ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు తరఫున పేస్ బౌలర్ సిరాజ్ (Mohammed Siraj) కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ 2-2 తేడాతో సమంగా ముగియడానికి అతడి సహకారం ఎంతో ఉంది. ముఖ్యంగా ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో ఓటమి అంచున ఉన్న భారత్‌ని.. విజయం వైపు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా సిరాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీలు, అతన్ని తెగ మెచ్చుకుంటున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ గోవర్ సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
సిరాజ్ (Mohammed Siraj) ఫిట్‌నెస్‌కి ఫిదా అయిపోయాడు డేవిడ్ గోవర్. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సిరాజ్ మొత్తం ఐదు మ్యాచులు ఆడాడు. ఏకంగా 185.3 ఓవర్లు అంటే 1113 బంతులు బౌలింగ్ చేశాడు. ఇది చూస్తేనే అతని ఫిట్‌నెస్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. ‘సిరాజ్ అసలు ఏం తింటాడో?, ఏం తాగుతాడో? నాకు తెలియాలి. ఎందుకంటే నేను వాటిని మా ఇంగ్లండ్ బౌలర్లకు కూడా ఇస్తాను. ఈ సిరీస్‌లో విశ్రాంతి తీసుకోకుండా ఐదు టెస్టుల్లోనూ ఆడాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతను తగ్గినట్లు కానీ, అసలిపోయినట్లు కానీ కనిపించలేదు. గెలవాలనే సంకల్పంతో, ఫిట్‌నెస్ విషయంలో సిరాజ్ మేటిగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లు చాలాకాలంగా ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ, సిరాజ్ మాత్రం అలవోకగా ఐదు టెస్టులు ఆడాడు. ఇది నిజంగా అద్భుతం’ అని గోవర్ అన్నాడు.