తన ఆస్తులపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా, ధర్మారం పాత్రికేయులకు పంపిన ఒక ప్రకటనలో పలు అంశాలను ఆయన వివరించారు. ధర్మారంలో మంగళవారం జరిగిన సంఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు. జరిగిన సంఘటనను ప్రజలందరూ గమనిస్తున్నారని, వారే మంచి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అసత్య ఆరోపణలు, ఆవేశంతో అభివృద్ధి జరగదని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన విప్ లక్ష్మణ్‌కుమార్‌పై నిప్పులు చెరిగారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దానికి ధీటుగా సమాధానం చెప్పడం కోసం మంగళవారం ధర్మారంలో వందలాది కార్యకర్తలు వచ్చి గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రెస్‌మీట్ పెట్టి చెప్పే ప్రయత్నంలో వారిని మాట్లాడకుండా, ప్రెస్‌మీట్ జరగకుండా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసిన పరిస్థితిని సమాజమంతా చూసిందన్నారు. సాయంత్రం మళ్లీ స్థానిక ఎంఎల్‌ఎ ప్రెస్‌మీట్ పెట్టి తనపై రకరకాల ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహ్యం వ్యక్తం చేశారు.
ఎంఎల్‌ఎ తనపై చేసిన ఆరోపణలకు కచ్చితంగా నిర్దిష్టమైన విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఎంఎల్‌ఎ అభివృద్ధిపై మాట్లాడడం వదిలేసి ఆస్తులపైన మాట్లాడుతున్నారని, కుటుంబ సభ్యులపై మాట్లాడుతున్నారని, అభివృద్ధి విషయంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమాధానం చెబుతారని అన్నారు. తాను 17 ఏళ్లపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ప్రజలకు ఇవన్నీ తెలుసని అన్నారు. ఎంఎల్‌ఎగా గెలిచిన వెంటనే రైతులకు సంబంధించి ఆరు సొసైటీలపై స్వయంగా లక్ష్మణ్‌కుమార్ కంప్లెయింట్ ఇచ్చి దానిపై విచారణ చేయాలని చెప్పి లెటర్ ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలోనే ఏ ఎంఎల్‌ఎ చేయని ఘనకార్యం చేసి ఆరు సొసైటీలపై కంప్లెయింట్ ఇస్తే వాళ్లు అందులో ఏ అవకతవకలూ జరగలేదని కోర్టుకు వెళ్తే, లక్ష్మణ్‌కుమార్‌కు కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. లక్ష్మణ్‌కుమార్ తన ఆస్తులపై విచారణ జరిపించే ముందు ఆయన ఆస్తుల లెక్కలు తేలాల్సి ఉందని తెలిపారు. ఏడాదిన్నర పాలనలో కరీంనగర్‌లో ఇల్లు ఎట్లా కడుతున్నారని, హైదరాబాద్‌లో విల్లా ఎలా కొన్నారని ప్రశ్నించారు.