Wednesday, July 16, 2025

ఎరువుల కోసం పడిగాపులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించినటువంటి రైతుల కష్టాలు స్వరాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ మొదలయ్యాయని చెప్పకనే చెప్పవచ్చు. యూరియా కోసం రైతులు బారులు తీరుతున్న పరిస్థితి రానే వచ్చింది. సరిపడినంత యూరియా లేదని ఒక్కొక్కరికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు.

రైతులు చేసేది ఏమీ లేక ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో కేంద్రం భారీగా కోత పెట్టింది. కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే రైతులకు మళ్లీ ఎరువుల కరువు తెచ్చింది. సరఫరాపై చేతులెత్తేయడంతో యూరియా కోసం క్యూలో చెప్పులు, కుస్తీలు మొదటికొచ్చాయి. ఎంత తక్కువ ఎరువులు వాడితే అంత ప్రోత్సాహకాలు ఇస్తామంటూ స్పష్టం చేసింది. ఉమ్మడి పాలనలో ఎరువుల కోసం రైతులు పడ్డ గోసకు మాజీ సిఎం కెసిఆర్ చరమగీతం పాడారు.

సాగు రెట్టింపైనా, ఎరువుల వినియోగం రెండింతలైనా ఎక్కడా కొరత లేకుండా చూసుకున్నారు. సీజన్‌కు ముందే ఎరువులు తెప్పించి జిల్లా కేంద్రాల్లో నిల్వ చేయించి వానలు కురియగానే రైతులకు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని భారీగా తగ్గించింది. నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్ లకు ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీకి భారీగా కోతలు పెట్టింది. 2023- 2024లో సబ్సిడీని తగ్గించడంతో పాటు 2023 జనవరి నుంచి ఏప్రిల్ కాలానికి సబ్సిడీని సైతం సవరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ఇంధన ధరలు గణనీయంగా తగ్గడమే సబ్సిడీ కోతకు కారణమని పేర్కొంది. గత ఏడాది యూరియా ధర టన్నుకు 627 డాలర్లు ఉంటే ప్రస్తుతం 330 డాలర్లుగా ఉంది. అదే విధంగా డిఎపి గత ఏడాది 925 డాలర్లు కాగా, ఈ సంవత్సరం 540 డాలర్లకు తగ్గింది. నిరుడు కంటే ఈ ఏడు 42% మేరా తగ్గిందని చెప్పవచ్చు.

డిఎపి ధర నిరుడు టన్నుకు 1030 డాలర్లకు పెరిగింది. పాస్పరిక్ యాసిడ్, అమోనియా ధరలు ఏడాది వ్యవధిలో 35% తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఎరువులపై ఇచ్చే సబ్సిడీ నిధుల్లో కేంద్రం 22.25% కోత విధించింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రాలకు ఎరువుల కోటాను కుదించిన కేంద్రం రసాయనాల వాడకం తగ్గించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపింది. అందుకే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రైతులను మోసం చేస్తుందని చెప్పొచ్చు. గత యాసంగి పంట సీజన్‌కు నత్రజని, భాస్వరం, పోటాష్, సల్ఫర్ వంటి ఎరువులకు అక్టోబర్ 1, 2022 నుండి మార్చి 31, 2023 వరకు సబ్సిడీ కింద రూ. 51,875 కోట్లను కేటాయిస్తే, ఈసారి రూ. 22,303 కోట్లు కేటాయించింది. అనగా 57% కోత విధించింది. ఒకవైపు అంతర్జాతీయంగా ఎరువుల ధరలు తగ్గుతున్నప్పటికీ ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతున్నది. రైతుల్లో 95% చిన్న, సన్నకారు రైతులే ఉంటారు.

వీరిపై ఎరువుల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వాలు ఎరువులను సబ్సిడీపై అందించాలి. కానీ కొన్ని సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్, ఇప్పుడు పాలిస్తున్నటువంటి బిజెపి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. సబ్సిడీలను ఎత్తివేయడం జరిగింది. కొన్ని ఏళ్లుగా దేశంలో సాగుభూమి విస్తీర్ణం పెరగడంతో వాణిజ్య పంటల సాగు కూడా పెరిగింది. తద్వారా రసాయన ఎరువుల వాడుకం కూడా పెరిగింది. సేంద్రియ సాగును ప్రోత్సహించే పిఎం ప్రణామ్ పథకాన్ని తీసుకువచ్చి ఇందులో యాసంగి సీజన్‌కు 57% కోత విధించడం మూలాన రైతులు ఇబ్బందిపడుతున్నారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై మొత్తంగా సబ్సిడీ రూ. 2.54 లక్షల కోట్లు ఉండగా, ఆర్థిక సంవత్సరం రూ. 1.75 లక్షల కోట్లకు తగ్గించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా సబ్సిడీని భారీగా తగ్గించింది. ఈ పథకం అమలు ద్వారా క్రమంగా ఎరువుల పంపిణీకి కోత పెట్టేందుకు ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చి ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సబ్సిడీ మొత్తాన్ని ఇతర అవసరాల కోసం కేటాయిస్తామని ఆశ చూపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణలో భూగర్భ జలాలు పెరగడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు గత ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు, ఎరువుల షాపుల ముందు క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఎరువుల అవసరాలకు సంబంధించిన అంచనాలకు, వాస్తవ పంపిణీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది.

ఈ సీజన్‌లో అన్ని ఎరువులు కలిపి సుమారు 23 లక్షల టన్నులు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. 2025 ఏప్రిల్ నుంచి జులై వరకు అన్ని ఎరువులు కలిపి 16.52 లక్షల టన్నుల మేర కంపెనీలు సరఫరా చేయాలి. ప్రస్తుతానికి 7.8 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే సరఫరా చేసిన కంపెనీలు 8.72 లక్షల టన్నులకు కోతపెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తే రైతులు ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ ఆ భారాన్ని రైతులపై మోపట్లేదని, ఎరువుల ధరలు ఎంత మాత్రం పెంచట్లేదని ముసలి కన్నీరు కారుస్తున్నది కేంద్ర ప్రభుత్వం.

ఫలితంగా ఎరువుల ధరలు తగ్గడంతో రైతులకు చేరాల్సిన ఆర్థిక ప్రయోజనం కేంద్ర ఖజానాకు మళ్లుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ రైతులకు ఎరువుల ఉత్పత్తులు ప్రభావితం చేస్తున్న సమయంలో ఈ కోతలు వచ్చాయి. సమృద్ధిగా నిల్వలు ఉన్నప్పటికీ డిమాండ్‌కు తగ్గ సప్లై లేక ప్రైవేటు డీలర్లను రైతులు ఆశ్రయించి ఎక్కువ డబ్బులు పెట్టి రసాయన ఎరువులను కొంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ప్రైవేట్ డీలర్లు సైతం జింక్ బస్తా లేదా ఘంట గోలీలు కొంటేనే యూరియా ఇస్తామని పెట్టడం, లేనిచో ఎక్కువ ధరకు యూరియాను మార్కెట్లో అమ్ముకోవడం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యూరియా కోసం లైన్లు కట్టి నిలుచుకునేటువంటి పరిస్థితి దాపురించింది. కేంద్రం పెట్టినటువంటి ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ రసాయన ఎరువులలో చర్యలు చేపట్టాలని నిర్ణయించి, పచ్చరోట్ట, కంపోస్ట్ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని భావించింది. ఇప్పుడున్న ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి, సకాలంలో రైతులకు ఎరువులు అందించి, రైతులకు అన్యాయం జరగకుండా, అధిక దిగుబడి వచ్చేలా ఎరువుల కొరతను అధిగమించాలని ఆశిద్దాం.

మోటె తులసి, 88979 23496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News