Wednesday, August 20, 2025

రేవంత్‌రెడ్డి నిద్రలో కూడా కెసిఆర్‌నే కలువరిస్తున్నారు:మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిద్రలో కూడా కెసిఆర్‌నే కలువరిస్తున్నారని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్ ఎక్కడకు వెళ్లినా కెసిఆర్‌ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి కెసిఆర్ కారణం అనడం తప్ప రేవంత్ చేసిన మంచి పని ఏదీ లేదని విమర్శించారు. ఎన్నికలప్పుడూ అబద్దాలే, ఇప్పుడూ అబద్దాలేనా..? అని ప్రశ్నించారు. కెసిఆర్ 50 శాతంలోపు రిజర్వేషన్లకు చట్టం తెచ్చారని రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కానీ కెసిఆర్ 62 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నించారని, దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు 50 శాతం క్యాప్ విధించేందుకు కారణమయ్యారని అన్నారు.

రిజర్వేషన్ల క్యాప్‌కు కాంగ్రెస్ నేతలు కారణం కాదని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, సోనియాగాంధీల మీద ఒట్టేసి చెప్పగలరా..? అని నిలదీశారు.తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంచి పనులకు క్రెడిట్ తీసుకుని, చెడ్డ పనులకు కెసిఆర్ కారణమంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి వృత్తి కులాలకు ఏవైనా వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారని అన్నారు. పాపన్న గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడతారని అనుకున్నామని, కానీ అలా జరగలేదని పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం తెచ్చి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. అబద్దాలు తగ్గించి హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News