న్యాక్ అక్రిడియేషన్, ఎన్‌బిఎ గుర్తింపు ఉన్న కాలేజీలకు ఫీజులు పెరిగే అవకాశం
పాత ఫీజులతోనే కొనసాగుతున్న ఇంజినీరింగ్ ప్రవేశాలు
ఒకవేళ కొత్త ఫీజులు అమల్లోకి వస్తే అదనపు ఫీజులు చెల్లించాల్సిందే
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ న్యాక్ అక్రిడియేషన్, ఎన్‌బిఎ గుర్తింపు ఉన్న కాలేజీలకు తప్పనిసరిగా ఫీజులు పెంచాల్సిన పరిస్థితి రావచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కొత్త ఫీజులు అమల్లోకి వస్తే ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆ మేరకు అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కళాశాలలకు ఫీజుల ఖరారు కోసం కొత్త విధివిధానాల రూపకల్పనకు ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నియమించిన విషయం తెలిసిందే. కాగా, కమిటీ గత నెల 29వ తేదీన తొలి సమావేశం నిర్వహించగా, సోమవారం మరోసారి కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.
ఫీజులు పెంచకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించడం ఎలా సాధ్యమని ప్రైవేట్ యాజమాన్యాలు కమిటీని ముందు తమ ఆవేదనను చెప్పుకుంటున్నట్లు తెలిసింది. అలాగే సకాలంలో ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నట్లు యాజమాన్యాలు కమిటీ ముందు వాపోతున్నట్లు తెలిసింది. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు వేల సంఖ్యలో సీట్లు పెంచుకుంటున్నాయని, ఫీజులు కూడా ఆ వర్సిటీలే నిర్ణయించుకుంటున్నాయని, దాంతో వేతనాలు ఎక్కువ ఇస్తామని చెబుతుండటంతో తమ కళాశాలల్లో అధ్యాపకులను నిలుపుకోవడమే కష్టమవుతుందని చెబుతున్నట్లు తెలిసింది. ఇంటర్నేషనల్ స్కూళ్లలో నర్సరీ ఫీజులతో పోల్చితే ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు తక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఫీజులు పెంచకపోతే ప్రమాణాలు పాటించలేని పరిస్థితి నెలకొంటుందని కమిటీ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.
ఫీజుల పెంపుపై కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం
రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను సవరించాలి. మూడేళ్లకు ఒకసారి ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీల ఆదాయ, వ్యయాలను పరిశీలించి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) కొత్త ఫీజులను ఖరారు చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈసారి కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటి(టిఎఎఫ్‌ఆర్‌సి)కి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్‌రెడ్డి తప్పుడు లెక్కలు సమర్పించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈసారికి పాత ఫీజులతోనే ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే కొన్ని కళాశాలలు కొత్త ఫీజులను నిర్ధారించి అమలు చేయాలని హైకోర్టును ఆశ్రయించాయి. కాలేజీలు ఫీజుల నిర్ధారణ కోసం సమర్పించిన ప్రతిపాదనలపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ టిఎఎఫ్‌ఆర్‌సికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ ఇతర రాష్ట్రాల్లోని అమలవుతున్న ఫీజుల విధానం, వివిధ న్యాయస్థానాల తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువులోగా అంటే దాదాపు నెల రోజుల్లోగా ఫీజులు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు అందజేయనున్నది. కమిటీ సిఫార్సుల మేరకు ఫీజుల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.