పంట పొలాలకు సాగు నీరందించకుంటే మధ్యమానేరు జలాశయాన్ని ముట్టడిస్తామని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు హెచ్చరించారు. బుధవారం మండలంలోని పొత్తూరు బ్రిడ్జిపై వల్లంపట్ల, ఓగులాపూర్, నర్సక్కపేట, రంగంపేట, వంతడ్పుల, గాలిపెల్లి, జవారిపేట, తాళ్లపెల్లి గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వీరికి రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీవైస్ చైర్మన్ సిద్దంవేణు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బంది లేకుండా పంట పొలాలకు నీరందించామని, ఎప్పుడు కూడా రైతులను ఇబ్బంది పెట్టలేదన్నారు. ఓ వైపు వర్షాలు లేక, మరో వైపు సాగు చేసుకునేందుకు నీరు లేక రైతన్నలు గోస పడుతున్నారన్నారు.
వెంటనే మధ్యమానేరు జలాశయం నుండి కుడి కాలువ ద్వారా పంట పొలాలు సాగు చేసుకునేందుకు నీటీని తక్షణమే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలసి మిడ్‌మానేరు ప్రాజెక్టును ముట్టడిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ స్పందించి నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడాలన్నారు. ప్రభుత్వం కాళేశ్వరం నీటిని అందించే వెసులుబాటు ఉన్న కుట్ర చేస్తుందన్నారు. బ్రిడ్జిపై వాహనాలు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు కేవిఎన్‌రెడ్డి, సిద్దం శ్రీనివాస్, చిమ్మనగొట్టు శ్రీనివాస్, పట్నం శ్రీనివాస్, ఆంజనేయులు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.