ప్రియుడితో కలిసి మాజీ సైనికుడైన తన భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు భర్త మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికి.. ఆ భాగాలను వేర్వేరు ప్రదేశాల్లో పడేసింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ కేసులో భార్య, ఆమె ప్రియుడితోపాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని యూపి పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన ప్రకారం.. నిందితురాలు మాయా దేవి అనే 50 ఏళ్ల మహిళ బహదూర్‌పూర్ నివాసిస్తోంది. అయితే, ఆమె అనిల్ యాదవ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో భారత సైన్యంలోని BRO (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) విభాగంలో రిటైర్డ్ సిబ్బందిగా పనిచేసిన తన భర్త దేవేంద్ర కుమార్‌ను చంపడానికి కుట్ర పన్నింది. ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత శరీర భాగాలను ఆరు ముక్కలుగా నరికి పడేసింది. అనంతరం మే 10న పోలీస్ స్టేషన్‌లో తన భర్త తప్పిపోయినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. బీహార్‌లోని బక్సర్ రైల్వే స్టేషన్ నుండి తన కుమార్తెను తీసుకురావడానికి వెళ్ళాడని, కానీ తిరిగి రాలేదని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ముక్కులుగా నరికిన శరీర భాగాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మొండెంను దేవేంద్ర కుమార్‌తో సరిపోల్చారు. మొదట నరికిన అవయవాలు, రెండు రోజుల తర్వాత మొండెం సమీపంలోని బావిలో కనుగొన్నారు. తర్వాత మాయా దేవిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. భర్తను చంపి, అతని శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, బలియా జిల్లాలోని ఒక నది ఒడ్డున వేర్వేరు ప్రదేశాలలో పడవేసినట్లు తెలిపింది. దీంతో వీరితోపాటు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. దేవేంద్ర తలను ఘాఘరా నదిలో పడేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడి తల ఇంకా కనిపించలేదని పోలీసులు చెప్పారు.