సిమెంట్ ట్యాంకర్ ఢీకొని తండ్రి, కూతురు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ జిల్లా, కోట్‌పల్లి మండలం, బీరెల్లి గ్రామానికి చెందిన తాండ్ర రవీందర్ (45), అతని కుమార్తె కృప (13)ను బీరెల్లి గ్రామానికి తీసుకువెళ్లేందుకు బైక్‌పై తోల్కట్ట గ్రామ శివారులోని గురుకుల పాఠశాల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో చేవెళ్ల మున్సిపల్ కేంద్రానికి రాగానే సిమెంట్ ట్యాంకర్ వెనుక నుంచి వచ్చి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారి కృప, తాండ్ర రవీందర్ లారీ చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పంచనామా నిర్వహించారు.
మృతదేహాలను 108 వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఈ ప్రమాదానికి బాధ్యుడైన సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, బీజాపూర్ అంతర్ రాష్ట్ర రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సుమారు అరగంటకు పైగా కష్టపడి వాహనాల రాకను పునరుద్ధరించారు. కాగా, రవీందర్ కుమార్తె కృప మొయినాబాద్ మండలం, తోల్కట్ట గ్రామ శివారులోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది.