ఎక్కడికి వెళ్లినా తండ్రి వెంటే వెళ్లే బుడతడు నాన్నతో గణేష్ నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవ శాత్తు ఆటో చెరువులో పడి తండ్రితో కలిసి కానరాని లోకాలకు వెళ్లిన దుర్ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుత్బుల్లాపూర్ దుండిగల్ మండలం దుండిగల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ (34)సోని దంపతులు నివాసం ఉంటారు. స్థానిక శ్రీనివాస్ ఆటో నడుపుతు ఉంటాడు. వీరికి ముగ్గురు పిల్లలు.పెద్ద కుమారుడు వెస్లీ (07) ఒకటో తరగతి చదువుతున్నాడు. వెస్లీ తండ్రి శ్రీనివాస్‌తో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. ఆటోలో గణేష్ నిమజ్జనానికి కాలనీ వాసులతో వెళ్లిన తండ్రి కొడుకులు గణేష్ నిమ్మజ్జనం అవగానే దుండిగల్ చెరువు కట్టపై ఆటో మలుపుకోవడానికి వెళ్లిన క్రమంలో చీకట్లో ప్రమాదవశాత్తు చెరువులో వీరి ఆటో పడిపోయింది. ఈ విషయం ఎవరు గమనించకుండా అతనికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో చూసిచూసి నిమజ్జనం పూర్తి చేసుకుని కాలనీ వాసులు ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ శ్రీనివాస్, వెస్లీ మాత్రం కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఇంట్లో వారు ఆందోళన చెందారు.
రాత్రంతా ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో చివరికి దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని పరిశీలించగా, ఒక రాయి విరిగి చిందరవందరగా పడిఉండటాన్ని గుర్తించారు. చీకట్లో ఆటో చెరువులో జారిపోయిందన్న అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. డిఆర్‌ఎఫ్ సిబ్బంది బృందం చెరువులో బోట్లు, పరికరాలతో సహాయంతో సోమవారం ఉదయం మూడు గంటల పాటు గాలించి చివరికి ఆటోను, తండ్రి కుమారుడి మృతదేహలను వెలికితీశారు. ఆటో ముందు సీట్లో కూర్చొని అలాగే మృతి చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను చూసిన కుటుంబసభ్యులు స్థానికులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. బంధం చివరి క్షణాల్లో కూడ విడదీయలేదా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడమే తనకిష్టం. అదే బంధం చివరికి నాన్నతో కలిసి మరణంలో కూడా అతడిని విడవకుండా చేసిందని తల్లి రోదనలు మిన్నంటాయి.