ఓటరు జాబితా నుంచి మాజీ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్‌బాబు పేరును తొలగిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని అతని స్వగృహానికి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి, సిబ్బంది శనివారం నోటీసులు అతికించారు. ఇటీవల కాలం వరకు ఆయన పౌరసత్వ వివాదం కేసులో ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని రమేష్‌బాబు భారతదేశ పౌరుడు కాదని, జర్మనీ పౌరుడు అని నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చిన విషయం విదితమే. 2009లో కాంగ్రెస్ నేత, ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. చెన్నమనేని రమేష్‌బాబు భారతీయుడు కాదని, అక్రమ మార్గాల ద్వారా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఓటుహక్కు పొందాడని, దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీంతో విచారణ చేపట్టి రమేష్ బాబు భారతీయ పౌరుడు కాదని, జర్మనీ పౌరుడు అని కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో 2013లో హైకోర్టు రమేష్ బాబు ఓటరు జాబితాలో అక్రమంగా తన పేరును నమోదు చేసుకున్నట్లుగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని నిర్థారించినందున ఎన్నికల ఓటరు జాబితా నుండి ఫామ్ 7 ప్రకారం పేరును తొలగిస్తామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 2వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని వేములవాడలోని నివాసానికి రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీస్ అంటించారు. అయితే, గడువులోగా పేరు తొలగింపుపై రమేష్‌బాబు నుంచి అభ్యంతరాలు రాకపోవడంతో ఓటరు జాబితా నుండి పేరును తొలగిస్తూ అతని నివాసానికి అధికారులు నోటీస్ అంటించారు.