Wednesday, September 3, 2025

లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ/ఉప్పల్/బాలాపూర్: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉప్పల్ అమృత కాలనీలో నివసిస్తున్న ఎంబిఎ విద్యార్థి రిషితేజ దుర్మరణం చెందారు. ఏకైక కుమారుడి మరణం ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. కన్న కలలను చిదిమేశాయి. ఉన్నత చదువు చదివి ఉద్యోగం చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని భావించిన తరుణంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఈ సంఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ స్వరూప్ నగర్ సమీపంలోని అమృత కాలనీలో నివసిస్తున్న పెద్దపెల్లి జిల్లా రామగుండం మండలం వేమునూరుకు చెందిన రాపోలు రవీందర్ రావు-కిరణ్ మై దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె రితిక బీటెక్ పూర్తిచేసుకుని టిసిఎస్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఏకైక కుమారుడు రిషి తేజ (21) హైదరాబాదులో బిబిఎ పూర్తి చేసుకుని ఎంబిఎ ఉన్నత చదువుల కోసం గత మే 19న లండన్ కు వెళ్లాడు. ఒకే గదిలో పదిమంది స్నేహితులతో కలిసి నివసిస్తున్న రిషి తేజ వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని రెండు కార్లలో నిమజ్జనానికి బయలుదేరారు. తిరిగి వస్తున్న సమయంలో వీరి కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రిషి తేజ మరణించారు. ఒక్కగానొక్క కుమారుడు రిషి తేజ లండన్ లో ఎంబిఎ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్ తో తిరిగి హైదరాబాద్ వచ్చి ఉన్నత ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను పోషిస్తాడన్న కన్న కలలు ఆవిరయ్యాయనీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. రిషి తేజ మృతదేహం రావడానికి వారం, పది రోజులు పట్టవచ్చని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్ గ్రామానికి చెందిన తర్రె చైతన్యయాదవ్ @అభి (22) లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఆతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోవడంతో మంగళవారం గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.గత 7 నెలల క్రితం మాస్టర్స్ విద్యను అభ్యసించేందుకు లండన్‌కు వెళ్లిన చైతన్య మరో 8 మంది స్నేహితులతో కలిసి వినాయకచవితి నిమజ్జనానికి వెళ్లి ఎల్ల్‌ఫోర్డ్ బార్కింగ్ ఏరియా నుండి సౌత్‌ఎండ్ ఆన్ సీ వైపు కారులో తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో కారు క్యారేజ్ వే ఇన్ ఎస్సెక్స్ వద్ద చైతన్య ప్రయాణిస్తున్న కారును ఢీకొన్నట్లుగా తెలుస్తుంది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చైతన్యను అక్కడి అధికారులు రాయల్ లండన్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లుగా తెలుస్తుంది.ప్రమాదంలో గాయాలపాలైన మరో 5 గురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉందని తెలుస్తుంది.అదేవిధంగా చైతన్య మృతదేహం నాదర్‌గుల్‌కు చేరుకునేందుకు మరో 4,5 రోజులు పట్టవచ్చని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News