33/11 కెవి విద్యుత్ లైన్ తీగ తెగిపడిన విషయాన్ని గమనించక పోవడంతో ద్విచక్ర వాహనంతో సహా రైతు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, కొత్తూరులో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీగా ఈదురుగాలతోపాటు భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో 33/11 కెవి విద్యుత్ లైన్ తీగ ఒకటి తెగి కింద పడింది. గ్రామానికి చెందిన పైడిమర్ల పెద్ద మురళీ రెడ్డి (59) అనే రైతు సోమవారం ఉదయం ఎప్పటిలాగే ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్లాడు.
అయితే, తెగిపడిన విద్యుత్ లైన్‌ను అతను గమనించలేదు. ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు వైరు దాటగా వాహనంతో సహా గుర్తుపట్టని రీతిలో కాలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు రైతులు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేయగా సరఫరా నిలిపివేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.