Thursday, May 15, 2025

నగరంలో నకిలీ సర్టిఫికేట్ల దందా

- Advertisement -
- Advertisement -

మంచి కాలేజీల కోసం వెతకాల్సిన అవసరం లేదు, లక్షలు ఖర్చు చేసి సీటు కొనాల్సిన అవసరం లేదు, నాలుగేళ్లు కష్టపడి చదవాల్సిన అవసరం అంతకన్నాలేదు. కేవలం లక్ష రూపాలు ఇస్తే ఇంజనీరింగ్, రూ.80వేలు ఇస్తే డిగ్రీ సర్టిఫికేట్లను కోరిన యూనివర్సిటీ నుంచి ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్న ముఠాలు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి. ఏకంగా కార్యాలయాలు తెరిచి నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇలాంటి ముఠాలపై నిఘా పెట్టిన పోలీసులు వరుసగా అరెస్టు చేస్తున్నారు. ఈ ముఠాలు చదువు మధ్యలో ఆపివేసిన వారు, పూర్తి చేయలేని వారు, విదేశాలకు వెళ్లి చదువుకోవాలను కునేవారిని టార్గెట్‌గా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలకు చెందిన ఇంజనీరింగ్ డిగ్రీ నకిలీ సర్టిఫికేట్లను తెప్పించి అవసరం ఉన్న వారికి ఇస్తున్నారు.

మెహిదీపట్నంలో కన్సల్‌టెన్సీ ఏర్పాటు చేసుకున్న నిందితులు ఢిల్లీకి చెందిన నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసే ముఠాలతో సంబంధాలు పెట్టుకున్నారు. ఇక్కడ సర్టిఫికేట్ కోసం వచ్చిన వారి అవసం తెలుసుకుని, ఇంజనీరింగ్, డిగ్రీ సర్టిఫికేట్లు తయారు చేసి ఇక్కడికి పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్న నిందితులు ఢిల్లీ నుంచి కొరియర్‌లో వచ్చిన నకిలీ సర్టిఫికేట్లను ఎవరికీ అనుమానం రాకుండా పార్కుల్లో, ప్లేగ్రౌండ్‌లో ఇస్తున్నారు. విదేశాల్లో ఇక్కడి డిగ్రీలు నకిలీవా, ఒరిజినలా అని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడంతో ముఠాల ఆగడాలు ఆడింది ఆట పాడింది పాటగా మారుతోంది. పోలీసులు నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసే ముఠాలను అరెస్టు చేసినా కూడా కొత్త వ్యక్తులు ఈ వ్యాపారంలోకి వస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే నగర పోలీసులు రెండు ముఠాలను అరెస్టు చేశారు. గతంలో కూడా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్న ముఠాలను అరెస్టు చేశారు. నాచారం, రాఘవేంద్రకాలనీకి చెందిన జంగా దయాకర్ రెడ్డి(25) ఇంజనీరింగ్ సివిల్ డిస్‌కంటిన్యూ చేశాడు. నిందితుడికి అమెరికా వెళ్లి డబ్బులు సంపాదించాలని కోరిక ఉన్నా ఇంజనీరింగ్ పూర్తి చేయకపోవడం అడ్డుగా మారింది. దీంతో నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకుని అమెరికా వెళ్లాలని ప్లాన్ వేశాడు.

జూలై, 2021 తన స్నేహితుల ద్వారా వీసా స్లాట్ బుకింగ్ ఏజెంట్ ముద్దం స్వామితో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. స్వామి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నకలీ సర్టిఫికేట్ తీసుకుని అమెరికా వెళ్లాడు. అమెరికాలో పేస్ యూనివర్సిటీలో ఎంబిఏ చేస్తున్నాడు. దయాకర్‌కు ఫోన్ కంటాక్ట్‌లోకి వచ్చిన స్వామికి తాను అమెరికాకు వెళ్లాలనే విషయం చెప్పాడు. ఇంజనీరింగ్ సర్టిఫికేట్‌కు రూ.1.3లక్షలు ఖర్చు అవుతాయని చెప్పాడు. దానికి అంగీకరించిన దయాకర్ డబ్బులను ఫోన్ పే ద్వారా ముద్దం స్వామికి పంపించాడు. డబ్బులు అందిన తర్వాత నిందితుడికి ఓలా రైడర్ ద్వారా నకిలీ సర్టిఫికేట్లు ఇంటికి పంపించాడు. ముద్దం స్వామి నకిలీ సర్టిఫికేట్లతో అమెరికా వెళ్లడంతో ఓయూ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఇలాంటి బాధితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. కొందరు తమకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు భ్రమల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో నకిలీ సర్టిఫికేట్ల ముఠా చేతులు కలిసి చాలా సర్టిఫికేట్లు జారీ చేశారు.

నిఘా లేకపోవడంతో…
విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్తున్న వారిపై అక్కడి యూనివర్సిటీలు, అధికారులు సర్టిఫికేట్లను పరిశీలించకుండానే అనుమతి ఇవ్వడంతో చాలామంది విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్లను తీసుకుని విదేశాలకు వెళ్తున్నారు. అమెరికా, యూకేలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండడంతో వారు ఇండియా నుంచి వచ్చే విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వస్తుండడంతో నకిలీ సర్టిఫికేట్లతో వచ్చారా, అసలు సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా అనే విషయం కూడా ఆలోచించడంలేదు. అక్కడి యూనివర్సిటీలు విద్యను వ్యాపారం దృక్కోణంలో చూస్తున్నారు తప్ప విద్యాప్రమాణాలు పాటించడంలేదు.

రప్పించడంపై దృష్టి పెట్టడంలేదు…
నకిలీ సర్టిఫికేట్లతో విదేశాలకు వెళ్లిన వారిపై పోలీసులు నిఘా పెట్టడంలేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం నకిలీ సర్టిఫికేట్లు తీసుకుని ఇండియాలో ఉంటున్న వారిపై మాత్రమే నిఘా పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. చాలామంది నకిలీ సర్టిఫికేట్లు తీసుకుని విదేశాలకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో పలుమార్లు బయటపడుతున్నా కూడా వారిని తిరిగి ఇండియాకు తీసుకుని రావడంపై పోలీసులు దృష్టి సారించడంలేదు, వారిని గుర్తించి ఇండియాకి రప్పిస్తే ఇలాంటి వారు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News