Thursday, August 21, 2025

బిసిలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ రాహుల్ ,ప్రియాంక ,ఖర్గేలను తెలంగాణకు తీసుకొచ్చి ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బిసిలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారన్నారు. బిసి లంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్క లేదని ఎద్దేవా చేశారు. బిసిల్లో ఏ కులానికి ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. గౌడ కులస్తులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు , 15 శాతానికి పరిమితం చేశారని ఆరోపించారు. కొత్త మద్యం షాపులకు గోప్యంగా నోటిఫి కేషన్ ఇచ్చారని విమర్శించారు. మద్యం షాపుల దరఖాస్తు ఫీజును 2 లక్షల రూపాయల నుంచి మూడు లక్షలకు పెంచారన్నారు.

సొసైటీలకు మద్యం షాపులు కేటాయించాలని, కల్తీ కల్లు పేరిట కల్లు దుకాణాలపై దాడులు ఆపాలన్నారు. పైసలు లేని పదవులు బిసి లకు ఇస్తున్నారని ఆరోపించారు. గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్లు 25 శాతం పెంచేదాకా ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ బిసి సమాజాన్ని కాంగ్రెస్ నయవంచన చేస్తోందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అమలులో దారుణంగా విఫలమైందని బిసి కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ విమర్శించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై మాట తప్పినట్టే మద్యం షాపుల్లో రిజర్వేషన్ల పెంపుపై మాట తప్పారన్నారు. బిసిలను వంచించిన కాంగ్రెస్‌కు బుద్ది చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ వంచనను ప్రజల్లోకి తీసుకెళతాం, జీవో 93 రద్దయ్యేదాకా ఉద్యమిస్తామని బిఆర్‌ఎస్ నేత నాగేందర్ గౌడ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News