భూమీ లేదు ఆకాశమూ లేదు
ఉన్నవి రెండే
పొగమేఘాలూ బూడిద పవనాలూ
ఉన్నవి రెండే
ఒకటి మృత్యువూ రెండోది బీభత్సమూ
ఒకటి పైనుండి కురుస్తుంది
ఇంకోటి భూమి మీద పడుతుంది
తలదాచుకునే నీడుంటే
తల్లులు తమ రెక్కల కింద
పిల్లల్ని పొదువుకునే వారే
పొదువుకుని ఎక్కడికి పరుగెట్టాలి?
ఆవాసాలు నేలమట్టమవుతుంటే
ఏ మైదానంలో.. ఏ చాటున
నక్కి దాక్కోవాలి
ఎక్కడికెళ్లినా పైకప్పు చావే
నిరాయుధ పౌరుల్ని సామూహికంగా
వేటాడే ఏకపక్ష యుద్ధంలో
మైళ్లకు మైళ్లు విస్తరించే
బూడిద గొడుగులకు నీడ ఉండదు
భస్మం కూడా చావునీడలోనే
చావుతో సహజీవనం చెయ్యాల్సిందే
భయానక మృత్యు కుహరంలో సైతం
తల్లులు ఏడుస్తూనే పిల్లల్ని
సముదాయించుకుంటారు
ఇప్పుడక్కడ పిల్లలు ఏడుస్తున్నారు
ఊరుకో బెట్టడానికి తల్లులే లేరు.
ఏడుపు మర్చిపోయిన పిల్లలున్నారు
గుర్తుచేసే తల్లులే లేరు
బిక్కచచ్చిన తల్లుల్ని చిట్టిచేతులతో
తట్టి బతికించే పిల్లలు మిగల్లేదు
నేలమాళిగల్లో శాశ్వతంగా నిద్రపోతున్నారు.
ఎక్కడా ఎవరూ లేరు
అంతటా రాళ్లగుట్టల మధ్య
రొట్టెముక్క కోసం వెదికే జీవచ్ఛవాలే..
ఒక రాజ్యం ఇంత పగబట్టగలదని
పసివాళ్లకి తెలీదు
వాళ్ల శవాలకీ తెలియదు
శిథిలాల కింద మరణించిన
చిన్నారి పిడికిట్లో కల
చిరకాలంగా తీరని కాంక్ష
సమాధుల్లో సైతం పదే పదే
ఉలిక్కిపడిలేచి ఏడవకుండా
కాస్త ప్రశాంతంగా పడుకోడానికి
నాకో సొంత నేల కావాలి
నీ కంచెలు లేని, బాంబులు కురవని
నా సొంత నేల, నా నేల నాక్కావాలి
– వసీరా