అందివచ్చిన అవకాశంతో రేవంత్ రెడ్డి ఓ రాజకీయ లక్కీభాస్కర్ అయ్యారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియంత పోకడలు, నికృష్టపు మాటలు తప్ప ఎన్నిసార్లు మందలించినా రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభలో రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కొల్లాపూర్‌లో నిర్వహించిన సభలో 40 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 38 సార్లు కేసీఆర్ నామస్మరణ చేశారని అన్నారు. కేసీఆర్ నామస్మరణతో రేవంత్ తన పాప ప్రక్షాళన చేసుకుంటున్నాడని భావిస్తున్నామని తెలిపారు. వెళ్లిన ప్రతిచోటా పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అంటూ చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖండించారని గుర్తు చేశారు. ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా స్కూల్ కు ఇంతవరకు దిక్కు లేదన్న ఆయన మళ్లీ మరో పాఠశాలకు శంకుస్థాపన చేశారని అన్నారు. కొత్తగా పాలమూరుకు రేవంత్‌రెడ్డి చేసింది ఏమిటని నిలదీశారు.
తెలంగాణకు ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీయే
తెలంగాణ విధ్వంసం అయింది, సర్వనాశనమైంది కాంగ్రెస్ పాలనలోనే అని అన్నారు. ఆ తర్వాత టీడీపీ, చంద్రబాబు నాయుడు పాలనలోనే విధ్వంసం జరిగిందని తెలిపారు. ఇదే విషయం కాంగ్రెస్ నేతలు శ్రీక్రిష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తన నాన్న చనిపోతే దినాలకు నీళ్లు లేని దిక్కుమాలిన పాలన కాంగ్రెస్ పార్టీదని రేవంత్ రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది కాంగ్రెస్ పాలనలోనేనని ఆయన విమర్శించారు.
జూరాల నిర్మాణానికి నాలుగు దశాబ్దాల సమయం తీసుకున్నారని, 87,500 ఎకరాలు పారే ఆర్డీఎస్ కెనాల్ ను 8 వేల ఎకరాలకు పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరుకు ఎత్తిపోతలే శరణ్యం అని కల్వకుర్తి ఎత్తిపోతలకు 1984 జూన్ 16న ఎన్టీఆర్ ఆదేశాలు ఇస్తే 1997 డిసెంబరులో సర్వే కోసం 50 లక్షలు ఇచ్చారని అన్నారు. 2014 వరకు పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదని తెలిపారు. జలయజ్భంలో మొదలుపెట్టినా పనులు ముందుకు సాగనియ్యలేదని చెప్పారు. కేసీఆర్ దీనికి 40 టీఎంసీల నీళ్లు కేటాయిస్తే చంద్రబాబు అడ్డుపుల్ల వేశారని చెప్పారు.
పాలమూరులో కనిపిస్తున్న నీళ్లు కెసిఆర్ తెచ్చినవే
పాలమూరులో ప్రస్తుతం కనిపిస్తున్న నీళ్లు కేసీఆర్ తీసుకువచ్చినవేనని అన్నారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రయాణించిన రహదారి కూడా కేసీఆర్ నిర్మించినదేనని, నీకు తెలియకుంటే నీ పక్కన ఉన్న మంత్రికి అయినా సిగ్గుండాలని అన్నారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి రేవంత్‌ను సమర్ధించే నీ గురువు చంద్రబాబు నాయుడు, ఆంధ్రామీడియా, ఆంధ్రా రాజకీయ నేతల కుట్రలను అడ్డుకుని రాష్ట్ర నిధులతో రూ.32 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేసింది కేసీఆరేనని పేర్కొన్నారు. కేసీఆర్ కట్టిన సచివాలయంలో ఉంటూ పాలన చేస్తూ, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్‌లో కులుకుతూ కేసీఆర్‌ను విమర్శించడం చూస్తే రేవంత్‌కు మానసిక రుగ్మత ఉన్నట్లు అనిపిస్తుందని చురకలు వేశారు.
గురుదక్షిణ కింద రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. బనకచర్లపై చర్చ రాలేదని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని తెలిపారు. ఏపీ మంత్రి బనకచర్లపై చర్చ జరిగింది కట్టి తీరుతామని చెప్పారని చెబుతూ నల్లమల పులి చంద్రబాబును ప్లీజ్ అని ఆడుక్కోవడం ఎందుకు అంటూ రేవంత్‌రెడ్డిపై నిరంజన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. జూపల్లికి అభివృద్ధి అవసరం లేదు పదవులు మాత్రమే కావాలని, కొల్లాపూర్ అభివృద్ధి విషయంలో మంత్రి జూపల్లి విఫలమయ్యారని విమర్శించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు అభిలాష్ రంగినేని, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.