కృత్రిమ మేధ (ఎఐ) అనేది యంత్రాలు మానవులవలే ఆలోచించి, మానవ సామర్థ్యాలను అనుకరించే పనులను చేయగల సాంకేతికత. ఈ సాంకేతికత భారీ డేటాను సేకరించి, గణిత నమూనాలు లేదా అల్గారిథమ్‌ల ద్వారా నమూనాలను గుర్తించి, ఊహలు చేసేందుకు శిక్షణ పొందుతుంది. శిక్షణ తర్వాత, ఈ అల్గారిథమ్‌లు వివిధ అనువర్తనాల్లో ఉపయోగించబడతాయి. కొత్త డేటా నుండి నేర్చుకుంటూ, చిత్రాన్ని గుర్తించటం, భాషా ప్రాసెసింగ్, డేటా విశ్లేషణ వంటి సంక్లిష్ట పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహిస్తాయి. ఎఐలో ప్రధాన రకాలు ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్ డేటా నుండి నేర్చుకుని నిర్దిష్ట పనులను చేస్తుంది. దాని ఖచ్చితత్వం అనుభవంతోపాటు పెరుగుతుంది. డీప్‌లెర్నింగ్ మానవ మెదడును పోలి ఉంటుంది.
అది న్యూరల్ నెట్‌వర్క్‌ల ద్వారా సంక్లిష్ట నమూనాలను గుర్తిస్తుంది. వైద్య చిత్రాల విశ్లేషణ, ఉపగ్రహ చిత్రాల్లో కదలికలు, ప్రకంపనలను గుర్తించడం వంటి పనులకు ఉపయోగపడుతుంది. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పి) మానవ భాషను అర్థం చేసుకుని, సంభాషించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జనరేటివ్ ఎఐ టెక్ట్, చిత్రాలు, వీడియోల వంటి కొత్త కంటెంట్‌ను సృష్టిస్తుంది. (Creates content) కళ, వినోదం, మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ మొదలైన అనేక రంగాల్లో, వాటి అభివృద్ధిలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఎఐ ఏజెంట్లు స్వయంచాలకంగా (తమకు తామే స్వయంగా) నిర్ణయాలు తీసుకుంటాయి. ఏజెంటిక్ ఎఐ బహుళ ఏజెంట్ల సమన్వయంతో సంక్లిష్ట పనులను నిర్వహిస్తుంది. ఉదాహరణకు, పరిశోధన లేదా సాఫ్ట్‌వేర్ సమస్యల వంటివి పరిష్కరిస్తుంది. ఎఐ నాలుగు వర్గాలుగా విభజించబడింది: రియాక్టివ్ ఎఐ సమాచారం ఆధారంగా ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది. లిమిటెడ్ మెమరీ ఎఐ గత డేటాను ఉపయోగించి ఊహలు చేస్తుంది.
థియరీ ఆఫ్ మైండ్ ఎఐ మానవ భావోద్వేగాలను అర్థం చేసుకునే సైద్ధాంతిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సెల్ఫ్- అవేర్ ఎఐ యంత్రాలకు మానవ స్థాయి స్పృహను ఇవ్వగల సైద్ధాంతిక దశను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, ఎఐ సమస్యలను పరిష్కరించడం, పరిష్కారాలను అభివృద్ధి చేయడం, ప్రశ్నలకు సమాధానమివ్వడం, సూచనలను అందించడం వంటివి చేస్తోంది. ‘డ్రాప్‌బాక్స్’, ‘చాట్‌జిపిటి’, ‘సౌండ్‌రా’ వంటి సాధనాలు మన సమయాన్ని ఎంతగానో ఆదా చేస్తాయి. ఉత్పాదకతను పెంచుతాయి. స్మార్ట్ ఫోన్ అసిస్టెంట్లు, ఇ-కామర్స్ సిఫారసు వ్యవస్థలు, స్వయంచాలక వాహనాలు, మోసం గుర్తింపు, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ పరిశోధనలో ఎఐ ఉపయోగించబడుతోంది. ఎఐ కొత్త విద్యుత్ అని ఆండ్రూ ఎన్జీ పేర్కొన్నారు. గూగుల్ మ్యాప్స్, టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ వంటి రోజువారీ సాధనాల్లో ఎఐ ఇప్పటికే ఉంది.
ఎఐ నైపుణ్యాల డిమాండ్ గత దశాబ్దంలో నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఎఐ సంబంధిత ఉద్యోగులకు 11 శాతం ఎక్కువ వేతనం లభిస్తున్నాయి. సమాచారం, ఆర్థిక శాఖ, పరిపాలన రంగాలలో ప్రత్యేకంగా ఎఐని ఉపయోగిస్తున్నారు. అనేక ఇతర రంగాలలో ఎఐ వాడకం నానాటికీ అనూహ్యంగా పెరుగుతోంది. ఎఐ డేటా ఎంట్రీ వంటి పునరావృత (రొటీన్) పనులను ఆటోమేట్‌గా వేగంగా పని చేస్తుంది. భారీ డేటాను సైతం విశ్లేషించి, తార్కిక నిర్ణయాలకు సహాయపడుతుంది. చాట్ బాట్‌లు కస్టమర్ డిమాండ్ మేరకు స్ట్రీమ్‌లైన్ చేస్తాయి. జెపి మోర్గాన్ ఒమ్ని ఎఐ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక అంతర్ దృష్టులను అందించి, ఖర్చులను తగ్గిస్తుంది. 2028 నాటికి 90 శాతం యజమానులు ఎఐని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఎఐ ఆటోమేషన్ 25 శాతం ఉద్యోగాలను భర్తీ చేయవచ్చు. కానీ సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ వంటి కొత్త రంగాల్లో అవకాశాలను మరింత ఎక్కువగా సృష్టించే అవకాశం ఉంది. ఆర్థికం, ఇ- కామర్స్, ఆరోగ్య సంరక్షణ, విద్య, బీమా, న్యాయ సేవలు ఇలా అనేక రంగాల్లో ఎఐ వాడకం విస్తరించుకుంటూపోతుంది. గ్రంథాలయలలో ఎఐ వాడకం ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, జ్ఞాన ప్రాప్యతను విస్తరిస్తుంది. చాట్‌బాట్‌లు కస్టమర్ ను గుర్తించటం, నిర్ధారణ చేసుకోవటం, డేటా పర్యవేక్షణ, ఖర్చు ఆదాలో సహాయపడుతునతున్నాయి. కానీ ప్రస్తుతం అసమర్థమైన స్పందనల కారణంగా మానవ లైబ్రరీయన్‌లను పూర్తిగా రీప్లేస్ చేయలేవు. మనిషికి బహు విధాలుగా ఉపయోగపడే సాధనంగా చెప్పచ్చు.
ఎఐ సర్క్యులేషన్, కాటలాగింగ్ వంటి పనులను ఆటోమేట్‌గా చేస్తుంది, ‘టెక్ట్ టు -స్పీచ్’ ద్వారా సౌలభ్యతను మెరుగుపరుస్తుంది, డేటా విశ్లేషణ, విషయ సేకరణ, విషయ నిర్వహణ, మెటా డేటా ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. లైబ్రరీయన్‌లు ఎఐని గురించిన అవగాహను పెంచుకోవాలి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని లోతుగా పొందాలి. అందుకు వర్క్‌షాప్‌లు, శిక్షణా తరగతులు ఎక్కువగా నిర్వహించాలి. ఎఐ పై ప్రపంచ వ్యాప్తంగా అనేక విధాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిలో అప్ డేట్ వర్షన్లు గురించి లెబ్రేరియన్స్ ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎఐని బాధ్యతాయుతగా ఉపయోగించాలి.
గమనించాల్సిన విషయాలు: ఎఐ ఎల్లప్పుడూ ఖచ్చితమైనది కాదు. ఎఐ పై మానవ తనిఖీ, పర్యవేక్షణ అవసరం. న్యాయ శాస్త్రంలో, పరిశోధనా రంగాలలో దీనిని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇది కొన్ని తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. దీనికి వేగంగా సమాచారాన్ని తీసుకుని విశేషణ చేస్తుంది. అయితే అది విషయాన్ని నేర్చుకునే సమయంలో తప్పు సమాచారం ఇస్తే దానినే యథాతథంగా నేర్చుకొని తప్పు సమాధానమే మనకు ఇస్తుంది. రఫ్ డ్రాఫ్ట్‌లు, రాయడంలో లోపాల తగ్గిస్తుంది. పదేపదే చేయవలసిన రొటీన్ పునరావృత పనులకు ఎఐ ఉపయోగపడుతుంది. కానీ, అది ప్రస్తుత పరిస్థితుల్లో భావోద్వేగాలను వ్యక్తీకరించలేదు. భవిష్యత్తులో చెప్పలేం.
అందుకే దీనికి మానవ స్పర్శ అవసరం. ఎఐ సాక్షరత పాఠశాల పాఠ్యాంశాల్లో భాగం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది భవిష్యత్తు కెరీర్‌లకు ఉపయోగపడుతుంది. సామాజిక అభివృద్ధికి అది కీలకం కానుంది. ఎఐని గురించి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దీనిని సమర్థవంతంగా ఉపయోగించడానికి నిరంతర శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి అవసరం ఉంటుంది. లైబ్రరీలు, విద్యా సంస్థలు ఎఐని సమీకరించడం ద్వారా డిజిటల్ సామర్థ్యాన్ని,ఆవిష్కరణలను పెంపొందించగలవు. ఎఐ మన జీవితాలను, పని వాతావరణాన్ని, విద్యను వేగంగా మార్చివేస్తోంది. అలాగే దీనిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం ద్వారా మనం భవిష్యత్తును మరింత సమర్థవంతంగా, సమగ్రంగా రూపొందించగలం.
- డా. రాధికారాణి,
80743 17172