పాము తాను పెట్టిన గుడ్డును తానే తింటుంది ఆకలి బాధతో…పులి కూడా తన కూనలను తానే చంపి తింటుంది అది కూడా ఆకలికి తట్టుకోలేక ఒకటి క్రూర జంతువు…మరొకటి విష జంతువు కానీ మనిషి అది కూడా కన్న తండ్రి తన బిడ్డలను తానే చంపితే…అల్లారు ముద్దుగా చూడాల్సిన తండ్రే మృగమై చిన్నారుల జీవితాలను చిదిమేస్తే…కంటికి రెప్పలా కాపాడే వాడు అనునిత్యం రక్షించే వాడు, ఆప్యాయంగా చూస్తాడనుకుని ఆనందంతో వెంటవచ్చిన చిన్నారులకు ఏమితెల్సు తన తండ్రే కాలయముడై చంపేస్తాడని. ముగ్గురు పిల్లల్ని అతి దారుణంగా చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు చిన్నారులను క్రూరంగా హతమార్చిన తండ్రి చివరికి తానే ఆత్మహత్య చేసుకోవడం ప్రాంతాన్ని కుదిపేసింది.
ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ కడ తెరిచి
ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం మండలం పెద్దబోయపల్లి గ్రామానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు(35) గత నెల 30న తన ముగ్గురు పిల్లలతో తన దోర్నాల మీదుగా హజీపూర్, డిండికి బైక్పై వచ్చాడు. కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారిన వెంకటేశ్వర్లు వర్షిణి(6), శివధర్మ(4) అనే ఇద్దరు చిన్నారులను అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం సూర్యతాండ సమీపంలో పెట్రోల్ పోసి తగలబెట్టి హతమార్చాడు. మరొక చిన్నారి మోక్షిత(8) మృతదేహం కల్వకుర్తి మండలం తాండ్ర శివారులో లభించింది.
పిల్లల్ని కర్కశంగా చంపి
ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడి వరకు వచ్చిన వెంకటేశ్వర్లు ఈ నెల 2న వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో చెరువు వద్ద ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా వెల్దండ ఎస్సై కురుమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో హజీపూర్ నుంచి పలు ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాలు పరిశీలించి అచ్చంపేట, ఉప్పునుంతల, వెల్దండ పోలీసులు బృందాలుగా ఏర్పడి పిల్లల కోసం వెతికారు. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్దకూతురు మోక్షిత మృతదేహం లభించింది. అంతకు ముందు ఉప్పునుంతల మండలం సూర్యతండా సమీపంలో వర్షిణి, శివశర్మ మృతదేహాలు పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్లు కుటుంబ కలహాలతో ఉన్మాదంతో ముగ్గురిని చంపి పెట్రోల్ పోసి కాల్చి వేశాడని పోలీసులు నిర్దారించారు.