందని ఎదురు ప్రశ్న వేశారు ఆ స్టేషన్ డైరెక్టర్. దాంతో దాశరథి కృష్ణమాచార్యకు మనస్తాపం కలిగి రాజీనామా చేశారని అంటారు.

నిజానికి ఆ ఇతర భాషా డైరెక్టర్ అలా అడిగి ఉండాల్సింది కాదు. ఆయనకు దాశరథి స్థాయి ఏమిటో, సత్తా ఏంటో దాదాపు తెలిసి ఉండదు. బదిలీ రద్దు అయింది అంటే పూర్వస్థానం కొనసాగుతున్నట్టే. ఆ విషయం వివరించి ఉన్న సరిపోయి ఉండేదేమో, కానీ దాశరథి అలా ఆకాశవాణి సంస్థకు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో రాజీనామా చేయడమనేది ఒక తొందరపాటు నిర్ణయం గానే పరిగణించాలి. లేకపోయి ఉంటే తర్వాత దశలో ఆయన మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడమే కాకుండా, జీవిత చరమాంకంలో ఆర్థిక సమస్యలతో సతమతమయి ఉండేవారు కాదు. దాశరథి కృష్ణమాచార్య ఆకాశవాణి మాధ్యమ ధర్మాలను చాలా లోతుగా ఆకళింపు చేసుకున్నారని సులువుగా మనం తెలుసుకోవచ్చు. త్రిపురనేని గోపీచంద్ రేడియో కాంట్రిబ్యూషన్ గురించి దాశరథి ఒక చక్కని వ్యాసం రాశారు. అందులో, ‘రేడియో రెక్కల గుర్రం వంటిది. అది వెళ్ల లేని చోటు లేదు. వినడానికి చెవి ఉండాలే గాని అవలీలగా వినిపిస్తుంది.ఈ మాధ్యమాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకొని దీన్ని క్రమబద్ధంగా వాడుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. ‘రేడియోకి రాయడం ఏమంత పని? ఇదిగో రాసేస్తాను క్షణంలో’ అని కొందరు అనవచ్చు.

రేడియోలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ‘రంగస్థలాకి బోలెడు నాటకాలు రాశాను. ఇది అలాగే’, అని మరికొందరు అనుకుంటారు. కానీ తీరా పూనుకున్నప్పుడు- రేడియో కొరకరాని కొయ్య బాబో! దీన్ని లొంగదీయడం ఐరావతాన్ని అధిరోహించడం లాంటిదని తెలుసుకుంటారు’ అని వివరించారు. మద్రాసులో ఒక నోబెల్ గ్రహీత ప్రసంగానికి వెళ్లాలని ప్రణాళిక చేసుకున్నా, ఆకాశవాణి రికార్డింగ్‌కు సంబంధించిన ఎడిటింగ్ బాగా ఆలస్యం కావడంతో, దాశరథి దానికి వెళ్లలేకపోతారు. ఈ విషయం గురించి అవకాశం పోయిందే అని కించిత్ ఖేద పడతారు. ఇందులో ఆకాశవాణి ఉద్యోగంపట్ల ఆయనకున్న శ్రద్ధాసక్తులు మనకు కనబడతాయి. ఇక ఆకాశవాణికి ప్రత్యేక సందర్భాల్లో ఆయన రాసిన రూపకాలు, లలిత గీతాలు లెక్కలేనన్ని. నిజానికి వాటిని పూర్తిగా సేకరించి, భద్రపరిచిన దాఖలాలు లేవు.

ఇటీవల గాంధీజీ గురించి కాస్త లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత దాశరథి చేసిన ఒక చిన్న ప్రసంగం చాలా ఫిలాసాఫిక్‌గా, కవితాత్మకంగా సాగుతుంది. (ఈ చిరువ్యాసం నా సంపాదకత్వంలో 2021లో వెలువడిన ‘గాంధీయేమార్గం’ ఒకటో సంపుటిలో అందుబాటులో ఉంది) అందులో గాంధీజీ అస్తమించి రమారమీ నలభయ్యేళ్ళు కావస్తుందని అనడం బట్టి ఆ ప్రసంగాన్ని ఆయన గతించడానికి కొంతకాలం క్రితమే చేసి ఉండాలని మనం పరిగణించాలి. ఆయన చివరి రోజుల్లో హైదరాబాద్ ఆకాశవాణిలో ఎమిరటస్ ప్రొడ్యూసర్‌గా సేవలు అందించారు. ఆకాశవాణి నుంచి ఆయన రాజీనామా చేసినా, చివరి వరకు కళాకారుడుగా మాత్రం ఆయన తన కళా నైపుణ్యాలను ఆకాశవాణికి అందించారు. ‘ఆ చల్లని సముద్ర గర్భం…’ నేడు సుప్రసిద్ధమైన గీతం అయితే అది ఆకాశవాణికి ‘ఈ మాసపు పాట’ గా రాశారనే విషయం దాదాపు మరుగునపడిపోయింది.

దాశరథి కృష్ణమాచార్య ఆకాశవాణిలో హైదరాబాదు, మద్రాసులలో రెండు చోట్ల పనిచేశారు. ఈ రెండు కేంద్రాల్లోనూ నేనూ పని చేశాను. అలాగే ఆయన పనిచేసిన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాల్లో నేను పని చేశాను అని చెప్పుకోడానికి గర్వపడతాను. ‘యాత్రాస్మృతి’ తొలిసారి 1988లో ముద్రణ అయినప్పుడు దేవులపల్లి రామానుజరావు ముందుమాటలో ఇలా అంటారు, ‘డాక్టర్ దాశరథి నిజాం నిరంకుశ పరిపాలనలో నిజాంకు ఆశ్రితుడుగానున్న ఒక జాకీర్దారు కఠినమైన ఏలుబడిలో జన్మించి, జనం మధ్య పెరిగి తన కవిత్వం ద్వారా ప్రజావాణికి మైక్ అమర్చెదనన్న వాగ్దానాన్ని పూర్తి గావించినాడు’ అని.

  •  డాక్టర్ నాగసూరి
    వేణుగోపాల్
  • దాశరథి శతజయంతి సంవత్సరం ముగింపు సందర్భంగా
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News