అత్యాచారం కేసులో బహిష్కృత జేడీఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని హోలెనరసిపురలో ఉన్న ఫామ్‌హౌస్‌లో 47 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో శనివారం కోర్టు ఆయనకు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. అత్యాచారం, లైంగిక వేధింపులు, సాక్ష్యాలను నాశనం చేయడం, అత్యాచారానికి సంబంధించిన వీడియోలను సర్కిలేట్ చేయడం వంటి ఆరోపణలపై భారత శిక్షాస్మృతి(అత్యాచారం) సెక్షన్ 376(2)(n) కింద నమోదైన కేసులో దోషిగా తేలడంతో రేవణ్ణకు జీవిత ఖైదుతోపాటు కోర్టు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. రూ.10 లక్షల జరిమానాలో బాధితురాలికి రూ.7 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
రేవణ్ణ అరెస్టు అయిన దాదాపు 14 నెలల తర్వాత.. విచారణ ప్రారంభమైన ఎనిమిది వారాలలోపే న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ ఈ తీర్పును వెలువరించారు. ఈ కేసులో కోర్టుకు హాజరైన రేవణ్ణ.. తీర్పు అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కోర్టు గదిలోనే ఏడుస్తూ తక్కువ శిక్ష కోసం విజ్ఞప్తి చేశాడు.
కాగా, హసన్ జిల్లాలోని హోలెనరసిపురలోని రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న బాధితురాలు.. 2021 నుండి ప్రజ్వల్ రేవణ్ణ తనపై పదే పదే అత్యాచారం చేశాడని ఆరోపించింది. లైంగిక వేధింపులు, అత్యాచారం సమయంలో వీడియోలను రికార్డ్ చేశాడని.. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను విడుదల చేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.