మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రాష్ట్రంలోని సోమవారం కూడా రైతులకు యూరి యా తిప్పలు తప్పలేదు. పెద్దపల్లి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మంచిర్యాల, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్ తదితర జి ల్లాల్లో రైతులు యూరియా కోసం వేకువజాము నుంచే క్యూలు కట్టారు. కొన్ని ప్రాం తాల్లో రోడ్లపై ధర్నాలు, రాస్తారోకో చేపట్టారు. పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండల కేం ద్రంలోని పాత బస్టాండ్ వద్ద వరంగల్రాయపట్నం ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధర్మారం సిసిఎస్ సెంటర్ ద్వారా యూరియా సరఫరా చేస్తామ ని ప్రకటన ఇచ్చి సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు ఆందోళ న వ్యక్తం చేశారు. ధర్మారం బొమ్మరెడ్డిపల్లి, కొత్తపల్లి,
ఎర్రగుంటపల్లి గ్రామాలకు చెందిన రైతులు తమకు వెంటనే యూరియా సరఫరా చేయాలని ఆందోళనకు దిగడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నాగర్కర్నూల్ జిల్లా, ఊర్కొండ ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజామునే రైతులు క్యూలో నిలబడ్డారు. ఒక్కో రైతు ఆశలు పెట్టుకున్నా అందరికి తగినంత యూరియా దొరకడం లేదని, గంటల తరబడి ఎండ వాన ఆనక క్యూలో నిలబడినా ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వడంతో సరిపోక నానాతిప్పలు పడుతున్నామని రైతులు వాపోయారు.
మహబూబ్నగర్ జిల్లా, బాలానగర్ మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి సోమవారం యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఒక్కరికీ ఒక్క బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో కొంతమంది ఇంటి బాట పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. మోత్కూర్లోని గ్రోమోర్, ఫెర్టిలైజర్ దుకాణాలు, రైతు సేవా సహకార సంఘాలకు యూరియా వచ్చిందని తెలియడంతో బారులు తీరారు. సూర్యాపేట జిల్లా, కోదాడ రూరల్ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో పిఏసిఎస్ కార్యాలయం ముందు రైతులు యూరియా కోసం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రైతులు పిఏసిఎస్ కార్యాలయం ముందు లైన్లో నిలబడ్డారు. పది గంటలైనా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు ఒక దశలో సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. ఇదే మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో రైతులు ఆందోళన నిర్వహించారు.
సోమవారం యూరియా లోడు రావడంతో రైతులు భారీగా పిఏసిఎస్ కేంద్రానికి చేరుకున్నారు. యూరియా లోడు సగం దింపుతుండడంతో రైతులు మొత్తం లోడు దింపాలని ధర్నా నిర్వహించారు. ఒక కార్డుకు ఒక యూరియా బస్తా ఎలా సరిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలంలో సోమవారం యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. గూడెం సహకార సంఘం కార్యాలయం తెరవకముందే రైతులు వచ్చి యూరియా కోసం పట్టా పాస్ పుస్తకాలను వరుసలో పెట్టారు. ఎండవేడిని తట్టుకోలేక పట్టా పాస్ పుస్తకాలను వరుసలో పెట్టి పక్కన యూరియా కోసం రైతులు నీడన వేచి ఉన్నారు. దండేపల్లి సహకార సంఘ కార్యాలయం ముందు అదే పద్ధతిలో రైతులు పాస్ పుస్తకాలను వరుసలో పెట్టారు. కార్యాలయం తెరవగానే వరుసలో బారులు తీరారు.రంగారెడ్డి జిల్లా, జిల్లేడుచౌదరిగూడెంలో యూరియా వెంటనే అందించాలని పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
క్యూలైన్లో ఎండ తీవ్రత తట్టుకోలేక కిందపడిన రైతులు
సిద్దిపేట జిల్లా, నంగునూరు మండల కేంద్రంలోని మన గ్రోమర్ సెంటర్ కి 1160 యూరియా బస్తాలు రావడంతో రైతులు వేకువజామున నుండే సెంటర్ వద్ద క్యూలైన్లో రైతులు బారులు తీరారు. చాయ్ తాగకుండా, అన్నం తినకుండా క్యూ లైన్లో నిలబడడంతో ఎండా తీవ్రతకు కొందరు రైతులు నీరసానికి గురై కింద పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న రైతులు వారిని నీడకు తీసుకెళ్ళి తాగునీటిని, ఒఆర్ఎస్ ప్యాకెట్లను తాగించడంతో మళ్ళీ తిరిగి క్యూలైన్లో నిలబడే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా, చేగుంట మండల కేంద్రంలో రైతులు ఆదివారం అర్ధరాత్రి నుండి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద పడిగాపులు కాశారు.
ఉదయం వ్యవసాయ అధికారులు వచ్చి టోకెన్లు ఇస్తారనే ఉద్దేశంతో ముందుగా లైన్లో ఉండాలని రాత్రి నుండి చెప్పులు, కొమ్మలు పెట్టుకుంటూ అక్కడే కూర్చున్నారు. అయితే, రాత్రి నుండి పడిగాపులు కాస్తున్న రైతులకు తీరా సోమవారం ఉదయం 6 గంటలకు యూరియా రావడం లేదని అధికారులు తెలపడంతో కోపోద్రిక్తులైన గాంధీ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.వికారాబాద్ జిల్లా, యాలాల మండలం, ఎల్మాకన్న సొసైటీలో ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం వద్ద కూడా మళ్లీ రైతులకు తిప్పలు తప్పడం లేదు. పలు సొసైటీ కేంద్రాల వద్ద యూరియా ఇస్తారని రైతులు ఉదయం ఆరు గంటల నుంచి క్యూలైన్లలో సొసైటీ కార్యాలయం ముందు బారులు తీరారు. సొసైటీలో 250 బస్తాలు యూరియా ఉండడంతో ఎకరాకు ఒక బస్తా ఇస్తామని అధికారులు తెలిపారు.