Monday, June 2, 2025

మళ్లీ విఫలమైన యూరప్

- Advertisement -
- Advertisement -

మన విక్రమార్కుని బేతాళ కథలు ఇంగ్లీషు, తదితర విదేశీ భాషలలోకి అనువాదమయాయో లేదో తెలియదు. ఒకవేళ అయిఉంటే ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఏదో విధంగా లొంగదీయాలనే యూరోపియన్ దేశాల విశ్వప్రయత్నాలను, ఆ ప్రయత్నాలు ప్రతిసారి విఫలం కావటాన్ని ప్రపంచ జర్నలిస్టులు, నిపుణుల ఆ కథలతో పోల్చి ఉండేవారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత యూరోపియన్ నాయకులకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అవి, ఆయనను ఎట్లాగయినా సరే సైనికంగా తమతోపాటు ఉక్రెయిన్ పక్షాన నిలపాలనే యుక్తులు. కాని అవి కూడా ఫలించడం లేదు. అనగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి, యూరప్‌కు విక్రమార్కుడి బేతాళ శవం విషయమై డబుల్ వైఫల్యాలన్నమాట.

అటువంటిదే ఈ నెల 1920 తేదీలలో మరొకసారి జరిగింది. అట్లా జరగటం ఇది ఎన్నవసారంటే ఎవరైనా లెక్కిస్తూన్నారో లేదో తెలియదు గాని, ఆ లెక్క మన వద్ద మాత్రం లేదు. ఇంతకూ ఈసారి జరిగిందేమిటో చెప్పుకుందాము. ఉక్రెయిన్ యుద్ధాన్ని తాను పదవిని స్వీకరించిన 24 గంటలలో ముగిసేట్లు చేయగలనని ట్రంప్ తన ప్రచార సమయంలో ప్రకటించటం తెలిసిందే. ఆ మాటను మరీ అక్షరాల కాకున్నా త్వరగా ముగింపజేయటం అనే అర్థంలో తీసుకోవాలి. ఆ గడువులోగా తను ఆ పని చేయలేకపోయినా అందుకోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నమాట నిజం. ఆయన విధానాలను ఇతరత్రా తీవ్రంగా విమర్శిస్తున్నవారు కూడా తను యుద్ధ పిపాసి కాదని, ఉక్రెయిన యుద్ధం ముగియాలన్నది తన కోరిక అని, అందుకు ప్రశంసించాలనే అంటున్నారు.

ఆ మేరకు గత రెండు వారాలలో జరిగిందేమిటన్నది చూస్తే, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలను ట్రంప్ చర్చలకు ఒప్పించారు. రాజీలో ఉక్రెయిన్ వైపు నుంచి కొన్ని జరగాలని ట్రంప్ మొదటి నుంచి సూచిస్తున్న వాటిని ఈసారి కూడా ప్రకటించారు. అవి, రష్యా ఆక్రమణలోగల క్రిమియాను, దోన్‌బాస్‌లోని ప్రాంతాలను వారికి వదలివేయటం, ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం ఇవ్వకపోవటం. ట్రంప్ ప్రయత్నాల ఫలితంగా గత మూడేళ్ల యుద్ధంలో మొదటిసారిగా రెండు దేశాల ప్రతినిధుల మధ్య ముఖాముఖి చర్చలు ఈనెల 9న టర్కీ నగరం ఇస్తాంబుల్‌లో జరిగాయి. వాస్తవానికి యుద్ధం ఆరంభమైన తొలి రోజులలోనే కొన్ని చర్చలు జరిగినా అపుడు కుదిరిన రాజీనుంచి ఉక్రెయిన్ ఉపసంహరించుకున్నందున వాటికి విలువ లేకుండా పోయింది. ఇస్తాంబుల్ చర్చల విషయానికి వస్తే, ఒక్క సమావేశంలోనే తుది పరిష్కారం రాగలదని ఎవరూ ఆశించలేరు. కాని, ఒక ఆరంభమంటూ జరిగితే క్రమంగా ముందుకుపోవచ్చు. ఆ విధంగా ఇస్తాంబుల్‌లో ఇరువురూ వెయ్యేసి మంది యుద్ధ ఖైదీలను మార్చుకునేందుకు అంగీకరించారు. చర్చలు ముందుకు సాగేందుకు రష్యా తన ప్రతిపాదనలు ముందుపెట్టింది.

సమస్య అక్కడ మొదలైంది. ఉక్రెయిన్ కూడా తన ప్రతిపాదనలు చేసి తర్వాత మళ్లీ కూర్చోవచ్చు. చర్చలు ఎపుడైనా అట్లాగే సాగుతుంటాయి. కాని ఉక్రెయిన్ ఆ పని చేయక, వెంటనే 30 రోజుల పాటు బేషరతుగా యుద్ధ విరమణ జరిగితేనే తాము ముందుకు పోగలమన్నది. ఈ మాట గత నెల రోజులుగా అంటున్నా రష్యా అంగీకరించలేదు. ఆ 30 రోజులను ఉపయోగించుకుని సైన్యాలను, ఆయుధాలను మరింతగా నియోగించటం ఉక్రెయిన్ ఎత్తుగడ అని, అటువంటిది చేయబోమన్న హామీ లభించి, ఆ విషయమై తటస్థుల పర్యవేక్షణ ఉంటే మాత్రమే అంగీకరించగలమని రష్యా స్పష్టం చేసింది. ఇక్కడ గుర్తించవలసింది ఒకటున్నది. ఒకవేళ ఇందులో ఉక్రెయిన్ ప్రమేయం మాత్రమే ఉంటే ఒక విధంగా ఉండేది. కాని ఈ వ్యవహారం పొడవునా జెలెన్‌స్కీని వెనుక ఉండి నడుపుతున్న యూరోపియన్ యూనియన్ నాయకులు అందుకు సరిపడనివ్వలేదు. దానితో ఇస్తాంబుల్ చర్చలు అంతటితో నిలిచి పోయాయి.

ఆ వెంటనే యూరోపియన్ నాయకులు తమ అజెండాను ముందుకు తెచ్చారు. అది, రష్యా కాల్పుల విరమణకు అంగీకరించటం లేదనే వాదన చేస్తూ ట్రంప్‌ను తమవైపు తిప్పుకోవటం. ఆయన గతంలోనే సమస్యకు రాజీ జరగాలంటూ ఉక్రెయిన్‌కు సహాయం ఆపివేయటం, రష్యా వాదనలు సమంజసమైనవని అభిప్రాయపడటం జరిగినప్పటి నుంచీ యూరప్, జెలెన్‌స్కీలు వ్యూహం సరిగా ఇదే. ట్రంప్‌ను ముగ్గులోకి లాగటం. వారికి శాంతియుతమైన పరిష్కారం ఎప్పుడూ ఇష్టం లేదు. ట్రంప్ రాకకు ముందు కూడా. ఇపుడాయన రాజీ ధోరణి చూపుతుండగా అటువంటిది జరగరాదని, తనన్ను మాజీ అధ్యక్షుడు బైడెన్ కాలంలోవలే ఉక్రెయిన్‌కు అనుకూలంగా రంగంలోకి తీసుకు రావాలని, రష్యాను ఓడించి తీరాలన్నది వారి పట్టుదల. ట్రంప్ కన్న ముందు బైడెన్ ఆ విధంగానే చేసినా రష్యాను ఓడించలేకపోయామని, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా 20 శాతం వరకు ఆక్రమించుకున్నదని, యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు తీవ్రనష్టాలు జరుగుతున్నాయని, రష్యా పై అందరూ కలిసి దాదాపు 22,000 ఆంక్షలను విధించినా ప్రయోజనం లేకపోయిందని తెలిసి కూడా తమ ప్రయత్నాలు మానటంలేదు.

మరొక వైపు స్వయంగా తమ ఆర్థిక, సైనిక శక్తులు బలహీనపడుతూ ప్రజాభిప్రాయం క్రమంగా వ్యతిరేకమవుతున్నా తమ ధోరణి మారటం లేదు.ఈ స్థితిలో అమెరికా కొత్త అధ్యక్షుని వైఖరి యూరోపియన్ నాయకులకు, వారికి బందీ అయిపోయిన జెలెన్‌స్కీకి పెద్ద సంకటంగా మారింది. అమెరికా తమ వెంట ఉన్నపుడే ఏమీ చేయలేనివారు తన అండలేనట్లయితే? అందువల్లనే ట్రంప్ గెలిచే సూచనలు ప్రచార సమయంలో కనిపించినప్పటి నుండి మొదలు కొని ఈ రోజు వరకు కూడా రకరకాలు ఉపాయాలతో ఆయన మనసు మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. జెలెన్‌స్కీని రెచ్చగొట్టటం, ట్రంప్ వద్ద పుతిన్ వ్యతిరేక ప్రచారాలు, అమెరికా తోడ్పాటు లేకున్నా తాము ఎంతకాలమైనా సరే ఉక్రెయిన్‌కు మద్దతు నివ్వగలమనటం, తమ రక్షణ బడ్జెట్లు పెంచటం వంటివన్నీ అందులో భాగమే. ఇస్తాంబుల్ చర్చలు ప్రతిష్ఠంభనకు గురయ్యాయి గాని, వాస్తవానికి యూరోపియన్ నాయకులు అందుకు సన్నాహాలు అంతకు ముందు రోజులలోనే ఆరంభించారు. నెల రోజులపాటు బేషరతు సంపూర్ణ కాల్పుల విరమణ అనే మాట అందులో భాగమే.

వారు చెప్పే దాని ప్రకారం తమ ప్రతిపాదనను రష్యా ప్రతి విషయంలో యథాతథంగా అంగీకరిస్తేనే శాంతికి సిద్ధపడినట్లు లెక్క. రష్యా తన పరిస్థితుల ప్రకారం ఎటువంటి షరతులు విధించరాదు. ఉక్రెయిన్ మాత్రం ఏ షరతులకూ ఒప్పుకోదు. వారు ఒప్పుకోనివ్వరు. చివరకు 30 రోజుల విరమణ మాట ట్రంప్‌తో కూడా అనిపించారు. ఆ వెనుక ఆయన ఇద్దరు అధ్యక్షులతో సుదీర్ఘంగా ఫోన్‌లో మాట్లాడి, ఇక చర్చలు మొదలవుతాయన్నారు. తీరా ఇస్తాంబుల్‌లో కూర్చునే సరికి యూరోపియన్ల వ్యూహం ముందుకు వచ్చింది. ఇందులోని ఉపాయం ఏమంటే, 30 రోజుల బేషరతుకు పుతిన్ కాదన్నట్లయితే, దానిని ఒక కారణంగా చూపుతూ, ఇక ట్రంప్‌ను తమ వైపు తిప్పుకోవటం. ఒకవైపు ఇదంతా జరుగుతుండగానే యూరోపియన్ నాయకులు, ఉక్రెయిన్ అధ్యక్షుడు కలిసి ఇందుకు ఇందుకు సమాంతరంగా ఒక పథక రచన చేయటం గమనించదగ్గది. అది, రష్యాపై తాము మరిన్ని ఆర్థిక ఆంక్షలు ప్రకటిస్తూ, అమెరికా చేత కూడా ప్రకటింప చేయటం.

కాని, ఆ పని చేసినట్లయితే చర్చలు మునుముందు ఇంకా కష్టమవుతాయిని, కనుక తాము, ఆపని చేయబోమని ట్రంప్‌తోపాటు ఆయన విదేశాంగ మంత్రి మార్కోరూబియో వెంటనే స్పష్టం చేసారు. ఆ విధంగా బేతాళుడు విక్రమార్కుని భుజం పై నుంచి మరోమారు మాయమై చెట్టెక్కాడు. అయినా విసుగుచెందని విక్రమార్కుడు బ్రస్సెల్స్‌లో 20వ తేదీన సమావేశమై అమెరికా అధ్యక్షునిపై ఆగ్రహం ప్రకటించాడు. రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు తామే విధించగలమని ఆ జాబితా సిద్ధ్దం చేయగలమని హెచ్చరించాడు. వాటికి తాము బెదరబోమని ఆ వెంటనే రష్యా జవాబిచ్చింది. బయటి ప్రపంచానికి లెక్కలు ప్రచారంలో లేవు గాని, రష్యాపై ఇప్పటికి 21,692 ఆంక్షలున్నాయంటే నమ్మటం కష్టం. కాని అవి రష్యాను లొంగదీయలేకపోవటమే గాక, ఈ మూడేళ్లలో రష్యా ఆదాయం పెరుగుతూనే ఉండటం యూరప్‌కు నమ్మలేనది ఉంది.

అసలు సమస్య ఎక్కడవస్తున్నదంటే, యూరప్ నాయకులు తమ వలసవాద, సామ్రాజ్యవాద ధోరణులు నుంచి బయటపడలేకపోతున్నారు. నాటో సైనిక కూటమిని మరింతగా విస్తరించి రష్యాను దెబ్బ తీయటం వారి పరమ లక్షం. అందుకోసం ఉక్రెయిన్‌ను ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది బాగా అర్థమైనందునే ట్రంప్ వారికి మద్దతు నివ్వటం లేదు. మారుతున్న కాలంలో యుద్ధాలు గాక అభివృద్ధి అవసరమనే ధోరణిని అమెరికా అధ్యక్షుడు అనూహ్యమైన రీతిలో చూపుతున్నప్పటికీ వారికి వివేకం కలుగటంలేదు. రష్యా వ్యతిరేక యుద్ధంలోకి అమెరికా రాగల అవకాశం లేదు. యూరోపియన్లు ఎన్నేళ్లు యుద్ధం సాగించినా పలు నష్టాలకు గురికావటం మినహా రష్యాను ఓడించటం సాధ్యమయేది కాదు. ఈ చేదు నిజాన్ని వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. యుద్ధ సమస్య అంత త్వరగా పరిష్కారమవుతుంది.

టంకశాల అశోక్ (దూర దృష్టి)

(రచయిత సీనియర్ సంపాదకులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News