మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డుపై మొక్కల కలుపు తీసేందుకు వచ్చిన కూలీల పైకి ట్రక్కు దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. కూలీలు మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సిఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం. ఒడిశాకు చెందిన నారాయణ (28), చెక్మోహన్ (24), జైరామ్ (32) రెండు రోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి శామీర్‌పేటలో ఉంటున్నారు. సోమవారం ఇతర కూలీలతో కలిసి రింగ్ రోడ్డుపై మొక్కల కలుపు తీసేందుకు వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి కూలీలు అందరూ కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో విశాఖపట్నంలోని గాజువాక నుంచి సెల్‌ఫోన్ టవర్ సామగ్రితో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మేడ్చల్‌కు వస్తున్న
ట్రక్కు అతి వేగంగా కూలీలపైకి దూసుకు వచ్చింది. తమ వైపు దూసుకువస్తున్న వాహనాన్ని గమనించిన కొందరు కూలీలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వాహనం ఆగకుండా అదే వేగంతో వచ్చి తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న నారాయణ, చెక్మోహన్, జైరామ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన ఆ ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వాహనం డ్రైవర్ గణేష్ మద్యం మత్తులో ఉండి అజాగ్రత్తతో.. నిర్లక్షంగా నడపంతోనే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.